21, డిసెంబర్ 2011, బుధవారం

ఇండియాలో కాల్ సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో చట్టం

ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దిన అమెరికా తన ప్రయోజనాల విషయానికి వస్తే అవే విధానాలను తాను నిస్సందేహంగా తిరస్కరిస్తానని మరోసారి నిరూపించుకుంది. ఎండు చేపలు తినకూడనిది ఊరివాళ్ళే గానీ తాను కాదని తన చర్యల ద్వారా సిగ్గు విడిచి చాటుకుంటోంది.
అమెరికాలో ఉద్యోగాలను విదేశాలకు తరలిస్తున్నందున అమెరికా ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని పరోక్షంగా నిషేధిస్తూ అమెరికా కాంగ్రెస్ ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అమెరికా కంపెనీలు అనేకం తమ కాల్ సెంటర్లను ఇండియాలాంటి చోట్లకు తరలించి అమెరికాలో ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఇకముందు కాల్ సెంటర్లను విదేశాలలో నెలకొల్పడాన్ని నిరుత్సాహపరిచేలా ఈ చట్టంలో ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నెలకొల్పే కంపెనీలకు అమెరికా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీడ్ లోన్లను గానీ, గ్రాంటులను గానీ, ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ బిల్లు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఆమోదం పొందేలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ లో రిపబ్లికన్ల మెజారిటీ ఉన్నందున డెమొక్రట్లు, రిపబ్లికన్లు ఇరు పక్షాల ఆమోదంతోనే ఈ బిల్లుని కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. దానితో బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందడం ఖాయంగా మారింది. ఎగుస సభ సెనేట్ లో ఎలాగూ డెమొక్రట్లదే ఆధిపత్యం కనుక అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడం, ఒబామా సంతకంతొ చట్టం గా మారడం అనివార్యం.
కాంగ్రెస్ సభ్యులు టిమ్ బిషప్, డేవిడ్ మెక్ కిన్లే లు ఈ బిల్లునిప్రవేశపెట్టారు. “ది యు.ఎస్ కాల్ సెంటర్ వర్కర్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్” గా దీనికి నామకరణం చేసారు. విదేశీ కాల్ సెంటర్ కార్యకలాపాలపైన అనేక నిబంధనలను ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. “మా ఆర్ధిక వ్యవస్ధకి ఉన్న జబ్బుల్లో ‘ఔట్ సోర్సింగ్’ ఒకటి. దీనివల్ల మా నిరుద్యోగాన్ని తగ్గించడం చాలా కష్టంగా మారింది” అని టిమ్ బిషప్ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే వీళ్ళు నిత్యం వల్లించే స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలనూ, ప్రపంచీకరణ సూత్రాలనూ పూర్తిగా విస్మరించారని స్పష్టం అవుతోంది. ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టకముందు ఈ విధానాల వల్ల అన్ని దేశాలకూ సమాన అవకాశాలు వస్తాయని ఊదర గొట్టిన అమెరికా తీరా ఆచరణలో తాను ఎటువంటి అవకాశాలనూ ఇతర దేశాలకు ఇవ్వకుండా ఏకంగా చట్టాల ద్వారానే అడ్డుపడుతోంది.
ఈ చట్టం ఆమోదించాక అమెరికా కార్పొరేషన్ల తరపున విదేశాల్లో పని చేస్తున్న కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ లు తాము ఎక్కడ పని చేస్తున్నదీ వివరాలను అడిగినప్పుడు చెప్పవలసి ఉంటుంది. తమకు కాల్ చేసే కాలర్లకు అమెరికాలోని కాల్ సెంటర్ల ద్వారా సేవలు పొందే అవకాశాలను కూడా అందించవలసి ఉంటుంది. అంటే ఒక అమెరికా కార్పొరేషన్ తన కాల్ సెంటర్లను ఇండియాలో పెట్టుకుంటే ఆ సెంటర్లలో పని చేసే ఉద్యోగులు తమకు అమెరికన్లు గానీ ఇతర దేశస్ధులు గానీ కాల్ చేసినపుడు వారికి నేరుగా అమెరికానుండే సేవలు అందే అవకాశాలు ఉన్నాయని వివరించి ఆ అవకాశాలు తీసుకుంటారా అని అడగాలన్నమాట. పశ్చిమ దేశాల వాళ్ళు ఎలాగూ దగ్గరి ప్రాంతాల సేవలే కోరుకుంటారు గనక క్రమంగా ఇండియా నుండి కాల్ సెంటర్లు తిరిగి అమెరికాకే వెళ్లిపోతాయన్నమాట.
ఈ చట్టం ప్రకారం అమెరికాలోని లేబర్ కార్యదర్శి విదేశాల్లో కాల్ సెంటర్లను నడుపుతున్న కంపెనీల వివరాలను నిర్వహించాల్సి ఉంటుంది. కంపెనీలు కూడా తాము విదేశాలకు కాల్ సెంటర్లను తరలించడానికి 120 రోజులకు ముందు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాల్సి ఉంటుంది. అలా తెలియజేశాక అటువంటి కంపెనీలపైన కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయన్నమాట. ఈ చట్టానికి అమెరికాకి చెందిన ‘కమ్యూనికేషన్స్ వర్కర్స్ ఆఫ్ అమెరికా’ (సి.డబ్ల్యు.ఎ) పూర్తి మద్దతు ఇస్తోంది. అది సహజమే. ఈ సంఘం అమెరికాలోని సుమారు లక్ష్యా యాభైవేల మందికి పైగా కాల్ సెంటర్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోందని ‘ది హిందూ’ తెలిపింది.
ఇండియా లాంటి చోట్లకు కాల్ సెంటర్లను తరలించడం వల్ల తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయనీ, మోసాలను నివారించడానికి తగిన ఏర్పాట్లు లేనందున అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సి.డబ్ల్యు.ఎ అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇండియా లాంటి చోట్ల భద్రతా అంశాలను ఉల్లంఘిస్తున్నాయని దీనివల్ల అమెరికా ప్రయోజనాలకు హాని కలుగుతున్నదనీ వారు ఆరోపించారు. తగిన భద్రతా చర్యలు లేనందున ఇటువంటి మోసాలను అరికట్టడం అసాధ్యంగా మారిందని కూడా వారు ఆరోపించారు.
అయితే ఇప్పటికే అమెరికాకి కాల్ సెంటర్లు తరలివెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రాడ్ బాండ్ కనెక్షన్లు పెరిగినందున ఇంటివద్ద ఉన్న కంప్యూటర్ల నుండే కాల్ సెంటర్ విధులు నిర్వహించగల అవకాశాలు పెరిగాయనీ, దానితో మెల్లగా కాల్ సెంటర్ ఉద్యోగాలు అమెరికా కు తరలి వెళ్తున్నాయనీ వారు చెప్పారు. ఇలా అమెరికా కి వెనక్కి వెళ్లే కాల్ సెంటర్ విధుల వలన లక్ష ఉద్యోగాల వరకూ అమెరికాలో సమీప భవిష్యత్తులో సృష్టించబడతాయని వారు తెలిపారు.
నిజానికి ఔట్ సోర్సింగ్ అన్నది అమెరికా కార్పొరేషన్లకు లాభసాటిగా మారినందునే అవి తమ ఉద్యోగాలను ఇండియా, చైనా లాంటి చోట్లకు తరలించారు. చౌక గా దొరికే శ్రమ, కార్మిక చట్టాలు కఠినంగా లేకపోవడం, చాలా అరచుగా కార్మిక చట్టాలను ఉల్లంఘించగల అవకాశాలు మెండుగా ఉండడం, అమెరికాలో అత్యధిక వేతనాలు చెల్లించవలసి రావడం… ఇవన్నీ ఔట్ సౌర్సింగ్ ను పెంచాయి. ఈ ప్రక్రియ ప్రపంచీకరణ విధానాలలో భాగంగానే జరిగాయి తప్ప ప్రత్యేకంగా జరిగినవి కాదు. తాము ప్రపంచానికి ప్రబోధించే విధానాల వల్ల తమకే నష్టం ఏర్పడినప్పుడు దాని ప్రపంచీకరణ ఫలితంగా చూడకుండా ‘ఒక జబ్బు’ గా చూడడం వెనక అమెరికా పాలకుల వంకర బుద్ధి కనపడుతోంది.
పెట్టుబడులకు సరిహద్దులకు అతీతంగా చొరబడడానికి అవకాశాలు ఇవ్వాలని కోరే అమెరికా, యూరప్ లు కార్మికుల ప్రపంచీకరణ విషయానికి వచ్చే సరికి ప్రొటెక్షనిస్టు విధానాలను అనుసరిస్తున్నాయి. ఇది కొత్త కాదు. ప్రపంచీకరణ విధానాలు ప్రారంభ కాక మునుపు కూడ అమెరికా, యూరప్ లు ఇలా రక్షణ విధానాలు అమలు చేసాయి. ఇండియాలొకి రావడానికి మాత్రం అన్ని గేట్లూ బార్లా తెరవాలని డిమాండ్ చేస్తాయి. అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఓటర్లకు గాలం వెయ్యడానికి ఈ విధంగా అమెరికా ఉద్యోగాలను ఇండియా లాంటి దేశాలు కొల్లగొడుతున్నాయని దుష్ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇండియా పాలకులు ఈ అంశాలను గుర్తించవలసి ఉంది. అమెరికా యూరప్ దేశాలు తమ ఉద్యోగాలు రక్షించుకోవడానికి తమ దేశాల్లో జాతి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి సైతం వెనకాడని పరిస్ధితి ఉండగా, ఇండియా పాలకులు మాత్రం ఇక్కడి వనరులతో పాటు, ఆ వనరులతో పరిశ్రమలు పెట్టగల అవకాశాలనూ, తద్వారా ఉద్యోగాలు కల్పించగల అవకాశాలను కూడా పోగొడుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి