13, డిసెంబర్ 2011, మంగళవారం

మంత్రగత్తె అన్న సాకుతో మహిళ తల నరికివేత

రియాద్, డిసెంబర్ 12: సౌదీ అరేబియాలో మంత్రగత్తెఅనే అభియోగంపైఒక మహిళకు దారుణమైన శిక్ష విధించారు. మహిళ తలనరికివేసినట్టు సౌదీ అంతరంగిక మంత్రి వెల్లడించారు. దేశంలో మాయలు, మంత్రాలు నిషేధం. ఉత్తర ప్రోవిన్స్‌లోని జ్వావ్ పట్టణానికి చెందిన అమీనాబింట్ అబ్దుహలీమ్ సస్సార్ మంత్ర విద్యను వ్యాప్తి చేస్తో ప్రజలను మూఢనమ్మకాలకు పురిగొల్పుతోందని ఆయన చెప్పారు. అయితే ఎంత మంది మహిళలను ఇలాంటి శిక్షలకు గురైందీ తెలియరాలేదని మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. మంత్రగత్తె అనే అనుమానంతో ఒక మహిళను ఆమె భర్తే తలనరికి చంపేశాడు. తరువాత ఇంటికి నిప్పుపెట్టినట్టు ప్రభుత్వ వార్త సంస్థ ‘స్పా’ పేర్కొంది. మంత్ర విద్య ఆరోపణలపై ఈ సంవత్సరం ఏకంగా 73 మందికి సౌదీలో ఇలాంటి శిక్షలు విధించారు. ముస్లింల రాజరికపాలనలోప్రజల మానప్రాణాలు రక్షణలేకుండా పోయిందని అమ్నేస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరణశిక్షలకు సంబంధించి గత ఏడాది ఐరాస సర్వసభ్యసమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాన్ని సౌదీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. వివిధ నేరాల కింద 140 మందిపై ఉరిశిక్షలు ఖరారయ్యాయని, ఏక్షణానైనా వాటిని అమలు చేయవచ్చని అమ్నేస్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా వంటి నేరాలకు సౌదీ అరేబియాలో ఘోరమైన శిక్షలు విధిస్తారు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఉరిశిక్షలు అమలు చేస్తున్నారని అమ్నేస్టీ వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి