12, డిసెంబర్ 2011, సోమవారం

3 రోజుల్లో 1,000 పాయింట్లు!

  • మరో 343 పాయింట్లు డౌన్
  • 16,000 దిగువకు సెన్సెక్స్
  • షాకిచ్చిన ఐఐపీ గణాంకాలు
  • 102 పాయింట్లు జారిన నిఫ్టీ
  • మెటల్, బ్యాంకింగ్ బోర్లా
  • 4% పతనమైన ఆర్‌ఐఎల్
  • ఏడాది కనిష్టానికి ఐసీఐసీఐ

వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాం కాలు షాకివ్వడంతో వారం మొదట్లోనే ఇండెక్స్‌లు కుప్పకూలాయి. మరోవైపు చైనా, హాంకాంగ్‌తోపాటు యూరప్ మార్కెట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలు చేపట్టారు. దీంతో సెన్సెక్స్ మరో 343 పాయింట్లు పతనమైంది. 16,000 దిగువకు చేరి 15,870 వద్ద ముగిసింది. 

ఇది రెండు వారాల కనిష్ట స్థాయి! కాగా, గత వారం చివరి 2 రోజుల్లో 664 పాయింట్లు దిగజారిన సంగతి తెలి సిందే. వెరసి మూడు రోజుల్లో 1,007 పాయింట్లను (6%) కోల్పోయింది. అయితే సెన్సెక్స్ తొలుత లాభాలతోనే ప్రారంభమైంది. ఒక దశలో 16,360 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఆపై ప్రతికూల వార్తలు రావడంతో మిడ్ సెషన్ నుంచీ మార్కెట్ పతనం ప్రారంభమయ్యింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 4,910 వద్ద గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, చివరికి 102 పాయింట్లు తిరోగమించి 4,765 వద్ద స్థిరపడింది.

ఐటీ షేర్లు ఓకే...
బీఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 4% తిరోగమిస్తే, బ్యాంకింగ్, యంత్ర పరికరాలు, ఆయిల్, రియల్టీ, పవర్, ఆటో రంగాలు 3-2.5% మధ్య దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌లో మూడు షేర్లు మాత్రమే నిలదొక్కుకున్నాయి. రూపాయి మరింత బలహీనపడ్డ నేపథ్యంలో విప్రో 2.6% పుంజుకోగా, ఇన్ఫోసిస్, టీసీఎస్ దాదాపు 1% లాభపడ్డాయి. ఫలితంగా ఐటీ రంగం 1% బలపడింది.

ఏడాది కనిష్టానికి...
ఇన్వెస్టర్ల అమ్మకాల దెబ్బకు టాటా పవర్ 6.5%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.3%, స్టెరిలైట్ 3.2%, సెయిల్ 5.7%, ఎన్‌ఎండీసీ 4.5%, హిందుస్తాన్ కాపర్ 3.7% చొప్పున పతనంకావడం ద్వారా 52 వారాల కనిష్ట స్థాయిలను తాకాయి. ఇతర దిగ్గజాలలో హిందాల్కో 6.4% దిగజారగా, జిందాల్ స్టీల్, ఎస్‌బీఐ, జేపీ, భారతీ, డీఎల్‌ఎఫ్, కోల్ ఇండియా, ఆర్‌ఐఎల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, మారుతీ, ఎల్ అండ్ టీ, భెల్, బజాజ్ ఆటో 5-2.5% మధ్య నష్టపోయాయి. 

రూ. 3 లక్షల కోట్లు ఆవిరి
గత 3 రోజుల్లో రూ. 3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందంటే అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బీఎస్‌ఈ నగదు విభాగంలో రూ.1,815 కోట్ల టర్నోవర్ నమోదుకాగా, ఎన్‌ఎస్‌ఈ నగదులో రూ. 9,232 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 1,42,367 కోట్లు జరిగింది. ఎఫ్‌ఐఐలు రూ. 428 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ ఫండ్స్ రూ. 166 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మిడ్ క్యాప్ 2%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% చొప్పున జారుకున్నాయి. ట్రేడైన షేర్లలో కేవలం 797 బలపడగా, 1,957 నష్టపోయాయి. 

మూడీస్ వార్నింగ్...
యూరోపియన్ యూనియన్‌లోని అన్ని దేశాల రేటింగులనూ సమీక్షిస్తామన్న ‘మూడీస్’ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. వెరసి రెండు వారాల ర్యాలీకి బ్రేక్ పడింది. కడపటి వార్తలందేసరికి డోజోన్స్, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌లు 1.8%పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి. ఇక యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్, స్వీడన్ 3-2% మధ్య పతనమై ట్రేడవుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి