విహార
యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు.
లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై
మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా
అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం
తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ
లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా,
లేదా అని చెప్పడానికి వారు నిరాకరించారు. భారత దేశంలో ఉన్న విద్యార్ధి
తల్లిదండ్రులకు అతని మరణవార్తను తెలియజేశారని తెలుస్తోంది.
క్రిస్టమస్
సెలవు సందర్భంగా విద్యార్ధి తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి సాల్
ఫోర్డ్ వెళ్ళాడు. మిత్రులలో అమ్మాయిలూ, అబ్బాయిలూ ఉన్నట్లు తెలుస్తోంది.
బృందంలో ఉన్నవారంతా భారతీయులేనని పత్రికలు తెలిపాయి. హత్య జరిగిన
ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న హోటల్ లో తొమ్మిది మంది బసచేశారని పోలీసులు
తెలిపారు. సోమవారం తెల్లవారు ఝాము ఒకటిన్నర సమయంలో హోటల్ నుండి సిటీ సెంటర్
కి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిని సమీపించినట్లుగా పోలీసులు
తెలిపారు. చాలా కొద్ది సేపు మాత్రమే సంభాషణ జరిగిన అనంతరం ఇద్దరిలో ఒకరు
తుపాకి తీసి అత్యంత సమీపం నుండి విద్యార్ధి తలలో కాల్చి చంపినట్లు పోలీసులు
తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు అక్కడినుండి పారిపోయారు.
విద్యార్ధిని
ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.
కాల్చిన వ్యక్తి సన్నగా ఉన్నాడనీ, రెండో వ్యక్తి లావుగా ఉన్నాడనీ మిత్రులు
తెలిపారు. వారు విద్యార్ధితో ఏమి మాట్లాడిందీ చెప్పడానికి పోలీస్ ఛీఫ్
నిరాకరించాడు. విద్యార్ధి మిత్రులు ప్రారంభ సాక్ష్యం ఇచ్చారనీ, వారికి
రక్షణ కల్పించామని పోలీసులు తెలిపారు. “ఇది ముందస్తు కారణం ఏమీ లేకుండా
జరిగిన హత్య. ఈ సమయంలో ఏ ఉద్దేశాన్నీ నిందితుడికి ఆపాదించలేము. ప్రతి
అంశాన్నీ పరిశీలిస్తున్నాం. దర్యాప్తులో ప్రాధమిక దశలో ఉన్నాం. కాని ఏ
అంశాన్నీ కొట్టిపారేయడం లేదు” అని పోలీస్ ఛీఫ్ తెలిపాడు. జాతి విద్వేషం
కూడా తమ దర్యాప్తు అంశాలలో ఉందని పోలీస్ ఛీఫ్ పరోక్షంగా తెలిపాడు.
ఈ ఘటనతో
స్ధానిక భారత సంతతి ప్రజల్లో భయాందోళలనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రాంతంలో
పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. భారతీయుల భయాందోళనలను తామూ
పంచుకుంటున్నామనీ నేరస్ధులను అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామనీ
పోలీస్ ఛీఫ్ ముల్లిగాన్ హామీ ఇచ్చాడు. విద్యార్ధి పేరు పోలీసులు
చెప్పలేదు. నిందితుల గురించిన వివరం తెలిసిన వారు పోలీసులకి చెప్పాలని
పోలీసు ఛీఫ్ స్ధానికులకి విజ్ఞప్తి చేశాడు. తమ దగ్గరి వ్యక్తులే ఈ ఘోరకలికి
బలయ్యారని భావించి నేరస్ధుల సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
ఇంగ్లండులో
కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం ప్రజలపైన దారుణమైన పొదుపు విధానాలను అమలు
చేస్తున్నది. బడా కంపెనీలకు పెద్ద ఎత్తున బెయిలౌట్లు ఇవ్వడం వల్ల
ప్రభుత్వంపై అప్పు భారం బాగా పెరిగిపొయింది. బడ్జెట్ లోటు బాగా
పెరిగిపోయింది. బడ్జెట్ లోటు తగ్గించుకునే పేరుతో బ్రిటన్ ప్రభుత్వం పొదుపు
విధానాలను అమలు చేస్తోంది. పొదుపు విధానలలో భాగంగా ఉద్యోగాలు రద్దు
చేస్తున్నారు. వేతనాలలో కోత పెడుతున్నారు. సంక్షేమ సదుపాయాలను రద్దు చేయడంఓ
కోత పెట్టడమో చేస్తున్నారు. దీనితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
ప్రజల
అసంతృప్తిని ప్రభుత్వాల పొదుపు ఆర్ధిక విధానాలనుండి పక్కకు మళ్ళించడానికీ,
బ్రిటన్ తో పాటు యూరప్ లోని ఇతర ప్రభుత్వాలు కూడా వివిధ సాంఘిక సమస్యలను
రెచ్చగొట్టడం ప్రారభించాయి. అందులో ప్రధానంగా ‘మల్టి కల్చరలిజం’ విఫలం
అయిందంటూ ప్రభుత్వాధినేతలే ప్రచారం లంకించుకున్నారు. విదేశీయులు ఉండడం వల్ల
యూరోపియన్లకు ఉద్యోగావకాశాలు దొరకడం లేదని తప్పుడు ప్రచారం వీరు
చేస్తున్నారు. ఒక్క బ్రిటన్ లో కాకుండా యూరప్ అంతటా ఈ ధోరణి
పెచ్చరిల్లింది. దానితో యూరప్ లో విదేశీయులపై దాడులు ఊపందుకున్నాయి.
ముఖ్యంగా నల్లవారు, క్రీమ్ కలర్ వారు అన్న తేడాలను చూపడం యువతలో
ఎక్కువయ్యింది. ఈ ధోరణిని అరికట్టని పక్షంలో మరిన్ని దారుణాలు జరిగే అవకాశం
ఉంది. భారతీయులు ఇంగ్లండ్, ఆ మాటకొస్తే యూరప్, అమెరికాలను కూడా
సందర్శించేముందు ఒకటికి రెండుసార్లయినా ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి