2, డిసెంబర్ 2011, శుక్రవారం

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యాపారస్ధుల బంద్



గురువారం భారత దేశ వ్యాపితంగా వ్యాపారస్ధులు బంద్ పాటించారు. రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. న్యూఢిల్లీతో పాటు దేశ వ్యాపితంగా బంద్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.
భారతీయ జనతా పార్టీ ఈ బంద్ లో పాల్గొంది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. బి.జె.పి శ్రేణులు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి. రాజధాని ఢిల్లీలో కనీసం ఇరవై చోట్ల ప్రదర్శనలు దిష్టి బొమ్మ దహనాలు జరిగాయని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
అఖిలభారత బంద్ లో పాల్గొంటూ వ్యాపారస్ధులంతా బంద్ పాటించారని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్’ సంస్ధ ఢిల్లీ విభాగం ప్రకటించింది. దేశవ్యాపితంగా వ్యాపార వర్గాలు బంద్ పాటించాయని ఆ సంస్ధ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్ వాల్ తెలిపాడు. “దేశవ్యాపితంగా గల పదివేల వ్యాపారస్ధుల సంఘాలకు చెందిన ఐదు కోట్ల మంది వ్యాపారస్ధులు బంద్ లో పాల్గొంటున్నారు” అని ఖండేల్ వాల్ ప్రకటించాడు. “వ్యాపారస్ధులు వాణిజ్య మార్కెట్లలో దేశవ్యాపితంగా మార్చ్ లు నిర్వహించారు” అని ఆయన తెలిపాడు.
“రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతిస్తే దేశంలో ఆ రంగంలో అసమాన పోటి తలెత్తుతుంది. బహుళజాతి కంపెనీల వైపుకే పరిస్ధితులు అనుకూలిస్తాయి. వాటితో పడలేక దేశీయ వ్యాపారస్ధులు దివాలా తీస్తారు. అంతిమంగా వినియోగదారులు కూడా నష్టపోతారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అవసరం లేదు కనుక తమ నిర్ణయాన్ని కేబినెట్ ఉపసంహరించాలి” అని ఖండేల్ వాల్ డిమాండ్ చేశాడు.
“పదిహేను శాతం వృద్ధి రేటుతో దేశీయ రిటైల్ రంగం, దేశీయ పెట్టుబడులతో విజయవంతంగా నడుస్తోంది. జిడిపిలో పది శాతం భాగం వాటా ఆ రంగం కలిగి ఉంది. కనుక విదేశీ పెట్టుబడులు అవసరం లేదు” అని ఖండేల్ వాల్ చెప్పాడు. “విదేశీ రిటైల్ కంపెనీలు నగరాల్లో ప్రారంభించి మొదట గ్రామీణ మార్కెట్లనుండీ, చిన్న పట్నాలనుండీ సరుకులు సేకరించవచ్చు. కానీ ఆ తర్వాత వారు అమ డబ్బు, అధికారాలను వినియోగించి విదేశీ సరుకులనే ప్రధానంగా దించుతారు. వారే రిటైల్ రంగంలో ఆధిక్యత సంపాదిస్తారు” అని ఆయన వివరించాడు.
తమిళనాడులోని వ్యాపారస్ధుల సంఘాలు బంద్ లో పాల్గొని విజయవంతం చేశాయని వార్తలు వచ్చాయి. దాదాపు ఇరవై లక్షల వ్యాపారులు బంద్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. షాపుల యజమానులకూ, షాపుల్లో పని చేసేవారికీ కేంద్ర నిర్ణయం నష్టం చేస్తుందని తమిళనాడు వనిగర్ సంగకాలిన్ పెరవై సంఘం తెలిపింది. చెన్నైలో ప్రసిద్ధి చెందిన కోయంబీడు కూరగాయల మార్కెట్ సైతం బంద్ పాటించింది.
ఒడిషా రాజధాని భువనేశ్వర్ తో పాటు కటక్, బెర్హంపూర్, సంబాల్ పూర్, రూర్కెలా, బాలాసోర్ పట్టణాల్లో బంద్ విజయవంతంగా జరిగిందని వ్యాపార సంస్ధలు ప్రకటించాయి. వివిధ రాజకియపార్టీలు, కార్మిక సంఘాలు, సామాజిక సాంస్కృతిక సంస్ధలూ బంద్ కు మద్దతు తెలిపాయి. బీహార్ లో బంద్ పెద్దగా జరగలేదని వార్తలు వచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రవేటు స్కూళ్ళు మాత్రం మూతపడ్డాయి.
గుజరాత్ లో కూడా బంద్ పాక్షికంగా జరిగినట్లుగా మధ్యాహ్నం వార్తలను బట్టి తెలుస్తోంది. అక్కడ బి.జె.పి పాలకపార్టీగా ఉన్నందున ఆ పార్టీ బంద్ కు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం విదేశీ ప్రవేటు పెట్టుబడులను ఆహ్వానించడంలో ఛాంపియన్ ఫోజు పెడుతున్నందున అక్కడ  బంద్ విజయవంతం కావడం ఆ ప్రభుత్వ ఇమేజికి దెబ్బ కావచ్చు. మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బి.జె.పి బంద్ లో పాల్గొంది. 35 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలు షాపులు మూసి బంద్ పాటించారు.
ఉత్తర ప్రదేశ్ లో రాజధాని లక్నోతో పాటు హజరత్ గంజ్, లాల్ బాగ్, అమీనాబాద్, యాహ్యా గంజ్ తదితర నగరాలలో షాపులు బంద్ పాటించాయి. వ్యాపారస్ధులు తమ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని హైద్రాబాద్ లో బంద్ పాక్షికంగా జరిగినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో షాపులు మూసి వర్తకులు ప్రదర్శనలు నిర్వహించారు. పంజాబ్ లో కూడా బంద్ పాక్షికంగా విజయవంతం అయ్యింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి