12, డిసెంబర్ 2011, సోమవారం

పరిశ్రమలు... కకావికలం!

అక్టోబర్‌లో మైనస్ 5.1% పతనమైన పారిశ్రామికోత్పత్తి 
మూడేళ్ల కనిష్ట స్థాయి వడ్డీరేట్లు, అంతర్జాతీయ అంశాలు కారణం మైనింగ్, తయారీ రంగాల పేలవ పనితీరు రిజర్వు బ్యాంకు పాలసీరేట్ల పెంపునకు ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం!

న్యూఢిల్లీ: గరిష్ట స్థాయిలకు చేరిన వడ్డీరేట్లు వీటికి తోడు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు- వెరసి పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) నామమాత్ర వృద్ధికూడా లేకపోగా ఉత్పత్తి -5.1 శాతం పడిపోయింది. 

ఇది దాదాపు మూడేళ్ల కనిష్ట స్థాయి. 2009 జూన్ తర్వాత ఇలా వృద్ధిరేటు మైనస్‌లోకి దిగజారడం ఇదే ప్రథమం. గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి రేటు 11.3 శాతంగా ఉంది. గత కొన్ని నెలలుగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు భారీగా తగ్గుతూ వచ్చి, అక్టోబర్‌లో ఏకంగా క్షీణతలోకి జారిపోయింది. 

మైనింగ్, తయారీ రంగాలు పేలవం
అక్టోబర్‌లో మైనింగ్, తయారీ రంగాలు పూర్తి పేలవ పనితీరును కనబరిచాయి. మైనింగ్ ఉత్పత్తి 7.2 శాతం క్షీణతలోకి జారిపోగా, ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం కూడా ఇదే బాటన 6 శాతం క్షీణించింది. 2010 అక్టోబర్‌లో మైనింగ్ రంగం ఉత్పత్తి 6.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోగా, తయారీ రంగం 12.3 శాతం వృద్ధి చెందింది. 

భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి గత ఏడాది అక్టోబర్‌లో 21.1 శాతం సానుకూల వృద్ధి సాధించగా, తాజాగా 25.5 శాతం ప్రతికూల వృద్ధిలోకి జారింది. వినియోగవస్తువుల రంగానిది కూడా ఇదే పరిస్థితి. ఈ రంగం ఉత్పత్తి 9.3 శాతం వృద్ధి నుంచి 0.8 ప్రతికూల వృద్ధిలోకి మళ్లింది. ఇక విద్యుత్ రంగం మాత్రం వృద్ధి రేటు సాధించినప్పటికీ, అది 8.8 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది.

ఏడు నెలల్లో...: ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఐఐపీ వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. మైనింగ్ రంగం ఉత్పత్తి 6.9 శాతం వృద్ధి బాట నుంచి -2.2 శాతం క్షీణ బాటలోకి జారిపోయింది. తయారీ రంగం వృద్ధి రేటు భారీగా 9.4 శాతం నుంచి 3.7 శాతానికి పడిపోయింది. ఒక్క విద్యుత్ రంగం మాత్రం ఏడు నెలల్లో మెరుగైన వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ రంగం వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 8.9 శాతానికి పెరిగింది. 

ఆర్‌బీఐ పాలసీరేట్లపై అంచనాలు...: ఐఐపీ అత్యంత నిరుత్సాహ గణాంకాలు... ఈనెల 16న రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ సమీక్షపై ప్రభావతం చూపే అవకాశం ఉందని, రేట్ల పెంపునకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చనేది ఆర్థిక వేత్తల అంచనా. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్‌బీఐ 2010 మార్చి నుంచి ఇప్పటి వరకూ 13 సార్లు 3.75 శాతం మేర పాలసీ రేట్లను పెంచింది.


ఇంత పతనాన్ని ఊహించలేదు
గణాంకాలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఐఐపీ వృద్ధి రేటు తగ్గుతుందని భావించాం కానీ, ప్రతికూల వృద్ధి నమోదవుతుందని అనుకోలేదు. మళ్లీ వృద్ధి బాటలోకి తీసుకురావడానికి తగిన చర్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మరోపక్క, ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి కొనసాగితే, ఆర్‌బీఐ తన కఠిన పాలసీ చర్యలపై సమీక్ష జరిపే అవకాశం ఉంటుంది. 
- సి.రంగరాజన్, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్





ఉపాధి అవకాశాలపై ప్రభావం: కార్పొరేట్లు
తాజా గణాంకాలపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. వడ్డీరేట్ల భారాన్ని క్రమంగా తగ్గించాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు ప్రోత్సాహకాలు కల్పించాల్సిన తరుణం ఆసన్నమైనట్లు ఫిక్కీ పేర్కొంది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ పెను తుపానులో చిక్కుకుంది. దీనికి ప్రభుత్వం స్పందించాలి’’ అని ట్విటర్‌లో మహీంద్రా గ్రూప్ వైస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి