18, అక్టోబర్ 2013, శుక్రవారం

లగడపాటికి బలమైన ప్రత్యామ్నాయంగా పురందేశ్వరి

సిఎం పదవా...ఎంపీ సీటా?

లగడపాటికి బలమైన ప్రత్యామ్నాయంగా పురందేశ్వరి...
కేంద్రమంత్రి పురందేశ్వరి సమైక్యానికి టాటా చెప్పి విభజనకు అనుకూలంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. కేబినెట్ నోట్‌కు నిరసన తెలిపి రాజీనామాలు ఆమోదించాలంటూ ప్రధానిని కలిసినవారిలో ఆమెకూడా ఉన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మొత్తం వ్యవహారంలో మోసానికి గురయ్యామన్న భావన ప్రజల్లో నెలకొందని అన్నారు. ఇప్పుడామె విభజన అనివార్యమన్న రీతిలో మాట్లాడుతున్నారు. విభజన ఆపగలమని అనవసరమైన భ్రమల్లో గడుపుతూ ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే... విజయవాడకు వెళ్లి స్థానిక పారిశ్రామికవేత్తలతో ప్రైవేటుగా సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరపడం మరో ఎత్తు. ఆమె రాజధాని అంశం చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. పుట్టింటి పరంగా ఆమెది కృష్ణా జిల్లా. మెట్టింటి పరంగా చూస్తే ప్రకాశం జిల్లా. సీమాంధ్ర రాజధాని కాగల అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఈ రెండే!విభజన ఆపేందుకు విఫల యత్నం చేయడం కన్నా విభజన అనంతరం సీమాంధ్రకు ఏమేం రాబట్టుకోవాలో అనేదాని మీద ఎక్కువ దృష్టిపెట్టాలనేది ఆమె వాదనగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ధైర్యంతో తీసుకున్న చొరవగానే భావించాలి. నిజానికి ఆమె ఒక్కరే ఈ వైఖరి తీసుకోలేదన్నది వాస్తవం. కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి కూడా దాదాపుగా ఇదే రీతిలో మాట్లాడుతున్నారు. పనబాక లక్ష్మి రాజీనామా చేయనని మొదటి నుంచి కుండబద్దలు కొట్టినట్టు చెపుతున్నారు.ఏదేమైనప్పటికీ పురందేశ్వరి స్థానికులతో సంప్రదింపులు జరిపి ఒకడుగు ముందుకు వేయడం వెనుక గల కారణాలేమిటి? విభజన అనంతరం సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆమె ఆశలు పెట్టుకున్నారా? తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమ చేసిన ఆరోపణ కూడా ఇదే. ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మరీ విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఉమ అంటున్నారు. తన ముఖ్యమంత్రి పదవి కోసమే సమైక్యాంధ్ర ఉద్యమంపై నీళ్లు చల్లుతున్నారంటున్నారు ఉమ. అయితే గియితే ఆమే సీమాంద్రకు తొలి ముఖ్యమంత్రి, అలాగే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్టీఆర్ తనయగా, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, అన్నిటికి మించి మహిళగా ఆమెకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మరో మాట కూడా వినపడుతోంది. ప్రస్తుతం పురందేశ్వరి విశాఖ లోక్‍సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడైన టి. సుబ్బిరామిరెడ్డి ‘విశాఖ నాదే’ అని దండోరా వేసుకుంటున్నారు. ఈ విషయంలో ఉభయులకూ నడుమ మాటలయుద్ధం కూడా నడుస్తోంది. ఒకవేళ సుబ్బరామిరెడ్డి అధిష్టానాన్ని ఒప్పించి విశాఖ సీటు కొట్టేస్తే పురందేశ్వరి విజయవాడ ఎంచుకుంటారని అనుకుంటున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటికి మరోసారి పార్టీ సీటు దక్కదనీ, దక్కినా ఆయన గెలవలేడనీ వినిపిస్తున్న వాదనలు ఇందుకు ఒక కారణం కావచ్చు. లగడపాటికి పురందేశ్వరి బలమైన ప్రత్యామ్నాయంగా పార్టీకి కనిపించవచ్చు. కనుక ముందు చూపుతోనే విజయవాడలో ఆమె స్వామికార్యం స్వకారం అన్నట్టుగా హల్‍చల్ చేస్తున్నారా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి