భారత
దేశం ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఉన్న విషయాన్ని ఆర్ధిక పరిశీలకులు
పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. రూపాయి విలువ పతనం రూపంలో భారత దేశం ద్రవ్య
సంక్షోభం వ్యక్తమవుతున్నది. పైకి రూపాయి విలువ పతనమే ద్రవ్య సంక్షోభానికి
కారణంగా కనిపిస్తున్నప్పటికీ భారత దేశ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన
ఆర్ధిక విధానాలే ఇండియాను ద్రవ్య సంక్షోభం వైపుకి నెడుతున్న విషయాన్ని
గుర్తించవలసి ఉంది. 1991 లో రూపాయి విలువను రెండు రోజుల వ్యవధిలో రెండు
సార్లు తగ్గించిన తర్వాత ఇండియా ద్రవ్య సంక్షోభం పరిస్ధితులకు చేరువ కావడం
ఇదే ప్రధమం.
భారత దేశ
ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం విదేశీ సంస్ధాగత పెట్టుబడుల
(ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ – ఎఫ్.ఐ.ఐ) పైన ఆధారపడి ఉంది. యూరప్
రుణ సంక్షోభం, నెమ్మదించిన అమెరికా ఆర్ధిక వృద్ధి ల ప్రభావంతో ఇండియా
నుండి ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దానితో తొంభయ్యవ
దశకం మధ్యన ఆసియా పులులు ఎదుర్కొన్న ‘పెట్టుబడుల తరలింపు’ పరిస్ధితిని
ఇండియా కూడా ఎదుర్కొంటోంది. ఆసియా పులులు ఎదుర్కొన్న పరిస్ధితికి ఇండియా
చేరువ కానప్పటికీ ఎఫ్.ఐ.ఐ ల ఉపసంహరణ మరింత ఊపందుకుని భారత దేశ ‘చెల్లింపుల
సమతూకం (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్)’ దెబ్బతిన్నట్లయితే అప్పటి పరిస్ధితి
రావడం తధ్యంగా కనిపిస్తోంది.
ద్రవ్యోల్బణం
అధికంగా ఉండడంతో ఆర్.బి.ఐ కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తోంది. అంటే
ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చెలామణిని తగ్గించడానికి బ్యాంకు వడ్డీ రేట్లను
ఆర్.బి.ఐ పెంచుతోంది. దానితో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (స్టాక్
మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మదుపుదారులు) భారత దేశంలొ పెట్టుబడులు
పెట్టడానికి ఆసక్తి కనపరచడం లేదు. వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో వారి లాభాల
మార్జిన్ బాగా తగ్గిపోవడం దీనికి కారణంగా ఉంది.
విదేశీ
మారక ద్రవ్య మార్కెట్లలో ఆర్.బి.ఐ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అంటే
విదేశీ మారక ద్రవ్య నిల్వలను అమ్మి రూపాయి ని కొన్నట్లయితే రూపాయి విలువ
పెరగడానికి లెదా మరింత పతనం కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాని అతిగా
జోక్యం చేసుకున్నా కష్టమే. విలువైన విదేశీ మారక ద్రవ్య నిలవలను రూపాయి
విలువ కోసం ఖర్చు పెట్టడం ఆచరణీయం కాదు. అనేక విమర్శలను సైతం ఎదుర్కొనవలసి
వస్తుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృధా చేస్తున్నారని విమర్శ
వస్తుంది.
తమది కాని
సంక్షోభాల వలన ఇండియా కరెన్సీ రూపాయి విలువ పడిపోతోందని భారత దేశ నాయకులు
చెబుతున్నారు. ఆర్ధిక మంత్రి ప్రణభ్ ముఖర్జీ, ప్రధాని ఆర్ధిక సలహా బృందం
నాయకుడు కౌశిక్ బసు లాంటివారు ఇప్పటికె అనేక సార్లు ఆ విధంగా చెప్పారు.
యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి మందగమనం, ప్రపంచ ఆర్ధిక
వ్యవస్ధలో నెలకొని ఉన్న మాంద్య పరిస్ధితులు రూపాయి విలువ పతనానికి కారణంగా
వారు చెబుతున్నారు. తక్షణ పరిశీలనలో అదే కారణంగా కనిపిస్తున్నప్పటికీ, అసలు
బైటి కారణాలు భారత దేశ ఆర్ధిక పరిస్ధితులను అంతగా ప్రభావితం చేయగల
పరిస్ధితులపైన కూడా దృష్టి సారించవలసి ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన
ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రభావితం కాని ఇండియా ఇప్పుడేందుకు ప్రభావితం
అవుతున్నదో పాలకులు చెప్పాల్సి ఉంది.
భారత దేశం
ఇప్పటికే కరెంట్ ఖాతాలో లోటు చూపిస్తోంది. బడ్జెట్ లోటు కూడా అధికంగానె
ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం ఆఖరికి బడ్జెట్ లోటు 4.6 శాతంకి తగ్గించాలని
లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది వాస్తవానికి 5.5 శాతం ఉండవచ్చని ఇటీవల
రాయిటర్స్ జరిపిన సర్వేలో వ్యక్తం అయ్యింది. కరెంట్ ఖాతా లోటు పూడ్చడానికి
మరిన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలు పేర్చుకోవలసిన అవసరం భారత్ పైన ఉంది.
అంటే డాలర్ల నిల్వలను ఆకర్షించవలసి ఉంది. 1991 లో ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ
బ్యాంకుల వద్దనుండి అప్పులు తెచ్చుకుని ఆ డాలర్లతో కరెంట్ ఖాతా లోటును
ఇండియా పూడ్చుకుంది. ఇప్పుడు డాలర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం విదేశీ
పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగానే రిటైల్
రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత ప్రభుత్వం
తొందరపడుతోంది. అది చెప్పకుండా ఇండియాకి ఉద్యోగాలు వస్తాయనీ,
వినియోగదారులకు ధరలు తగ్గుతాయనీ, వ్యవసాయదారులకు లాభమనీ ప్రభుత్వ పెద్దలు
అబద్ధాలు చెబుతున్నారు.
భారతదేశం
వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 300 బిలియన్ డాలర్లవరకూ ఉంది.
ఇందులో కొంత భాగాన్ని రూపాయి పతనం కాకుండా ఖర్చుచేయగలంత మొత్తం కాదిది.
అందువల్ల రూపాయి విలువ పతనంలో ఆర్.బి.ఐ జోక్యం చేసుకోవడానికి ధైర్యం చేయడం
లేకపొతోంది. ఆర్.బి.ఐ జోక్యం చేసుకున్నా పెట్టుబడుల తరలింపు ఎప్పటివరకూ
కొనసాగుతుందో తెలియదు. పరిమితి తెలియని పెట్టుబడులు తరలింపు వల్ల
పతనమవుతున్న రూపాయి విలువ కాపాడుకోవడానికి పరిమితమైన విదేశీ మారక ద్రవ్య
నిల్వలను ఖర్చు చేయలేని స్ధితిలో ఆర్.బి.ఐ, ఆ మాటకొస్తే భారత ప్రభుత్వం
ఉంది.
యూరప్ సంక్షోభ పరిష్కారం కనుచూపు మేరలో కనపడ్డం లెదు. జర్మనీ ఛాన్సలర్
ఎంజెలా మెర్కెల్ కూడా సోమవారం అదే చెప్పింది. యూరప్ సంక్షోభానికి
పరిష్కారం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని ఆమె సోమవారం తెలిపింది. యూరోజోన్
దేశాలు ఫిస్కల్ యూనియన్ గా ఏర్పడాలని ఆమె ప్రబోధిస్తోంది. అంటే యూరో ను
కరెన్సీ గా అంగీకరించిన దేశాలన్నీ ఒకే విధమైన స్ధాయిలో కోశాగార (ఫిస్కల్)
ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రతి దేశమూ బడ్జెట్ లోటు
జిడిపిలో మూడు శాతానికి మించకూడదన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని
మెర్కెల్ కోరుతోంది. కాని వివిధ దేశాల అవసరాలన్నీ ఒకే విధంగా ఉండవు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ బడ్జెట్ లోటూ, వెనకబడిన తూర్పు
యూరప్ దేశాల బడ్జెట్ లోటులు వారి వారి జిడిపిల్లో ఒకే శాతం (మూడు) ఉండాలంటే
సాధ్యం కానిపని.బడ్జెట్ లోటు తగ్గించుకోవడం అంటే ఆదాయానికి తగిన ఖర్చులు చేయడం వరకూ పరిమితం కావాలి. అంతకు మించి ఖర్చులు చేయవలసి ఉన్నపుడు దేశాలు సాధారణంగా అప్పులు తెచ్చుకుంటాయి. అంటే ఆదాయానికి మించి బడ్జెట్ రూపొంచిందుకుని ఆదాయం ఖర్చు కాగా మిగిలిన బడ్జెట్ భాగానికి అప్పులు తెచ్చుకుని ఖర్చులు గడుపుతాయి. ఆ విధంగా బడ్జెట్ మొత్తంలో ఆదాయం తీసివేయగా మిగిలిన మొత్తాన్ని బడ్జెట్ లోటు అంటారని తెలిసిందే. బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి తెచ్చే అప్పులు సంవత్సరానికి జిడిపిలో మూడు శాతం మించరాదనీ లేదా జిడిపిలో మూడు శాతానికి మించి అప్పులు తెచ్చుకోకుండా ఖర్చులు సరిపుచ్చుకోవాలనీ జర్మనీ కోరుతోంది.
ఈ విధంగా ఖచ్చితమైన కోశాగార నియమాలను (ఫిస్కల్ రూల్స్) పాటించడానికి వీలుగా యూరో జోన్ సభ్య దేశాలు తమ తమ ఆర్ధిక వ్యవస్ధల స్వతంత్రతను వదులుకోవాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. ఈ నియమాలు ఇప్పటివరకూ లేవు. కొత్తగా నియమాలు చేర్చుకుని కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. కానీ ఫ్రాన్సు తమ బడ్జెట్ పై స్వతంత్రతను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయంలోనే జర్మనీ, ఫ్రాస్ను ల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వీరిద్ధరు అంగీకరించినా ఇతర దేశాలు అంగీకరించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆయా దేశాల పార్లమెంటులు అక్కడి చట్టాలకు అనుగుణంగా ఈ నియమాలను ఆమోదించేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని దేశాలు ఆమోదిస్తాయన్న గ్యారంటీ కూడా లేదు.
ఇటువంటి యూరప్ సంక్షోభ పరిస్ధితులపై భారత దేశ ఎగుమతులు ఆధారపడి ఉన్నాయి. యూరప్ సంక్షోభం వల్ల భారత దేశ ఎగుమతులు పడిపోయాయి. అమెరికాకు కూడా భారత దేశ ఎగుమతులు భారిగానే వెళ్తున్నయి. అక్కడి సంక్షోభం వల్ల అమెరికా ఎగుమతులు కూడా దెబ్బతినడంతో వాణిజ్య లోటు పెరిగిపోయి అది బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్ పరిస్ధితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభాల వల్ల విదేశీ కరెన్సీలైన డాలర్, యూరో లాంటి ప్రధాన కరెన్సీల విలువల్లో కూడా మార్పులు సంభవిస్తుండడంతో ఆ ప్రభావం కూడా రూపాయి పై పడుతోంది. యూరప్ పరిస్ధితులు ఇలాగే చాలాకాలం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, అంతకాలం రూపాయి పతనాన్ని తట్టుకునే శక్తి ఇండియాకు లేనందున భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభానికి చేరువగా వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.
గత నాలుగు నెలల్లో రూపాయి పదహారు పతనమైందని రాయిటర్స్ తెలిపింది. సోమవారానికి డాలరుకు రు.51.26 పై.లు గా రూపాయి విలువ ఉంది. యూరోజోన్ సంక్షోభం వల్ల భారత దేశమే మొదట దెబ్బతినవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేశ్తున్నారు. యూరప్ సంక్షొభం భారత వాణిజ్య లోటును తీవ్రం చేస్తుంది. ఆ పరిస్ధితి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి మళ్లీ ప్రతిబంధకంగా మారుతుంది. ప్రమాదాలు భరించే శక్తి ఇండియాకి తగ్గిపోయి సులభంగా సంక్షోభానికి గురవుతుంది.
‘భారత దేశ ఆర్ధిక వృద్ధి నెమ్మదించింది. రూపాయి విలువ పతన దిశలో ఉంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. మదుపుదారుల సెంటిమెంట్ కూడా ప్రతికూలంగా మారింది. ఈ పరిస్ధితుల్లో ఇండియా అకస్మాత్తుగా సంక్షోభంలో పడుతున్న పరిస్ధితి వ్యక్తమవుతోంది’ అని యు.బి.ఎస్ బ్యాంకు విశ్లేషించినట్లుగా రాయిటర్స్ తెలిపింది. కరెంటు ఖాతా లో మొదటి క్వార్టర్ లో 14.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుందు క్వార్టర్ కంటే మూడు రెట్లు. ఆర్ధిక సంవత్సరం ముగింపుకి ఇది 54 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏప్రిల్ నుండి అక్టోబరు కాలంలో బడ్జెట్ లోటు 58.7 బిలియన్ డాలర్లు. ఇది జిడిపిలో ఏడు శాతం పైగా ఉంది. ఈ పరిస్ధితిలో మార్చి లక్ష్యం 4.6 శాతం చేరుకోవడం కష్టమని ఆర్ధికమంత్రే అంగీకరిస్తున్నాడు.
నమ్మడానికి వీల్లేని ఎఫ్.ఐ.ఐ పెట్టుబడులపై ఆధారపడి ఇండియా కరెంట్ ఖాతా లోటు పూడ్చుకుంటుంది. ఇప్పుడవి ముఖం చాటు చేయడంతో లోటు పెరిగిపోతోంది. 2010లో పోర్ట్ ఫోలియో పెట్టుబడులు 29 బిలియన్ డాలర్లు ఉండగా 2011 లో ఇప్పటివరకూ నికరంగా మైనస్ 50 మిలియన్ డాలర్లు మాత్రమే. ఒక్క నవంబరు నెలలోనే ఎఫ్.ఐ.ఐ లు 661 మిలియన్ డాలర్లు వెనక్కి వెళ్ళిపోయాయి.
ఈ విధంగా ఎఫ్.ఐ.ఐ లు వెనక్కి వెళ్లిపోవడం, కరెంట్ ఖాతా లోటు, బడ్జెట్ లోటు ల వలన రూపాయి విలువ పతనం అవుతోందని చెప్పవచ్చు. దేశీయంగా అభివృద్ధి సాధించి ఆర్ధిక వృద్ధిని పెంచుకోవడానికి బదులు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి వారి ఉత్పత్తులతో జిడిపి పెంచడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున భారత దేశ అభివృద్ధి భారత దేశ ప్రజలకు కాకుండా పోతోంది. ఇంట్లో ఈగల మోత, బైట పల్లకీల మోత గా భారత దేశ ఆర్ధిక పరిస్ధితి ఉందని రూపాయి పతనం మరోసారి రుజువు చేసింది.
భారత ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్ధను అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో ప్రధానంగా అనుబంధంగా మారుస్తోంది. అమెరికాతో పాటు యూరప్ ఆర్ధిక వ్యవస్ధ పైన కూడా అధారపడేదిగా భారత ఆర్ధిక వ్యవస్ధను మార్చివేస్తున్నారు. దానివల్ల భారత దేశ ప్రజల అవసరాలను బట్టిగాక అమెరికా, యూరప్ ఆర్ధిక వ్యవస్ధల అవసరాలకు అనుగుణంగా భారత ఆర్ధిక వ్యవస్ధ స్పందిస్తోంది. అమెరికా జిడిపి వృద్ధి నెమ్మదించడం, యూరప్ ఆర్ధిక వ్యవస్ధ రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కారణాల వల్ల ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోందని ఆర్ధిక మంత్రి, ప్రధాని చెబుతున్నారు. తమ ఆర్ధిక విధానాల ద్వారా అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలకు భారత ఆర్ధిక వ్యవస్ధను కట్టేసినందువలన ఈ పరిస్ధితి దాపురించింది. ఆ విషాన్ని మరుగుపరిచి రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించి తద్వారా వచ్చే విదేశీ పెట్టుబడుల ద్వారా కరెంట్ ఖాతా లోటు పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి చిన్నపనికీ విదేశాల వైపు మోర ఎత్తి చూస్తున్న ఈ ఆర్ధిక పండితులు భారత దేశ ప్రజల స్ధితిగతుల గురించి లెక్కేలేదు. ప్రజలు మేల్కొని ఈ విధానాలను అడ్డుకోకపోతే మరిన్ని గడ్డు పరిస్ధితులు భారత దేశాన్ని త్వరలోనే చుట్టుముడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి