12, డిసెంబర్ 2011, సోమవారం

హిందూ మహాసముద్రం... సైనిక స్థావరాల నిలయం

స్పెషల్ డెస్క్:హిందూ మహా సముద్రం అనగానే ఆ ప్రాంతమంతా మన దేశానిదేమో అనిపిస్తుంది. ఇంగ్లిష్‌లో దీన్ని ఇండియన్ ఓషన్ అని పిలవడం కూడా ఇందుకు ఓ కారణం. ఈ ప్రాంతంలో అసంఖ్యాకంగా దీవులున్నాయి. ఇవన్నీ వివిధ దేశాల అధీనంలో ఉన్నాయి. మాల్దీవులు, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కామెరోస్‌లాంటివి స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ దేశాలు కొన్ని దీవుల సమూహాలు. భారత్‌కు తూర్పు వైపు 26, ప శ్చిమాన 25, దక్షిణాన 6 దీవులు ఉన్నాయి వీటిలో మనకు సంబంధించినవి అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పంబన్ దీవులు మాత్ర మే. అండమాన్, నికోబార్ దీవులే 572 దీవుల సముదాయం. హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఉన్న ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండొనేసియా, మయన్మార్, మలేసియా, మారిషస్, యెమెన్, మొజాంబిక్ లాంటి దేశాలకు మాత్రమే కాదు..ఎక్కడో యూరోప్ లో ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్‌లకు సైతం ఇక్కడ సొంత దీవులున్నాయి. హిందూమహా సముద్రంలో తమ యుద్ధ నౌకలు లంగరేస్తే..తమ సైనిక, వైమానిక దళాలను అక్కడ తిష్టవేయిస్తే ఈ ప్రాంతంలోని దేశాలపై చెక్ పెట్టవచ్చన్నది అగ్ర రాజ్యాల వ్యూహం. 

హిందూ మహా సముద్రాన్ని శాంతి మండలంగా ఉంచాలని చాలా దేశాలు దశాబ్దాలుగా చెబుతున్నాయి. కానీ, అలా అంటూనే చడీ చప్పుడూ కాకుండా అక్కడ స్థావరాలు నెలకొల్పుతున్నాయి. హిందూ మహా సముద్రంలోని డీగో గార్షియా దీవిలో బ్రిటన్ సైనిక, నావికాదళ స్థావరాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే, ఫ్రాన్స్‌కి సైతం ఇలాంటి స్థావరాలున్నాయి. ఈ రేసులోకి ఆలస్యంగా ప్రవేశించింది అమెరికా, చైనాలు. ఆసియా ప్రాంతంలో ఆధిపత్యం కోసం, ముఖ్యంగా మిడిసిపడుతున్న చైనాకు కళ్లెం వేయడానికి అమెరికా ఈమధ్యే ఉత్తర ఆస్ట్రేలియా నగరం డార్విన్‌లో స్థావరాన్ని ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. 

అంతేకాదు, ఉగ్రవాద ముప్పును అరికట్టే పేరుమీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏర్పాటుచేసుకున్న 60 ద్రోన్ స్థావరాల్లో హిందూమహా సముద్ర ప్రాంత దీవులుకూడా ఉన్నాయని ఈమధ్యే ఒక సైనిక నిపుణుడు అంచనా వేశాడు. అటు చైనా కూడా క్రమేపీ తన పరిధిని విస్తరించుకుంటోంది. భారత్‌తో యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడితే అండమాన్, నికోబార్ దీవులకు క్షణంలో చేరేలా వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగానే మయన్మార్‌కు చెందిన కోకో దీవిలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట వైమానిక స్థావర నిర్మాణాన్ని చేపట్టింది. ఇటీవలి కాలంలో శ్రీలంకతో భారత్‌కు వచ్చిన పొరపొచ్చాలను ఉపయోగించుకుని చైనా లంకలోని హంబన్‌టోలాలో భారీ ఓడరేవు నిర్మించింది. ఇప్పుడు తాజాగా సెషెల్స్‌పై దృష్టి సారించింది. క్రమేపీ మన దేశాన్ని సైనికంగా చుట్టుముట్టడమే చైనా ఆంతర్యమని నిపుణులు గత కొంతకాలంగా చేస్తున్న విశ్లేషణలను తాజా చర్య ధ్రువీకరిస్తోంది. ఇది మన దేశ భద్రతకు ఎంతో ఆందోళన కలిగించే విషయం. చైనా భవిష్యత్తు వ్యూహాన్ని అంచనా వేసుకున్న మనదేశం 2000 సంవత్సరంలోనే అక్కడున్న మన వైమానిక, నావికా స్థావరాలను పటిష్టపరిచే పనిలో నిమగ్నమైంది. త్రివిధ దళాల సంసిద్ధతను పెంచడానికి అక్కడ నిరంతరం విన్యాసాలు సాగుతుంటాయి. మొత్తానికి నిత్యం సైనిక పద ఘట్టనలతో హిందూ మహా సముద్ర ప్రాంత దీవులు మార్మోగుతున్నాయి. దీన్ని శాంతిమండలంగా ఉంచాలన్న ఆశయానికి గండికొడుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి