12, డిసెంబర్ 2011, సోమవారం

నిరుద్యోగం..నిరుద్యోగం


  • ప్రపంచ దేశాల ప్రధాన ఆందోళన ఇదే
  • అవినీతి, పేదరికమూ చర్చనీయాంశాలే
  • బిబిసి సర్వేలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఆందో ళన చెందుతున్న సమస్య ఏది? ఈ ప్రశ్నకు జవాబు 'నిరుద్యోగం'. నిరుద్యోగ సమస్యపై అన్ని దేశాల్లోనూ ఆందోళన పెరుగుతున్నట్లు 23 దేశాల్లోని 11 వేల మంది పై బిబిసి వరల్డ్‌ సర్వీస్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. వరల్డ్‌ స్పీక్స్‌(ప్రపంచం మాట్లాడుతుంది) అనే పేరిట బిబిసి మూడే ళ్ళుగా ఈ సర్వే జరుపుతోంది. అందులో ప్రజలకు కొన్ని ఆందోళనకారకమైన అంశాల జాబితాను ఇచ్చి, అందులో వారు తమ మిత్రులు, కుటుంబ సభ్యులతో గత నెలలో చర్చించిన అంశాల గురించి చెప్పాల్సిందిగా కోరారు. అవినీతి, పేదరికం కూడా అత్యధికంగా ఆందోళన కలిగించే సమస్యలే అయినా నిరుద్యోగం ప్రధానాంశంగా ఉంది. 2009లో జరిపిన మొట్టమొదటి సర్వేలో కంటే ఈసారి ఆరు రెట్లు అధికంగా 18 శాతంగా ఉంది. ఈ పోల్‌ను గ్లోబ్‌స్కాన్‌ నిర్వహించింది. సర్వే చేసిన దాదాపు అన్ని దేశాల్లోనూ నిరుద్యోగానికి సంబంధించిన ఆందోళన పెరుగుతున్నట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా అవినీతి కూడా ఎక్కువగా చర్చనీయాంశమైన అంశంగా ఉన్నప్పటికీ నిరుద్యోగమే ప్రధాన ఆందోళనగా ఉంది. ప్రశ్నించినవారిలో దాదాపు నాలుగో వంతు మంది గత నాలుగు వారాల్లో అవినీతిని గురించి ఎక్కువగా చర్చించినట్లు వెల్లడైంది. తరువాత స్థానంలో పేదరికం ఉంది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇటీవలి కాలంలో దీన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. నిరుద్యోగానికి సంబంధించిన ఆందోళన విషయంలో ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య తేడాలున్నాయి. స్పెయిన్‌ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 54 శాతం మంది దాన్ని గురించి తరచుగా చర్చించుకున్నట్లు చెప్పారు. గత బిబిసి సర్వే కంటే ఇది మూడింట ఒక వంతు ఎక్కువకు పెరిగింది. స్పెయిన్‌ యూరో ప్రాంతంలోని రుణ సంక్షోభానికి కేంద్ర స్థానంలో ఉంది. ఇంకా అక్కడ నిరుద్యోగిత ఆ ప్రాంతంలోనే అత్యధికంగా 40 శాతానికి పైగా ఉంది. ఘనా, మెక్సికో, నైజీరియా, టర్కీలో కూడా ప్రధాన చర్చనీయాంశంగా నిరుద్యోగం ఉంది.
అమెరికా పెట్టుబడి బ్యాంకు లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిన సమయంలో మొదటి వార్షిక సర్వే 2009లో ప్రచురితమైంది. 2009 నుంచి జరిపిన ప్రతి సర్వేలోనూ ఈ మూడు సమస్యలూ మొదటి స్థానాల్లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. దానికి భిన్నంగా నైజీరియా, భారతదేశం, టర్కీ, ఇండోనేషియా, పెరూలో అవినీతి ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇంకా చైనా, రష్యా, కెన్యా, ఫిలిప్పైన్స్‌లో ఆహారం, ఇంధన ధరల పెరుగుదల ప్రధానాంశంగా ఉంది. లాటిన్‌ అమెరికాలో నేరాలు, హింస సాధారణంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ సర్వేను ఈ సంవత్సరం జులై, సెప్టెంబర్‌ మధ్య కాలంలో నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి