18, అక్టోబర్ 2013, శుక్రవారం

371 డీ..‘కొత్త’ చర్చ!


-సవరించకుండా విభజన జరుగదని కొందరు..
-యథాతథంగా ఉంచాలని మరికొందరు
-విభజనతో ఉనికిలోనే ఉండదని ఇంకొందరు
-ఆర్టికల్‌తో సంబంధం లేకుండానే విభజన!
-సీమాంధ్ర నేతల అనవసర రాద్ధాంతం?

(ప్రత్యేక ప్రతినిధి, టీ మీడియా):ఆర్టికల్ 371 ‘డీ’ సవరించకుండా విభజనపై ముందుకు వెళ్లడం కుదరదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు! ఈ ఆర్టికల్‌ను యథాతథంగా ఉంచేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎంను కోరామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అంటున్నారు! రాష్ట్ర విభజన జరిగితే 371 ‘డీ’ దానంతట అదే రద్దయిపోతుందని న్యాయ నిపుణులు

bookఅభిప్రాయపడుతున్నారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఈ ఆర్టికల్ కొనసాగించాలని పలువురు ఉద్యోగ జేఏసీ నేతలు చెబుతున్నారు! రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఏం జరుగుతుంది? 371 ‘డీ’తో రాష్ట్ర విభజనను ఆపవచ్చా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది అమలులో ఉంటుందా? ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు! ఏపీఎన్జీవో నాయకులు, పలువురు సీమాంధ్ర నేతలు పదే పదే ఈ ఆర్టికల్‌ను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజన వేగవంతమవుతున్న క్రమంలో అత్యంత ప్రధానమైన రాష్ట్రపతి ఉత్తర్వు 371‘డీ’ ఆర్టికల్ మళ్లీ తెరమీదకు వచ్చింది. స్థానికుల విద్య, ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్‌ను రద్దు చేయాలా లేక సవరించాలా? అనే విషయంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. యూపీఏ ఆమోదించిన కేబినెట్ నోట్‌లో దీనిని పదవ అంశంగా చేర్చింది. ఒక వైపు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించకుండా రాష్ట్ర విభజనపై ముందుకు కదలలేరని సీమాంధ్ర నేతలు కొత్త వివాదాన్ని లేవదీయడానికి యత్నిస్తున్నారు.

కానీ ఆర్టికల్ 3 ప్రకారం సవరణ అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో 371‘డీ’ని మనుగడలో ఉంచాలా వద్దా? అన్న కోణంలో విస్తృత చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ అధికరణాన్ని తెలంగాణకు అన్యాయం జరుగకుండా తీసుకువచ్చారు. కానీ.. తదుపరికాలంలో ఇది ఉల్లంఘనకు గురై.. సీమాంధ్రులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున చేరిపోయారు. సుదీర్ఘపోరాటం ద్వారా సాధించుకున్న ఈ అధికరణాన్ని రద్దుచేసి రాష్ట్రాన్ని మొత్తం ఒకే జోన్‌గా పరిగణిస్తే ఉద్యోగాల సమస్య మళ్లీ మెదటికొస్తుందని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జేఎసి కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ ఆర్టికల్‌ను ఎత్తివేస్తే హైదరాబాద్‌లో స్థిరపడ్డ తెలంగాణేతరులు, ఇతర రాష్ట్రాలవారు ఉద్యోగాలను కొల్లగొట్టవచ్చని, తెలంగాణలో కూడా జిల్లాల వారీగా స్థానికులకు ఉద్యోగావకాశాలు దెబ్బతిని అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని కొందరు తెలంగాణ మేధావులు, విశ్లేషకులు వాదిస్తున్నారు.

అసలు ఆర్టికల్ 371‘డీ’ అంటే ఏమిటి?
వాస్తవానికి 1956లో హైదరాబాద్ స్టేట్ (ప్రస్తుత తెలంగాణ) ఆంధ్రపాంతం విలీనమై రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల సమస్య ప్రధానంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో స్థానికులకు విద్య, ఉద్యోగావకాశాలకు రాజ్యాంగపరంగా హక్కులు కల్పించారు. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముల్కీ నిబంధనలు అమలుకాక పోవడం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 22వేల మంది నకిలీ ముల్కీ (బోగస్ లోకల్) సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు కొట్టేశారు. దీంతో కడుపు మండిన తెలంగాణ ప్రాంత వాసులు ఉద్యమానికి నడుం బిగించారు.

ఆ క్రమంలోనే 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం వచ్చింది. ‘మా ఉద్యోగాలు మాకే’ అన్న నినాదం బలంగా పని చేసింది. ఉద్యమం ఫలితంగా ముల్కీ నిబంధనలను పటిష్టంగా అమలు పరచడానికి వీలుగా అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి 36జీవోను జారీచేశారు. ఈ పరిణామంతో కంగుతిన్న సీమాంధ్ర ప్రాంత వాసులు కొందరు జీవో 36ను, ముల్కీ నిబంధనలను రద్దుచేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును తెలంగాణవాదులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో భంగపడ్డ సీమాంధ్రకు చెందిన నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రనాయకుల లాబీయింగ్‌కు తలొగ్గి ముల్కీరూల్స్ స్థానంలో మధ్యేమార్గంగా ఆరుసూత్రాల పథకాన్ని అమలులోకి తెచ్చారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డీ ద్వారా స్థానిక రిజర్వేషన్లకు పెద్దపీట వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆరుజోన్‌లుగా విభజించి లోకల్, నాన్‌లోకల్ నిష్పత్తిని నిర్ధారించారు. ఆ ప్రకారంగా తెలంగాణ 5, 6 జోన్ల పరిధిలోకి వచ్చింది. జిల్లా పోస్టుల్లో 80శాతం లోకల్, 20శాతం నాన్‌లోకల్ లేదా ఓపెన్‌కోటా, నాన్‌గెజిటెడ్‌లో 70ః20, గెజిటెడ్ ఉద్యోగాల్లో 60ః40 నిష్పత్తులలో ఉద్యోగాలను కేటాయించారు. ప్రస్తుతం జిల్లా పోస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్ట్‌లను ఏపీపీఎస్సీ ద్వారా నియమకాలు చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రపతి ఉత్తర్వులలో కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడంతో తెలంగాణలో ఉద్యమాలు రగులుతూ వచ్చాయి. ఈ ఆర్టికల్ వల్ల తెలంగాణకు మరింత నష్టం జరిగింది. తెలంగాణ వారి ఉద్యోగాలు 5, 6 జోన్లకే పరిమితం కాగా సీమాంధ్రులకు మాత్రం హైదరాబాద్‌లో అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందే వీలు కలిగింది. 1975నుంచి రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు నిజమేనని గతంలో జైభారత్‌రెడ్డి కమిషన్ నిర్ధారించింది. ఉల్లంఘనల సవరణకు గిర్‌గ్లాని కమిషన్‌వేసి 610 ఉత్తర్వును 1985లో ప్రత్యేకంగా తెచ్చినా అవేవీ ఫలితాలివ్వలేదు. తెలంగాణ ఉద్యమం ఆగలేదు.

కలవరమెందుకు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో 371-డీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని కొంత మంది తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆ అధికరణం అవసరమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఆర్టికల్ రద్దయితే, తెలంగాణ అంతా ఒకే జోన్‌గా మారితే స్థానికులుగా స్థిరపడ్డ తెలంగాణేతరులు హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉద్యోగాలను కూడా ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందనే భయాలున్నాయి. దాంతో పాటు జోనల్ నిబంధనలు లేక పోతే ఆయా జిల్లాల్లో పోస్టులను ఇతర జిల్లాల వారు ఆక్రమించే ఆస్కారం ఉందనే అభిప్రాయం ఉంది.

ఫలితంగా కొత్త రకం సమస్యలు ముందుకు వస్తాయని, ఒక రకమైన అశాంతి నెలకొనే ప్రమాదముందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాల వారీగానే కాకుండా ఆర్టికల్‌ను రద్దు చేస్తే రాజ్యాంగ అధికరణ 15,16 ప్రకారం ఇతర రాష్ట్రాల వారు కూడా గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టుల్లో ఉద్యోగాలు పొందే ప్రమాదముందని అంటున్నారు. ముల్కీ నిబంధనల స్థానంలో వచ్చిన 371-డీ వల్ల కొంత వరకు అన్యాయం జరిగినప్పటికీ అదే ఆర్టికల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వరమవుతుందని టీ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టికల్ దానంతట అదే రద్దవుతుందన్న వాదనతో తెలంగాణ జేఏసీతోపాటు టీ ఉద్యోగసంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్ ఏకీభవించడంలేదు. పంజాబ్, హర్యానా, గుజరాత్, బొంబాయి విభజన తర్వాత కూడ ఆర్టికల్ కొన్ని సవరణలతో మనుగడలో ఉందని చెబుతున్నారు.

ఆర్టికల్ 4 ప్రకారం కొన్ని సవరణలతో 371-డీని అమలులో ఉంచితే తెలంగాణ, స్థానిక ఉద్యోగాలను ఎవరూ కొల్లగొట్టకుండా ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. 371 డీ ఆర్టికల్‌పై ఆశోక్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు అయోమయాన్ని సృష్టించడానికేనని, అదొక వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనని దేవీప్రసాద్, విఠల్ అంటున్నారు. ఆర్టికల్‌ను సవరించకుండా రాష్ట్ర విభజన జరగదని ఒక సాకును చూపడానికి ఇంకా యత్నించడం, ముఖ్యమంత్రి కూడా ఆయనకు వంతపాడటం విడ్డూరమని వారు చెబుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన తెలంగాణ జేఏసీ.. 371-డీ విషయంలో సుదీర్ఘంగా చర్చిస్తోంది. స్థానిక రిజర్వేషన్లకు న్యాయం చేయడానికి ఆర్టికల్‌ను తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్వయించాలని జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్ అభిప్రాయపడ్డారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత అధికరణం సవరణ అని జేఏసీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ సూచిస్తున్నారు. మొత్తానికి 371-డి ఆర్టికల్ సవరణలతోనైనా కొనసాగించాలని జేఏసీ అభిప్రాయపడుతోంది. ఆర్టికల్‌ను రద్దుచేయవద్దని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను కోరనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి