28, అక్టోబర్ 2013, సోమవారం

తెలంగాణ విద్యుత్ కేంద్రాలపై కుట్రలు


-కేటీపీఎస్‌ను కాదని వీటీపీఎస్‌కు భారీగా బొగ్గు తరలింపు
-బొగ్గు నిల్వలు నిండుకుంటున్నా పట్టించుకోని అధికారులు
-బలవంతంగా 24 గంటలపాటు కేటీపీఎస్ యూనిట్ మూసివేత
హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ మీడియా):రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టిన కారణంగా జెన్‌కో యూనిట్లలో విద్యుదుత్పత్తిని తగ్గించాలని విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 6-స్టేజ్‌లోని 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యూనిట్‌ను నిలిపివేయాలని ఎస్‌ఎల్‌డీసీ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. జెన్‌కో ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తే తప్ప తాము యూనిట్‌ను నిలిపివేసేది లేదని కేటీపీఎస్ అధికారులు స్పష్టం చేశారు. జెన్‌కో సీఎండీ విజయానంద్, డైరెక్టర్(ప్రాజెక్ట్స్, థర్మల్) రాధాకృష్ణ ఇతర రాష్ట్రాల్లో, చీఫ్ ఇంజనీర్(జనరేషన్) సుందర్‌సింగ్ విదేశీ పర్యటనల్లో ఉన్న సమయంలో విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) యూనిట్ మూసివేతకు కేవలం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం కుట్ర అనుమానాలకు బలం చేకూరుస్తోంది. power

దీనివల్ల ప్రాజెక్టు స్థిరవ్యయంపైన, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)పైనా గణనీయమైన ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి వ్యయం చాలా తక్కువ(యూనిట్‌కు రూ.2.60లు). అవసరమైతే విజయవాడలోని వీటీపీఎస్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కనుక(యూనిట్‌కు రూ.3.40) అక్కడి(వీటీపీఎస్) యూనిట్లను మూసివేతకు ఆదేశించాలని కేటీపీఎస్ అధికారులు సూచించారు. వాస్తవానికి ఆగస్టులోనే కేటీపీఎస్ 11వ యూనిట్ 35 రోజుల పాటు వార్షిక మరమ్మతులను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 6 నుంచి నిరవధికంగా యాభై రోజుల పాటు 74 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)తో విద్యుదుత్పత్తిని సాధిస్తోంది. గత ఏడాదిలో 94 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయస్థాయిలో రికార్డును నమోదు చేసుకున్న కేటీపీఎస్‌ను దెబ్బ తీసేందుకే యూనిట్ నిలిపివేతకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయన్న విషయాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గుర్తించారు.

యూనిట్ స్థిరవ్యయం(ఫిక్స్‌డ్ కాస్ట్) పూర్తి కావాలంటే కనీసం 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చే మార్చి వరకు వరుసగా ఐదు నెలలపాటు యూనిట్‌ను నడపగలిగితేనే 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించగలమని వారు గుర్తుచేశారు. అవేమీ పట్టించుకోని సీమాంధ్ర అధికారులు మొండిగా వ్యవహరించి కేటీపీఎస్ 6వ దశ మూసివేతకు ఆదేశాలిచ్చారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేటీపీఎస్ స్టేజ్-6 లోని 11వ యూనిట్‌ను హ్యాండ్‌ట్రిప్ చేసి 24 గంటలపాటు మూతపడేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో సుమారు 15 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయి దాదాపు రూ.3కోట్లు నష్టపోయినట్టయింది. నిజంగా విద్యుత్‌సౌధలోని ఎస్‌ఎల్‌డీసీ నుంచి గానీ, ట్రాన్స్‌కో నుంచి గానీ అధికారికంగా ఉత్తర్వులు(పూటర్) ఇచ్చి ఉంటే దానిని ‘డీమ్డ్ పీఎల్‌ఎఫ్’గా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది. పవర్ యూనిట్ల నెలవారీ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)ను బట్టి ఉద్యోగులకు అల యాజమాన్యం చెల్లిస్తుంది.

ఇదిలా ఉండగా, కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలోని ఏ-స్టేషన్‌కు చెందిన 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు బొగ్గు కొరత కారణంగా మూతపడ్డాయి. దగ్గర్లోని మణుగూరు, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుంచి బొగ్గు అనుమతులు పొందినా ఈ యూనిట్లను కాదని విజయవాడలోని వీటీపీఎస్‌కు సింగరేణి బొగ్గును పూర్తిస్థాయిలో తరలించి అక్కడి నిల్వలు పెంచడం మరో వివక్షగా పేర్కొంటున్నారు. విజయవాడలోని వీటీపీఎస్, కడపలోని ఆర్టీపీసీ యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ పవర్‌వూపాజెక్టులను మాత్రమే పనిచేయకుండా చేయడం పాలకుల కుట్రలకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి