2, డిసెంబర్ 2011, శుక్రవారం

సబితకు అంటుకున్న మైనింగ్ ముప్పు


  • సబితఇంద్రారెడ్డి  చెప్పినట్లే చేశా :  శ్రీలక్ష్మి

 
హైదరాబాద్, డిసెంబరు 1: ఓబుళా పురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల్లో తనకెలాంటి పాత్ర లేదని, ఆ కంపెనీకి మైనింగ్ లీజు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో అప్పటి రాష్ట్ర గనుల శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించిన తర్వాత మాత్రమే తాను జారీ చేయడం జరిగిందని ఈ కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి స్పష్టం చేసారు. అంతేకాదు, 2005లోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాత్కాలిక లీజు మంజూరు చేసారని, అప్పుడు తాను ఆ శాఖ కార్యదర్శిగా లేనని కూడా శ్రీలక్ష్మి బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌లో స్పష్టం చేసారు.
ఈ ఫైలును సంబంధిత మంత్రి ముందు పరిశీలించారని, ఆమె ఆమోదించిన తర్వాత మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వి సురేందర్ రావు చెప్పారు. జీవో ముసాయిదాపై పిటిషనర్ శ్రీలక్ష్మి సంతకం లేదని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు ‘క్యాప్టివ్ మైనింగ్’ అనే పదాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కూడా ఆయన చెప్పారు. శ్రీలక్ష్మిపై వచ్చిన ఆరోపణలు జీవో 151, జీవో 152 ఫైళ్ల పరిశీలనకు సంబంధించినవేనని, వాటిని సంబంధిత మంత్రి ఆమోదించిన తర్వాతే చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు.
         ఒఎంసి జీవోకు సంబంధించిన నోట్‌ఫైల్‌పై శ్రీలక్ష్మి సంతకాలు ఉన్నాయని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాక ఫైలుకు సంబందించిన వ్యవహారాలు చూడడం తప్ప ఈ కేసులో ప్రధాన నిందితుడయిన గాలి జనార్ధన్ రెడ్డితో కానీ, ఒఎంసికి చెందిన ఇతరులతో కానీ తన క్లయింట్‌కు ఎలాంటి సంధాలు లేవని కూడా సురేందర్ రావు చెప్పారు.‘ నేను 2006, మే 17న పరిశ్రమల (మైనింగ్) విభాగంలో సెక్రటరీగా చేరాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2005 నవంబర్ 4నే ఒఎంసికి గనుల తాత్కాలిక లీజు మంజూరు చేయడమే కాకుండా అటవీ శాఖ, మైనింగ్ బ్యూరోనుంచి తదుపరి అనుమతులు పొందడం కోసం ఆ విషయాన్ని కంపెనీకి కూడా తెలియజేసింది’ అని శ్రీలక్ష్మి తన బెయిలు పిటిషన్‌లో స్పష్టం చేసారు.
శ్రీలక్ష్మి గనుల విభాగంలో సెక్రటరీగా చేరడానికి ఏడాది ముందే గనుల తాత్కాలిక లీజు మంజూరు చేయడం జరిగిందని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది స్పష్టం చేసారు. అంతేకాదు మైనింగ్ కార్యకలాపాలు పర్మిట్లు జారీ చేయడం, లేదా ఇనుప ఖనిజం ఎగుమతితతో తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడం ఎంతమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేసారు. అంతేకాదు అటవీ ప్రాంతంలోకి చొచ్చుకు పోవడం ద్వారా మైనింగ్ సరిహద్దులకు బైట మైనింగ్ వేస్ట్‌ను డంప్ చేయడానికి కూడా ఆమెను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆయన అన్నారు. కొంతమంది సాక్షులు చేసిన నిరాధారమైన తప్పుడు ఆరోపణల ఆధారంగా తన నివాసంలో, బ్యాంకు లాకర్లను సోదాలు చేసారని, అయితే ఎలాంటి ఆస్తులు, విలువైన వస్తువులు కానీ రహస్య సమాచారం కానీ ఈ సోదాల్లో దొరకలేదని కూడా శ్రీలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తాను ఎన్నో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించానని, ఎంతో సమర్థతో తనకప్పగించిన బాధ్యతలను నెరవేర్చానని, ఇంతవరకు తనపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని ఆమె తన పిటిషన్‌లో స్పష్టం చేసారు. లావాదేవీలకు సంబంధించిన మొత్తం రికార్డులను సిబిఐ స్వాధీనం చేసుకున్నందున, శ్రీలక్ష్మిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం కానీ, ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం కానీ ఎంతమాత్రం లేదని ఆమె తరఫు న్యాయవాది అన్నారు. తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని కూడా ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఐఏఎస్ టాప్ ర్యాంకర్లలో ఒకరినని, ఎంతో గౌరవప్రదమైన కుటుంబంనుంచి వచ్చానని కూడా శ్రీలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి