27, డిసెంబర్ 2011, మంగళవారం

‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్


మీరు చదువుతున్న టపా
మార్క్సిజం-లెనిజిజం


(రష్యాలో భగవద్గీతపై నిషేధానికి సంబధించి నేను రాసిన పోస్టు కింద ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్యకు ఈ పోస్టు సమాధానం గా గ్రహించగలరు)
గోల్వార్కర్ ఆర్.ఎస్.ఎస్ కి రెండవ గురువు అన్న సంగతి విదితమే. హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్ధాపించినప్పటికీ గోల్వార్కర్ నేతృత్వంలో ఆర్.ఎస్.ఎస్ భావాజాలం అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశంలో ముస్లింల భవిష్యత్ పై ఆర్.ఎస్.ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నదీ గురు గోల్వార్కర్ మాటల్లోనే తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. “వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్” (We or Our Nationhood Defined) అన్న పుస్తకాన్ని గురు గోల్వాల్కర్ రచించారు. ఆ పుస్తకం నుండి కొన్ని అంశాలను చూద్దాం. ఆయన భారత దేశంలో ముస్లింలను గురించి ఇలా అన్నాడు.
హిందూస్ధాన్ (భారత దేశం)లో ఉన్న విదేశీ జాతులు (races) హిందూ సంస్కృతినీ, భాషనూ అవలంబించడమైనా చేయాలి, హిందూ మతం పట్ల గొప్ప భక్తి శ్రద్ధలను కలిగి ఉండి దానిని గౌరవించడం నేర్చుకోవాలి, హిందూ జాతి, సంస్కృతులను అనగా హిందూ జాతిని కీర్తించడం తప్ప మరే భావజాలాన్నీ వారు కలిగి ఉండకూడదు, మరియు వారి ప్రత్యేక ఉనికిని వదులుకొని హిందూ జాతిలో కలిసి పోవాలి లేదా దేశంలో ఉంటూ పూర్తిగా హిందూ జాతి కింద బానిసలుగా (సబార్డినేట్) ఉండాలి, దేనినీ తమదిగా చెప్పరాదు, ఎటువంటి సౌకర్యాలనూ వారు అనుభవించలేరు, ప్రాధాన్యతా ట్రీట్‌మెంట్ వారికి ఉండరాదు -పౌర హక్కులు సైతం వారికి ఉండరాదు. కనీసం వారికి ఏ ఇతర పద్ధతి (కోర్స్) కూడా అనుసరణకు అందుబాటులో ఉండరాదు. మనము పాత జాతి. మన దేశంలో నివసించడానికి నిర్ణయించుకున్న విదేశీ జాతుల పట్ల పాత జాతులు ఎలా ప్రవర్తిస్తాయో అలానే ప్రవర్తిద్దాం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)
… … …జర్మన్ జాతి ప్రతిష్ట ఈ రోజుల్లో చర్చాంశంగా ముందుకొచ్చింది. తమ జాతి స్వచ్ఛతనూ, సంస్కృతినీ కాపాడుకోవడానికి జర్మనీ తన దేశాన్ని సెమిటిక్ జాతి -యూదులు- లేకుండా శుభ్రపరచడం ద్వారా ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇక్కడ జాతి ప్రతిష్ట అత్యంత సమున్నత స్ధాయిలో స్పష్టం చేయబడింది. పునాదిలో విభేధాలున్న జాతులు మరియు సంస్కృతులు ఒకే మొత్తంగా కలిసి పోవడం దాదాపుగా ఎంత అసాధ్యమో జర్మనీ చాటి చెప్పింది. హిందూస్ధాన్ లో ఉపయోగించడానికీ, నేర్చుకుని లబ్ది పొందడానికీ ఇది మంచి పాఠం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)
పైన ఉదహరించిన గురు గోల్వాల్కర్ బోధనలనుండి మనకు ఏమి తెలుస్తోంది. ముస్లింలు తమ ప్రత్యేక ఉనికిని వదులుకుని హిందూ జాతిలోనైనా కలిసి పోవాలి లేదా హిందూ జాతికి బానిసలుగానైనా పడి ఉండాలి అని ఆయన బోధించినట్లు అర్ధం అవుతోంది. ఆయన నేరుగా ‘బానిసలు గా ఉండాలి’ అన్లేదు కదా అని కొందరు తెలివిగలవారు ప్రశ్నించవచ్చు. నిజమే నేరుగా అన్లేదు గానీ బానిసల జీవనవిధానాన్నే ఆయన ముస్లింలకు (విదేశీ జాతులకు) ప్రబోధించాడు. హిందూ జాతికింద ఉండాలనీ, దేనినీ తమదిగా చెప్పరాదనీ (ఆస్తి హక్కులు ఉండరాదని), స్వంత ఉనికిని వదులుకోవాలనీ, అసలు పౌర హక్కులనే వదులుకోవాలనీ ఆయన చేసిన బోధన అంతా బానిసలకు సంబంధించింది తప్ప మరొకటి కాదు. మానవ జాతి చరిత్రను పరికిస్తే కనీస పౌర హక్కులు లేకుండా బతికింది బానిస వ్యవస్ధలో బానిసలు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఫ్యూడల్ వ్యవస్దలో రైతులకు ఆస్తి హక్కులు ఉన్నాయి. ఇక్కడ భారత దేశంలో ముస్లింలకు ఆస్తి హక్కు కూడా (పౌర హక్కుల్లో ఇదీ ఒకటి) ఉండరాదని గురు గోల్వార్కర్ బోధించాడు. విదేశీ జాతులు అని పేర్కొనడం ద్వారా గురు గోల్వార్కర్, ముస్లిం ప్రజలు లేదా జాతి భారత దేశానికి చెందినవారు కాదనీ, విదేశీయులనీ చెప్పాడు. అంతేకాక భారత దేశంలో ఉన్న ముస్లింలు కూడ విదేశీయులేనని ఆయన స్పష్టం చేశాడు.
అంతేనా! గురు గోల్వార్కర్, యూదులపైన జాతి హత్యాకాండను అమలు జరిపిన జర్మనీని ఆదర్శవంతమైనదిగా కీర్తించాడు. ప్రపంచం అంతా జర్మనీని ఫాసిస్టు దేశంగా, హిట్లర్ ను ఫాసిస్టు నియంతగా తిట్టిపోస్తుంటే ఇక్కడ గురు గోల్వాల్కర్ మాత్రం జర్మనీ తన దేశాన్ని యూదు జాతి లేకుండా శుభ్రపరుచుకుందని కీర్తించాడు. తద్వారా తాను స్వచ్ఛమైన, కల్తీ లేని జాతిగా ఆవిర్భవించిందని కీర్తించాడు. పైగా జర్మనీ పాఠాలు హిందూస్ధాన్ లో అమలు చేయాలని కాంక్షించాడు. తద్వారా భారత దేశంలో హిందూ జాతిని స్వచ్ఛం కావించాలని ఆయన సందేశం ఇచ్చాడు. హిందూ జాతిని స్వచ్ఛం కావించడం అంటే ఇక్కడ ఉన్న విదేశీ జాతులను ఇక్కడినుండి తరిమి వేయాలి. జర్మనీ యూదులను గుంపుగుంపులుగా చంపేసి తరిమేసినట్లుగా భారత దేశం కూడా ముస్లింలను గుంపులు గుంపులు గా చంపేసి ఇక్కడినుండి తరిమి కొట్టాలి. గుజరాత్ లో ముస్లింలపై సాగించిన నరమేధం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రం ఆర్.ఎస్.ఎస్ భావాజాలానికి ఒక ప్రయోగశాల గా భాసిల్లుతున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
ఇందులో ఏవైనా అంశాలను పిడివాదంగా ఎంచి ఆర్.ఎస్.ఎస్ సవరించుకున్నదేమో తెలియదు. అటువంటిది ఏమైనా ఉంటే సంబంధిత మిత్రులు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి