2, అక్టోబర్ 2013, బుధవారం

నరేంద్రమోడీ చేసిన పాపమేంటి?


  • -ఎస్.కె. సిన్హా
  • 30/09/2013
మధ్యయుగాల్లో భారతదేశంలో మత సంఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. ఇక 19వ శతాబ్దంలో చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకున్నాయి. కానీ 20వ శతాబ్దం వచ్చేసరికి అవి సర్వసాధారణమైపోయాయి. గడచిన శతాబ్దాల్లో పాలకులు లేదా మనదేశంపైకి దండెత్తిన వారు మాత్రమే మతపరమైన దురాగతాలకు పాల్పడేవారు. అంతేకాని సామాన్య జనం లో ఎన్నడూ మత సంఘర్షణలు జరిగేవి కావు. హిందువులు బలహీనులు కావడం వల్ల శక్తివంతమైన ముస్లిం పాలకులకు విధేయులుగానే కొనసాగారు. తమ తలరాత ఇట్లా ఉన్నదంటూ, కష్టాలను ఓర్చుకుంటూ, తమ భూమిలోనే చాలా కష్టపడి పనిచేస్తూ జీవనం గడిపేవారు. భారత్‌లో ఇస్లాంపై సుఫీ ప్రభావం ఉండటం వల్ల, సరళీకృత సిద్ధాంతంగా వృద్ధి చెందింది. అక్బర్ వంటి ముస్లిం చక్రవర్తులు ముస్లిమేతరులపట్ల సహనంతో వ్యవహరించారు. అయినప్పటికీ చాలామంది ముస్లిం రాజులు మతఛాందస వాదులుగానే కొనసాగారు. మరాఠాలు, సిక్కులు లేదా జాట్‌లు తర్వాతికాలంలో రాజ్యాలను స్థాపించుకునే స్థాయికి ఎదిగినా, మతఘర్షణలన్న మాటే లేదు. ఛత్రపతి శివాజీ పవిత్ర ఖురాన్ పట్ల అపరిమితమైన గౌరవాన్ని ప్రదర్శించాడు. రంజిత్ సింగ్ కూడా అదేవిధంగా వ్యవహరించాడు. అన్నింటికీ మించి సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయానికి పునాదిరాయి వేసినవాడు ఒక ముస్లిం సన్యాసి. ఆయన పేరు మియాన్ మీర్!
అఖిల భారత ముస్లింలీగ్ మొట్టమొదటి సదస్సు ఢాకాలో జరిగింది. ఈ సందర్భంగా తూర్పు బెంగాల్, అస్సాం ప్రాంతాలతో కూడిన ‘బంగె-ఇస్లాం’ ఏర్పాటు కావాలని డిమాండ్ చేసింది. అదేసమయంలో లార్డ్ కర్జన్ వైస్రాయ్‌గా ఉన్నాడు. అప్పట్లో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్ కర్జన్, పాలనా పరంగా భారంగా ఉన్నదన్న నెపంతో బెంగాల్ ప్రెసిడెన్సీని రెండుగా విడగొట్టాడు. అయితే ఇక్కడ పాలనాపరమైన సౌలభ్యం అనేది కేవలం పైకి చెప్పే హేతువు. కానీ అంతర్గత కారణమేమంటే, విభజించి పాలించాలన్న కుటిల రాజనీతి! విభజన ప్రకటన తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చివరకు ఇవి నియంత్రించలేని స్థాయికి చేరుకోవడంతో, బెంగాల్ విభజనను బ్రిటిష్ ప్రభుత్వం 1911లో రద్దు చేసింది. ఇక 20వ శతాబ్దం ప్రారంభమైన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తరచుగా మతఘర్షణలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి చాలా అరుదుగా కనిపించేవి. అయితే దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. 1917లో బ్యాక్రిడ్ అల్లర్లు, 1920లో బీహార్‌లో చోటు చేసుకున్న మోప్లాతిరుగుబాటు మాత్రమే ప్రముఖమైనవి. మతసంఘర్షణలనేవి కేవలం స్థానిక ప్రాంతాలకే పరిమితమయ్యేవి. జంతుబలులు, భూతగాదాలు, మహిళలను చిత్రహింసలకు గురిచేయడం లేదా అపహరించుకుపోవడం వంటి సందర్భాల్లో మాత్రమే మతఘర్షణలు చోటు చేసుకునేవి. ఈ అల్లర్లలో రాజకీయాల ప్రమేయమే ఉండేది కాదు.
1946 ఆగస్టు 16న మహమ్మదలీ జిన్నా కలకత్తాలో ‘ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని’ నిర్వహించాడు. అప్పట్లో కేవలం బెంగాల్‌లో మాత్రమే ముస్లింలీగ్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి సుహ్రా వర్డీ, దారుణమైన కలకత్తా హత్యాకాండను దగ్గరుండి మరీ జరిపించాడు. ఇందులో దాదాపు నాలుగువేలమంది అమాయకులు ఊచకోతకు గురయ్యారు. ఇంతటి దారుణం జరుగుతున్నా, పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప శాంతిభద్రతలను కాపాడే తమ విధులను మరచి అందులో కలుగజేసుకోలేదు. ఈ రాష్ట్రంలో ప్రారంభమైన మత హింస నియంత్రించలేని స్థాయికి చేరుకుంది. దీని తర్వాత దేశవ్యాప్తంగా ప్రతీకార హింస యదేచ్ఛగా సాగిపోయింది. ఇక దేశవిభజన జరిగిన కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న మతహింస గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మతఘర్షణల తుపానులో కొన్ని లక్షలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశాబ్దం..ఆ తర్వాత మనదేశాన్ని ఏలిన నేతలు సర్వమత సమభావనను నిక్కచ్చిగా పాటించారు. ఇదే సమయంలో దేశానికి సమర్ధవంతమైన పాలనను అందించారు. మత ఘర్షణలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన కుహనా సెక్యులరిస్టులు ఓటు బ్యాంకు కోసం కుటిల రాజకీయాలు నెరపడంతో, పరిపాలన పూర్తిగా అడుగంటిపోయి, మత ఘర్షణలు చాలా తరచుగా చోటు చేసుకోవడం ప్రారంభమైంది. ఈ హింసాకాండకు కొన్ని సందర్భాల్లో మృతుల సంఖ్య నాలుగంకెలు దాటింది కూడ. ముంబయి (1980), అస్సాం (1983), ఢిల్లీ (1984), భాగల్పూర్ (1989), గుజరాత్ (2002)ల్లో జరిగిన ఘర్షణలు ఇందుకు ఉదాహరణ. మరి ఇన్ని సార్లు దేశంలో మత ఘర్షణలు జరిగినా కుహనా సెక్యులర్ బ్రిగేడ్లు, మీడియా సహాయంతో కేవలం 2002 గుజరాత్ అల్లర్లను మాత్రమే ప్రస్తావిస్తూ, నరేంద్రమోడిని ఒక రాక్షసుడిగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నారు. మరి ఆయన గుజరాత్‌ను అభివృద్ధి చేసిన విషయం, సమర్ధవంతమైన పాలనను అందించిన అంశాలను కావాలనే వెలుగులోకి రానివ్వకుండా సాధ్యమైనంత తక్కువచేసి చూపడానికి యత్నిస్తున్నారు. 2002 తర్వాత దేశం మొత్తం మీద మత ఘర్షణలు జరగని రాష్ట్రం కేవలం గుజరాత్ మాత్రమే! 2003లో గాంధీనగర్‌లోని అక్షరథామ్‌పై ఉగ్రవాద ముష్కరులు దాడి చేసి ఆలయ పూజారిని, తీర్థయాత్రికులను హతమార్చినప్పటికీ, రాష్ట్రంలో మత ఘర్షణలు జరగకుండా గట్టి చర్యలు తీసుకొని, శాంతిని కాపాడటం జరిగింది.
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో న్యూఢిల్లీలో జరిగిన సిక్కుల హత్యాకాండతో 2002 గుజరాత్ అల్లర్లు రెండోస్థానాన్ని ఆక్రమిస్తాయి. అప్పట్లో తల్లిని కోల్పోయి హతాశుడైన స్థితిలో ఒక యువకుడైన వ్యక్తి దేశ ప్రధాని పదవిని చేపట్టాడు. ఆయన అప్పట్లో ఒక దురదృష్టకరమైన ప్రకటన ఒకటి చేశారు. ‘‘ఒక పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు, భూమి కంపిస్తుంది,’’ అనేదే ఆ ప్రకటన. కేవలం ఈ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్టు హింసను మరింత ప్రజ్వరిల్లజేయడానికి కారణమైంది. తక్షణ సైనిక సహాయం అందుబాటులో ఉన్నా, మూడు రోజులపాటు ప్రభుత్వం సైనిక సహాయాన్ని కోరలేదు. హింసాకాండ యదేచ్ఛగా కొనసాగింది. కాంగ్రెస్ గూండాలు కేవలం ఢిల్లీలోనే మూడువేలమంది సిక్కులను పొట్టన పెట్టుకున్నారు. ఇతర పట్టణాల్లో మరికొందరు బలైపోయారు. ఢిల్లీ పోలీసులు వౌన ప్రేక్షకులుగా ఉంటూ, హింసను ప్రోత్సహించారు. మూడు రోజుల తర్వాత సైన్యాన్ని రంగంలోకి దించిన వెంటనే హింసాకాండ నిలిచిపోయింది. ఆ తర్వాత ఏవిధమైన మరణాలు సంభవించలేదు. మరి ఈ సంఘటన జరిగి 30 ఏళ్ళు కావస్తున్నది. నేటి వరకు ఏఒక్క నిందితుడు పట్టుబడిన పాపాన పోలేదు. మరి గుజరాత్ విషయానికి వస్తే, నరేంద్రమోడి కొత్తగా రాష్ట్ర పగ్గాలను చేపట్టారు. తర్వాత చోటు చేసుకున్న దారుణ హత్యాకాండలో 50 మంది హిందువులు దారుణంగా సజీవదహనానికి గురయ్యారు. ఈ సంఘటన గోద్రా రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. దగ్ధమై పోతున్న రైలు బోగీల చుట్టూ పెద్ద సంఖ్యలో గుమికూడిన వారు, సహాయక చర్యలు జరగకుండా అడ్డుకున్నారు. మరి ఈ ఘోరకృత్యం తక్షణమే రాష్ట్రంలో ప్రతీకార హింసాకాండకు దారితీసింది. ఈ హింసాకాండను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు కొన్ని సందర్భాల్లో వాటిని ప్రోత్సహించడం జరిగింది. మోడీ తక్షణమే స్పందించి సైనిక సహాయం కోసం అర్ధించారు. కానీ ‘ఆపరేషన్ పోఖ్రాన్’లో పాల్గొనేందుకు సైన్యాన్ని సరిహద్దుల వద్ద మోహరించారు. అయితే అక్కడినుంచి సైన్యాన్ని ఉపసంహరించి గుజరాత్‌కు పంపగా, మూడో రోజునుంచి సైన్యం రంగంలోకి దిగింది. తర్వాత సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో హిందువులు, ముస్లింలు మరణించారు. క్రమంగా రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి ఘర్షణల్లో హిందువులు, ముస్లింలు మొత్తం రెండువేలమంది మృతి చెందారు. రెండు మతాలకు చెందిన చాలామందిపై అభియోగాలు ఋజువయ్యాయి కూడ. వీరికి చట్టపరిధిలో కోర్టులు శిక్షలు విధించాయి. తర్వాత ఎన్నో విచారణలు, దర్యాప్తులు జరిగినప్పటికీ, నరేంద్రమోడీపై వేలెత్తి చూపే అవకాశమే కలుగలేదు. మోడీని బాధ్యుడిని చేయాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆయన ప్రమేయం ఉంటే కదా..బాధ్యుడిని చేయడానికి! ఈ వాస్తవాలను ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు.
ముజాఫర్ నగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మతఘర్షణలు ఇటీవలి కాలంలో అంత్యంత తీవ్రమైనవిగా పరిగణించాలి. ఓటుబ్యాంకు రాజకీయాలను నెరపే సమాజ్‌వాది పార్టీ గత ఏడాదికాలంలో చోటు చేసుకున్న మత ఘర్షణల సమయంలో చూసీ చూడనట్టు వ్యవహరించిన ఘన చరిత్ర కలది. సకాలంలో చర్యలు తీసుకొని ముజాఫర్ నగర్ అల్లర్లను అరికట్టడంలో ఘోరం గా విఫలమైంది. ఫలితంగా 40 మంది అల్లర్లకు బలయ్యారు. హిందూ, ముస్లిం కుటుంబాలకు చెందిన అనేకమంది తమ ఇళ్ళను వదలి సహాయక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. రాజకీయ జోక్యం, పోలీసులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటివి తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రాష్ట్ర డిజిపి తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారట!
నేషనల్ పోలీసు కమిషన్ చేసిన సిఫారసులను పరిశీలించి అమలు పరచకానికి ఇదే సరియైన సమయం. సుప్రీంకోర్టు మార్గనిర్దేశకత్వం ప్రకారం పోలీసులు నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించే అవకాశాన్నివ్వాలి. పోలీసులు తమ విధులను నిర్వర్తించే సమయంలో, రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం వారికి అడ్డుపడటం ఏమాత్రం సమంజసం కాదు. 1946లో కలకత్తాలో చోటు చేసుకున్న మతఘర్షణలను కేవలం రాజ్యమే ప్రోత్సహించింది. ముజాఫర్ నగర్‌లో చోటు చేసుకున్నవి కూడా అందుకు పెద్ద భిన్నమైనవేం కాదు. ఇటువంటి ఘర్షణలు దేశ ప్రయోజనాలకు పెను విఘాతం కలిగిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి