8, డిసెంబర్ 2011, గురువారం

ఒక్కడే ‘వీరు’డు


 


‘అతడు చేస్తాడనుకుంటే సచిన్ చేసేశాడు. అయినా ఫర్వాలేదు. ఏదో ఒకరోజు అతడూ ఆ ఘనతను అందుకుంటాడు’... వన్డేల్లో డబుల్ సెంచరీపై వీరేంద్ర సెహ్వాగ్‌పై అభిమానుల అంచనాలివి. వారి ఆశలు గురువారం ఫలించాయి. ద్విశతకమే కాదు ఏకంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి వీరేంద్రుడు చరిత్ర సృష్టించాడు. అతడి ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. బౌలర్లు తెల్లబోయారు. వెస్టిండీస్‌తో గురువారం ఇండోర్‌లో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో సచిన్ (200 నాటౌట్) రికార్డును అధిగమించాడు.

వీరూ ధాటికి భారత్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు (418/5)ను నమోదు చేసింది. నాలుగు దశాబ్దాల వన్డే చరిత్రలో రెండే డబుల్ సెంచరీలు నమోదు కాగా... ఆ రెండింటినీ భారతీయులే సాధించడం మరో విశేషం. తొలి బంతికి సింగిల్... రెండో బంతికి బౌండరీ... అంతే, అక్కడ మొదలైన సెహ్వాగ్ పరుగుల ప్రవాహం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియాన్ని ముంచెత్తింది. రోచ్ వేసిన మూడో ఓవర్లో తన ఫేవరెట్ షాట్ ‘అప్పర్ కట్’తో కొట్టిన సిక్స్ మున్ముందు రానున్న సునామీకి సూచికగా కనిపించింది.

ఆ తర్వాత కొద్దిసేపటికే లాంగాన్ వైపు సిక్సర్‌తో అర్ధసెంచరీ. ప్రతీ బౌలర్‌ను ‘సమదృష్టి’తో చూస్తూ వీరూ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. ఆపై నూట యాభై మైలురాయిని కూడా సాఫీగా దాటేశాడు. ఇక సమయం రానే వచ్చింది. 197 వద్ద రసెల్ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు కొట్టిన ఫోర్‌తో ద్విశతకం ఖాతాలో చేరింది. వన్డే క్రికెట్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

దూకుడే అతడి మంత్రం
నజఫ్‌గఢ్... ఢిల్లీ శివార్లలోని చిన్న పట్టణం. సాధారణ మధ్య తరగతి కుర్రాడు. తండ్రి పిండి గిర్నీలో పని చేసిన అతను...ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్‌నూ పిండి చేస్తాడని ఎవరూ ఊహించలేదు. తొలి వన్డేలో ఎక్కడో ఏడో స్థానంలో బరిలోకి దిగి ఒక్క పరుగు స్కోరుతో మొదలు పెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రయాణం ద్విశతకం వరకు చేరడంలో అతను పఠించిన మంత్రం ఒక్కటే...దూకుడు! ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంగా కొట్టామన్నదే ముఖ్యమనే ఆటతీరు అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. లేదంటే 295 పరుగుల వద్ద సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకునే గుండె ధైర్యం ఏ బ్యాట్స్‌మన్‌కు ఉంటుంది.

అది వీరూకు ఉంది. నిజానికి సెహ్వాగ్ ఫుట్‌వర్క్ అంత గొప్పగా ఏమీ ఉండదు. కాళ్లు కదిలించకుండానే షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తాడనేది విమర్శ. అయితే అది ఎవరిక్కావాలి. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ టెస్టు చరిత్రలో రెండు ట్రిపుల్ సెంచరీలు సొంతం చేసుకున్న వీరూ...తనదైన శైలిలో ఆడబోయి మరో ట్రిపుల్ సెంచరీని కేవలం ఏడు పరుగులతో చేజార్చుకున్నాడు. సచిన్ అంతటివాడిని కావాలనుకున్న చాలా మంది తన ఈడు కుర్రాళ్లలాగే సెహ్వాగ్ కూడా కలలు కన్నాడు.

అతడితో కలిసి తన తొలి టెస్టు సెంచరీని అందుకున్న ఈ చిచ్చరపిడుగు క్రమంగా ఆ ముద్ర నుంచి బయటపడి తన సొంత శైలితో ప్రపంచ క్రికెట్‌ను ఊపు ఊపాడు. నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడే వీరూకు సాంకేతిక నైపుణ్యం, క్రికెట్ పుస్తకంలోని షాట్లు అనే పదాలు నచ్చవు. అతని మాటల్లోనే చెప్పాలంటే ‘నేను షాట్ ఆడేటప్పుడు ఆ ఒక్క బంతి గురించే ఆలోచిస్తాను. దాన్ని ఎలా బౌండరీ దాటించాలన్నదే ముఖ్యం. ఫలానా తరహాలో ఆడాలనే నియమం ఎప్పుడూ పెట్టుకోను’ అని తన తరహా ఆట గురించి ఒక్క ముక్కలో తేల్చేస్తాడు. అలా అని చక్కటి షాట్లకు అతని డిక్షనరీలో కొదవేమీ లేదు.

ఆఫ్ సైడ్‌లో ఆడే బ్యాక్‌ఫుట్ పంచ్, ఒక్క అడుగు కూడా కదిపినట్లు కనిపించకున్నా.. అలా కన్నార్పకుండా అలరించే స్ట్రయిట్ డ్రైవ్, వెనక్కి తగ్గినట్లే అనిపించి అలవోకంగా అర క్షణంలో బౌండరీ దాటించే లెగ్ గ్లాన్స్...ఇలా ‘సున్నితమైన విధ్వంసం’ అంటే వీరూకే సొంతం. అయితే ప్రతీ బంతిని చితక్కొట్టాలనే వీరూ తపన దాదాపు నాలుగేళ్ల క్రితం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఏడాది విరామం తర్వాత మళ్లీ సెహ్వగ్ వచ్చాడు. అయితే మారింది ఆలోచనా ధోరణే కానీ, ఆట శైలి కాదు. ఇప్పుడు తన తరహా ఆటను, జట్టు అవసరాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో ఈ నజాఫ్‌గడ్ నవాబ్‌కి తిరుగు లేకుండా పోయింది. -సాక్షి క్రీడా విభాగం

చేస్తాననుకోలేదు
‘డబుల్ సెంచరీ చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఈ ట్రాక్‌పై ఓపిక ప్రదర్శిస్తే మనం మంచి స్కోరు చేసే అవకాశముందని ఆట ప్రారంభంలో గంభీర్‌తో అన్నాను. బౌండరీ దూరం కూడా కేవలం 50 గజాలే ఉంది. బ్యాటింగ్ పవర్‌ప్లే ఆరంభమయ్యాక నా మదిలో డబుల్ సెంచరీ ఆలోచన వచ్చింది. స్యామీ క్యాచ్ విడిచాక దేవుడు నావైపే ఉన్నాడనిపించింది. సచిన్ రికార్డును అధిగమించినందుకు సంతోషంగా ఉంది. ఈ డబుల్ సెంచరీ దివంగత మా నాన్నకు అంకితమిస్తున్నాను’
- వీరేంద్ర సెహ్వాగ్


సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
వన్డేల్లో 8 వేల పరుగులు దాటిన ఐదో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్ నిలిచాడు.
డబుల్ సెంచరీతో సెహ్వాగ్ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రూ. 10 లక్షలు బహుమానంగా ఇచ్చింది.
సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కూడా భారత్ సరిగ్గా 153 పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాను ఓడించింది.



32 ఒక మ్యాచ్‌లో అత్యధికసార్లు బంతిని బౌండరీ దాటించి (25 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరూ కొత్త రికార్డు
వన్డేల్లో సెహ్వాగ్ సెంచరీల సంఖ్య 15
4 వన్డేల్లో నాలుగుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టు భారత్.

వీరూకు నా అభినందనలు. అతడి రికార్డును చూస్తే సంతోషంగా ఉంది. నా రికార్డును మరో భారతీయుడు అధిగమించడం మరింత సంతృప్తినిచ్చింది
- సచిన్

పరుగులు- 219
బంతులు-149
ఫోర్లు - 25
సిక్స్‌లు- 7

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి