టి.ఆర్.ఎస్
పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యిందని కోదండరాం గాని ప్రకటన
ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అంతేకాదు. కోదండరాం గారు టి.ఆర్.ఎస్
పార్టీతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ప్రకటన స్పష్టం చేసింది. “2014
సంవత్సరం లోపల తెలంగాణ సాధించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని
ప్రొఫెసర్ కోదండరాం గారు మంగళవారం ప్రకటించారు. ఆయన ఇంటెగ్రిటీ పట్ల ఎంతో
కొంత ఆశలు పెట్టుకున్నవారికి ఈ ప్రకటన కళ్ళు తెరిపించినట్లయ్యింది.
’2014
లోపల తెలంగాణ సాధిద్దాం’ అని గతంలో టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు కె.సి.ఆర్
ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు కూడా 2014 లో తెలంగాణ ఇవ్వడంపైనే
ఆధారపడి ఉన్నాయన్నది అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు తెలంగాణ
ఇచ్చినట్లయితే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కి మూడిన పరిస్ధితి
తలెత్తుతుంది. 2014 వరకు ఆగినట్లయితే అప్పటివరకూ ప్రభుత్వం నడపడానికి
కాంగ్రెస్ ప్రభుత్వానికి వీలు కుదురుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ప్రక్రియ ప్రారంభం ద్వారా తెలంగాణలో బలం పుంజుకునే అవకాశం కూడా కాంగ్రెస్
కి లభిస్తుంది. ఈ లోగా సీమాంధ్రలో పరిస్ధితి మెరుగుపరుచుకోవడానికి తగిన
చర్యలు తీసుకోవచ్చు. పైగా తెలంగాణలో బలంగా ఉన్న టి.ఆర్.ఎస్ ను విలీనం
చేసుకునే విషయం కూడా తేల్చుకోవచ్చు. ఇన్ని ప్రయోజానాలు ఉండడం వలన ఇప్పుడే
తెలంగాణ ఇవ్వడానికి, ఒక వేళ ఇవ్వదలుచుకుంటే, కాంగ్రెస్ సిద్ధంగా లేదు.
తెలంగాణ
ఉద్యమాన్ని చల్లార్చడంలో టి.ఆర్.ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు
సఫలీకృతమయ్యాయి. నిజానికి టి.ఆర్.ఎస్ నేత కె.సి.ఆర్ కి ఇప్పుడు తెలంగాణతో
పెద్ద అవసరం లేదు. ఆయనకి కావలసిన వన్నీ దాదాపుగా సమకూరాయి. పత్రిక
పెట్టుకున్నాడు. టి.వి ఛానెల్ పెట్టుకున్నాడు. వ్యాపారాలు నడుస్తున్నాయి.
సీమాంధ్ర వ్యాపారులతోనే వ్యాపారాలు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం
నుండి తన వ్యాపారాలకు కావలసిన సహకారం అందుతోంది. కె.సి.ఆర్ ని నమ్ముకున్న
వారికి కూడా ప్రభుత్వంలో ఎదో విధంగా పనులు చేయించుకోగల పరిస్ధితులు
ఉన్నాయి. పరిస్ధితులన్నీ ఆయనకి అనుకూలంగా ఉండగా ఇక తెలంగాణతో కె.సి.ఆర్ కి
ఏం పని?
ఈ గేమ్
ప్లాన్ లో కోదండరాం కూడా భాగస్వామి కావడమే విచారకరం. ఆయన గతంలో సి.పి.ఐ
(ఎం.ఎల్-జనశక్తి) పార్టీ మేధావిగా పనిచేశాడు. విప్లవ రాజకీయాల వెలుగులో
అనేక వ్యాస పరంపరను వెలువరించాడు. అనేక చర్చా గోష్టులు, సెమినార్ లలో
ప్రసంగించాడు. అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం
పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కాని తెలంగాణ ఉద్యమాన్ని కె.సి.ఆర్ కీ, ఆయన
పార్టీకి మాత్రమే పరిమితం చేయడంలో కోదండరాం ఉపయోగపడుతుండడమే ఆశ్చర్యం గానూ,
బాధాకరంగానూ ఉంది.
కె.సి.ఆర్
పార్టీ టి.ఆర్.ఎస్ వల్ల తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతాయని కోదండ రాం గారు
భావిస్తున్నారా? తెలంగాణ వచ్చాక టి.ఆర్.ఎస్ పార్టీ కూడా ప్రజానుకూల
విధానాలను పాటిస్తుందని ఆయన నమ్ముతున్నారా? టి.ఆర్.ఎస్ పార్టీ తెలంగాణలోని
పెట్టుబడిదారులు, భూస్వాములకు కొమ్ము కాసే పార్టీగా కోదండరాం గారు భావించడం
లేదా? భారత దేశ వ్యవస్ధ పట్ల కోదండరాం గారికి ఉన్న అవగాహన కొడిగట్టిందా? ఈ
ప్రశ్నలకు కోదండరామ్ గారి వద్ద సమాధానాలు ఉన్నాయా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి