12, డిసెంబర్ 2011, సోమవారం

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి డౌన్


పలు ప్రతికూలాంశాల నేపథ్యంలో రూపాయి రికార్డు స్థాయి పతనం కొనసాగుతోంది.
 
ముంబై: పలు ప్రతికూలాంశాల నేపథ్యంలో రూపాయి రికార్డు స్థాయి పతనం కొనసాగుతోంది. తాజాగా సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 81 పైసలు క్షీణించి కొత్త ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో 52.85 వద్ద ముగిసింది. 

పారిశ్రామికోత్పత్తి ప్రతికూల వృద్ధి నమోదు చేసిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణకు దిగడమే ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. ఈ పరిణామంతో డాలర్లకు మరింత డిమాండ్ పెరిగిందని వివరించారు. స్టాక్ మార్కెట్ల పతనం, విదేశీ మార్కెట్లలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం మొదలైన అంశాలే రూపాయి క్షీణతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు అభిప్రాయపడ్డారు. ఇక యూరో బలహీనపడటమూ దీనికి తోడైందని ఐడీబీఐ బ్యాంక్ ట్రెజరీ ఆపరేషన్స్ విభాగం హెడ్ ఎన్‌ఎస్ వెంకటేష్ తెలిపారు. 

అటు దిగుమతిదారులు కూడా డాలర్ల కోసం ఎగబడటం మరో కారణమన్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే కాస్త తక్కువగా 52.10 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత మరింత క్షీణించింది. చివరికి ఆల్‌టైం కనిష్టమైన 52.85 (1.56%) వద్ద ముగిసింది. సమీప భవిష్యత్‌లో రూపాయి పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదని, బేరిస్ ట్రెండ్ కొనసాగవచ్చని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మోజెస్ హార్డింగ్ వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి