2, అక్టోబర్ 2013, బుధవారం

సంపన్నుల కోసం సాగు భూమి మళ్లింపు

సంపన్నుల కోసం సాగు భూమి మళ్లింపు
Posted on: Sun 03 Oct 00:58:10.122407 201300
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా భూ విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కన్నా తక్కువ. ఆ ప్రభుత్వం విడుదల చేసిన 2007 నాటి భూ వినియోగ వివరాల ప్రకారం మొత్తం భూమి 226.39 కోట్ల ఎకరాలకు గాను రక్షణ, పారిశ్రామిక ప్రాంతంగా 2.29 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. రక్షణ ప్రాంతాలను మినహాయిస్తే పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కూడా ఉండదన్నమాట! అంత అభివృద్ధి చెందిన దేశంలోనే పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కూడా లేని స్థితిలో మనకు ఇప్పుడున్న ఒక శాతం కంటే ఇంకా ఎక్కువగా కావాలని విధాన పత్రం కోరడంలోనే తిరకాసుంది.

జాతీయ భూ వినియోగ విధాన ముసాయిదా లోగుట్టు!

భూసంస్కరణలపై ప్రజానుకూల సిఫార్సులను రాష్ట్రాలకు పంపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ భూ వినియోగ విధాన ముసాయిదాను రూపొందించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ వెబ్‌సైట్‌లో దాన్ని ప్రచురించారు. కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో సెప్టెంబరు 18,19 తేదీల్లో ఢిల్లీలో ఈ అంశంపై సమావేశం జరిపారు. త్వరలో రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశం జరిపి దానికి తుది రూపం ఇవ్వనున్నారు. పరిశ్రమలు, పట్టణీకరణ అవసరాల కోసం భూమిని మళ్లించడానికి ప్రాతిపదికను ఏర్పాటు చేయడమే ఈ విధాన సారాంశంలా గోచరిస్తోంది. విధాన పత్రంలో వ్యవసాయం, ఆహార భద్రత వంటి మాటలు అక్కడక్కడా ఉపయోగించారే తప్ప ప్రాధాన్యత మాత్రం లేదు. మన రాజ్యాంగం ప్రకారం భూ వినియోగం, అభివృద్ధి, మార్పిడులు వంటి అంశాలూ రాష్ట్ర పరిధిలోనివే. ఈ నేపథ్యంలో భూ వినియోగానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు తమ తమ ప్రాధాన్యతలను బట్టి వ్యవహరిస్తున్నాయి తప్ప దేశవ్యాప్తంగా ఒక విధానం అమలులో లేదు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడిదారులు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా పరిశ్రమలు, రియల్‌ఎస్టేట్‌ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలన్న లక్ష్యంతో యుపిఎ సర్కారు తాజా కసరత్తు జరుపుతోంది. మరో మాటగా చెప్పాలంటే భూ గరిష్ట పరిమితిని తగ్గించడం, నీటిపారుదల సౌకర్యాలు, ఉత్పాదకతవంటి అంశాల ప్రాతిపదికగా తిరిగి వర్గీకరించడంవంటి సానుకూల సిఫార్సులు చేసి ప్రజామోదం పొందాలని యత్నిస్తూనే దొడ్డిదారిన సంపన్నులకు భూమిని కట్టబెట్టాలన్న దుష్ట తలంపుతో ఈ విధాన పత్రాన్ని తెచ్చింది.
ఇదీ చరిత్ర
భూ వినియోగంపై నాలుగు దశాబ్దాలుగా వివిధ ప్రక్రియలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షునిగా రాష్ట్ర భూ వినియోగ బోర్డులను 70వ దశకంలోనే ఏర్పాటు చేశారు. కానీ అవి పనిచేయక ఆచరణలో వాటికవే రద్దయిపోయాయి. ఆ తరువాత 1988లో కేంద్ర వ్యవసాయశాఖ జాతీయ భూ వినియోగ విధానం మార్గదర్శకాలను రూపొందించింది. భూమి వినియోగాన్ని బట్టి ఆయా ప్రాంతాల్ని వర్గీకరిస్తూ అందుకు భిన్నమైన రీతిలో ఆ భూములను వినియోగించరాదని చెప్పిన మొట్టమొదటి పత్రంగా దాన్ని పేర్కొనవచ్చు. అయితే దానికీ ఆచరణలో కాలదోషం పట్టింది. అదలా ఉండగా ఇటీవల వివిధ రాష్ట్రాలు ఇలాంటి కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీహార్‌, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు భూ వినియోగ విధాన ముసాయిదాలను తయారు చేశాయి. తమిళనాడులో రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ పరిధిలో ప్రత్యేకంగా భూ వినియోగ విభాగం పనిచేస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ వినియోగ విధాన రూపురేఖలను తయారుచేసింది. అస్సాం, గుజరాత్‌, రాజస్తాన్‌ తదితర ఎనిమిది రాష్ట్రాలు ఈ విధాన ముసాయిదా రూపకల్పన పనిలో ఉన్నాయి.
ఆరు జోన్లుగా ప్రతిపాదన
దేశంలోని మొత్తం భూమిని దాని ఉపయోగాన్ని బట్టి ఆరు భూ వినియోగ జోన్లుగా (ల్యాండ్‌ యుటిలైజేషన్‌ జోన్లు- ఎల్‌యుజడ్‌) వర్గీకరించాలని విధాన పత్రం ప్రతిపాదన. 1) గ్రామీణ, వ్యవసాయ ప్రాంతాలు 2) మార్పు / పరిణామం చెందుతున్న ప్రాంతాలు 3) పట్టణ ప్రాంతాలు. 4) పారిశ్రామిక ప్రాంతాలు. 5) పర్యావరణ, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు. 6) అపాయకర పరిస్థితులున్న ప్రాంతాలుగా వర్గీకరించారు. గ్రామీణ, వ్యవసాయ ప్రాంతాలుగా వర్గీకరించిన దాంట్లో ఆహార భద్రత ప్రజల జీవనోపాధికి అవసరమైన వ్యవసాయ భూములుంటాయి. నీటి పారుదల సౌకర్యం గల, అధిక ఉత్పాదకత లభించే భూములతోపాటు గిరిజన ప్రాంతాలు, గ్రామీణాభివృద్ధి ప్రాంతాలు కూడా ఇందులోనే ఉన్నాయి. మార్పు/ పరిణామం చెందుతున్న ప్రాంతం అంటే వ్యవసాయం నుండి వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతున్న భూభాగం. మహానగరాల పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల శివార్లు మొదలైనవి. పారిశ్రామిక ప్రాంతాలుగా వర్గీకరించిన దాంట్లో పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, పిసిపిఐఆర్‌, ఎస్‌ఇజెడ్‌ మున్నగు వాటిని చేర్చారు. పర్యావరణ ప్రాంతంగా పేర్కొన్నదాంట్లో రిజర్వు ఫారెస్టులు, జాతీయ పార్కులు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు, కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌తోపాటు చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ప్రమాదకర పరిస్థితులున్న ప్రాంతం అంటే ప్రమాదకరమైన పరిశ్రమలు, ముఖ్యంగా రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు వంటి వాటికి అవకాశం ఉన్న ప్రాంతాలున్నాయి. అలాగే సునామీ, భూకంపం, వరదలు హైరిస్క్‌ గల ప్రాంతాలు కూడా ఇందులో చేర్చారు.
మరో ఉపవర్గీకరణ
ప్రతి ఎల్‌యుజడ్‌ను మరలా నాలుగేసి భూ వినియోగ యాజమాన్య ప్రాంతాలు (ల్యాండ్‌ యూజ్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాస్‌- ఎల్‌ఎంఎ)గా వర్గీకరించారు. అవి 1) రక్షిత ప్రాంతాలు. 2) నియంత్రిత ప్రాంతాలు. 3) రిజర్వ్‌డ్‌ ప్రాంతాలు. 4) గైడెడ్‌ అభివృద్ధి ప్రాంతాలు. రక్షిత ప్రాంతాలంటే అడవులు, జాతీయ పార్కులు, చారిత్రక ప్రదేశాలు వంటి చట్టపరమైన రక్షణ కలిగినవి. వీటి వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలులేదు. నియంత్రిత ప్రాంతాలంటే రక్షిత ప్రాంతాల మాదిరిగా చట్టపరమైన నిషేధాలు (రెస్ట్రిక్షన్స్‌) లేని ప్రాంతాలు. ఇందులోనే విలువైన వ్యవసాయ భూములు, జనావాసాలు, చట్టపరమైన నిషేధాలు లేని చారిత్రిక, పర్యాటక ప్రదేశాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతాల భూ వినియోగాన్ని కూడా మార్చకుండా ఉండడం మంచిదని చెప్పారు. తప్పనిసరిగా మార్చవలసి వస్తే కొన్ని నిబంధనలు నియంత్రణలకు లోబడి చేయాలని పేర్కొన్నారు. రిజర్వ్‌డ్‌ ప్రాంతాల్లో మానవ ఆవాసాల చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రధాన రోడ్లను ఆనుకొని ఉన్న ప్రాంతాలు చేర్చారు. ఇక్కడ భూ వినియోగాన్ని మార్చాలంటే కొన్ని నిబంధనలు, నియంత్రణలకు లోబడే చేయాలి. గైడెడ్‌ అభివృద్ధి ప్రాంతాలంటే ఇవి కాక మిగిలినవన్నీనూ.
దీర్ఘకాలిక దృష్టితో రానున్న 20-25 సంవత్సరాల అవసరాలకు తగినవిధంగా రూపొందించాలి. అయితే ఆయా జిల్లాలు, పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు ఐదేళ్లకు రూపొందిస్తే మంచిది. అన్ని స్థాయిల్లోనూ వార్షిక ప్రణాళికలను రూపొందించుకొని వాటిని సమీక్షిస్తూ ముందుకు పోవాలని విధానం నిర్దేశిస్తోంది.
అమలు యంత్రాంగం
ఈ విధాన అమలు ప్రక్రియకు రెండేళ్ల గడువు నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ప్రధాని అధ్యక్షునిగా రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లాస్థాయిలో ప్లానింగ్‌ కమిటీ ఛైర్మన్‌ (మన రాష్ట్రంలో అయితే జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి) అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ విధానాన్ని సమీక్షించడం అవసరమైన సవరణలు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర సమస్యలు, వివాదాలు తలెత్తితే పరిష్కరించడం జాతీయస్థాయి కమిటీ బాధ్యత. జాతీయ విధానానికి అనుగుణంగా రాష్ట్ర భూ వినియోగ విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలోగా రూపొందించాలి. అక్కడి నుంచి మరో సంవత్సరంలోపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు ఏయే భూ వినియోగ జోన్లులోకి వస్తాయో నిర్థారించి ప్రకటించాలి. ఆ తరువాత ఆయా జోన్లలో విధానాన్ని కచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర భూ వినియోగ విధాన అమలు సమీక్ష అందులో భాగంగా జిల్లాల మధ్య సమస్యలు, వివాదాలు తలెత్తితే పరిష్కరించడం రాష్ట్ర కమిటీ బాధ్యత. ఆచరణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించి ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి కమిటీ అమలు చేయవలసి ఉంటుంది.
నిజంగా అంత అవసరమా?
మన దేశ విస్తీర్ణంలో సాగు భూమి 46.1 శాతంకాగా 22.8 శాతం భూమిలో అడవులున్నాయి. పట్టణ ప్రాంతాలు 2.35 శాతంగానూ పారిశ్రామిక ప్రాంతం ఒక శాతంగా ఉంది. అయితే పెద్దఎత్తున పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, మౌలిక సౌకర్యాల విస్తరణ జరగనున్నందున మరింత భూమి కావలసి వస్తుందని ఈ పత్రం పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా భూ విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కన్నా తక్కువ. ఆ ప్రభుత్వం విడుదల చేసిన 2007 నాటి భూ వినియోగ వివరాల ప్రకారం మొత్తం భూమి 226.39 కోట్ల ఎకరాలకు గాను రక్షణ మరియు పారిశ్రామిక ప్రాంతంగా 2.29 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. రక్షణ ప్రాంతాలను మినహాయిస్తే పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కూడా ఉండదన్నమాట! అంత అభివృద్ధి చెందిన దేశంలోనే పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కూడా లేని స్థితిలో మనకు ఇప్పుడున్న ఒక శాతం కంటే ఇంకా ఎక్కువగా కావాలని విధాన పత్రం కోరడంలోనే తిరకాసుంది. పారిశ్రామిక ప్రాంతాల పేరిట విస్తార భూ ఖండాలను పెట్టుబడిదారులు ఇప్పటికే చేజిక్కించుకున్నారు. ఎస్‌ఇజడ్‌ల మోసం జగద్విదితమే. అయినా ఇంకా పరిశ్రమలకు మరింత భూమి కావాలని ప్రభుత్వం చెబుతోందంటే పారిశ్రామికవేత్తలకు సాగు భూములను కట్టబెట్టాలన్న తహతహ బోధపడుతుంది. నిజానికి ఆధునీకరణ యాంత్రీకరణలతో తక్కువ స్థలంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలను నిర్మిస్తున్నారు. అయినా ఏదో ఒక పేరుతో భూమిని కొల్లగొట్టాలనే ఈ యావ. వాటిని తర్వాత రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు మళ్లించడమూ మన అనుభవమే!
లోగుట్టేమిటి?
ఈ విధాన ముసాయిదా పీఠికలో లక్ష్యాలను వివరించారు. అందులో 'న్యాయబద్ధ భూ వినియోగం' అన్న విభాగంలో 'పారిశ్రామికీకరణ, పట్టణీకరణకు భూమిని ఇవ్వవలసిన అవసరముంది. అత్యవసర మౌలిక వసతుల కోసం కొంత భూమినివ్వాలి. అదే సమయంలో పర్యావరణ సంబంధిత ప్రాంతాలను రక్షించుకోవాలి. దేశ ఆహార భద్రతకు రైతుల అవసరాలను తీర్చడానికి వ్యవసాయ భూములను కూడా రక్షించుకోవాల్సి ఉంది.' అని పేర్కొన్నారు. అంటే ఈ విధాన లక్ష్యాల్లో పారిశ్రామికీకరణ, పట్టణీకరణకు పెద్దపీట వేశారని వ్యవసాయం తుది ప్రాధాన్యతేనని తేటతెల్లమవుతోంది. అలాగే ఆ విభాగంలోనే మరోచోట 'భవిష్యత్తు అవసరాల కోసం అటవీ భూములను, వ్యవసాయ భూములను ఉపయోగించవలసి రావచ్చు' అని పేర్కొన్నారు. అంటే అటవీ భూములను సైతం ఇతర అవసరాలకు మళ్లించాలన్న దుర్బుద్ధి దాగి ఉందన్నమాట. ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం అటవీ భూములను ఇతరత్రా వినియోగించాలంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి పొందవలసి ఉంది. అదేవిధంగా పట్టణ అవసరాలు అన్న భాగంలో 'నగరాల్లో విస్తారమైన భూములు వివిధ సంస్థల ఆధీనంలో ఖాళీగా పడి ఉన్నాయి. పట్టణీకరణ అవసరాలకు వాటిని వినియోగించడానికి అవసరమైన పద్ధతులను రూపొందించాలని' చెప్పారు. అంటే నగరాల్లో ఆయా కార్పొరేషన్లకు, వివిధ ప్రభుత్వ సంస్థలకు ఉన్న భూములను పిపిపి లాంటి ముద్దు పేర్లతో ప్రయివేటు వారికి మళ్లించాలన్న కుట్ర దాగివుందన్నమాట.
ఇంత ముఖ్యమైన విధానాన్ని రూపొందించే క్రమంలో వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగానూ గోప్యంగానూ ఈ విధానాన్ని ముందుకు నెడుతోంది.
బి తులసీదాస్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి