1, అక్టోబర్ 2013, మంగళవారం

సవాల్ చేసి చెబుతున్నా..నీటి యుద్ధాలు వట్టి మాట


-సీమాంధ్రకు నీళ్లు రావన్నది అవాస్తవం
-ఎవరి నీళ్లు వాళ్లకున్నయ్
-ట్రిబ్యునల్ ఎప్పుడో పంచింది
-కొత్తగా వచ్చేవి లేవు, పోయేవీ లేవు
-భారీ నీటి పారుదల మంత్రి పీ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1(టీ మీడియా):‘‘సవాల్ చేసి చెబుతున్నా...! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే సీమాంధ్రకు నీళ్లు రావనేది పూర్తిగా అవాస్తవం. నీటి యుద్ధాలు జరుగుతాయనేది ఏ మాత్రం నిజం కాదు. ఇప్పటికే ఏ ప్రాంతానికా ప్రాంతం, ఏ ప్రాజెక్టుకాప్రాజెక్టు నదీ జలాల నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రం కలిసున్నా..mantri
లేకున్నా ఈ కేటాయింపులు మారబోవు’’ అని రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటిపారుదల మంత్రి పీ సుదర్శన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని, సీమాంధ్ర ఎడారిగా మారుతుందని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రినుంచి చోటా మోటా నాయకుల దాకా ప్రచారాన్ని తీవ్రం చేసి భీతావహం సృష్టించిన నేపథ్యంలో నీటిపారుదల బాధ్యుడిగా ఆయన మీడియా ముందుకు వచ్చి వాస్తవ పరిస్థితి వెల్లడించారు. మిగులు జలాల మీద ప్రాజెక్టులు మూడు ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు పూర్తి స్థాయి అభయహస్తం అందించారు. రాష్ట్ర విభజనలో అనేక చిక్కుముళ్లు ఉన్నాయని, సమస్యలు పరిష్కరించకపోతే ఇరు ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేత విజయమ్మ ఇతర సీమాంధ్ర నేతలు తీవ్రస్థాయి దుష్ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి వివరణ రావడం గమనార్హం. మంత్రి ఏమన్నారంటే...

సీమాంధ్రకు నీళ్లు రావన్నది అబద్ధం..
విభజన జరిగితే నీటి సమస్యలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారు. నీటి పంపకాల విషయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా నీటి కేటాయింపులు, పంపకాలపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నా. ముందుగా కృష్ణా బేసిన్ విషయానికి వస్తే బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నికర జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిలో ఇప్పటికే ప్రాజెక్టులవారీగా కేటాయింపులు పూర్తయ్యాయి. ఇందులో ఆంధ్రకు 367.34 టీఎంసీలు, రాయలసీమకు 144.70 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కాయి. ఇందులో నాగార్జున సాగర్‌కు 174.30 టీఎంసీలు, పులిచింతలకు 9, కృష్ణా డెల్టాకు 152.20, శ్రీశైలంకు(ఆవిరి నష్టాలు) 11, తుంగభద్ర కుడిగట్టు ఎల్లెల్సీకి 29.50, తుంగభద్ర కుడిగట్టు హెచ్‌ఎల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 31.90, శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)కి 19 టీఎంసీలు కేటాయించారు. ఈ మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో వినియోగం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు నీళ్లు రావన్నది అవాస్తవం. రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా ఈ కేటాయింపుల ప్రకారమే నీటి విడుదల జరుగుతుంది. వీటిని తగ్గించడానికి ఎవరికీ హక్కులు లేవు. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చడానికి వీల్లేదు.

అథారిటీ నిర్ణయం మేరకే వరద జలాల కేటాయింపు..
ఇక, కృష్ణా నదిలో మిగులు(వరద) జలాలపై ఆధారపడి 224 టీఎంసీల సామర్థ్యంతో మూడు ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, సీమాంధ్రలో గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులున్నాయి. గత 30 ఏళ్ల లెక్కలను చూస్తే ఏటా కృష్ణాలో 250 టీఎంసీల నుంచి 1450 టీఎంసీల దాకా వరద ఉంది. సగటున 550 టీఎంసీల దాకా వరద వస్తోంది. కనీసం 250 టీఎంసీల వరద జలాలు వచ్చినా ఇప్పడు చేపట్టిన ప్రాజెక్టులకు సరిపోతుంది. ప్రతి అయిదేళ్లలో మూడేళ్లు వరద వస్తోంది. ఈ ఏడాది వచ్చిన వరద జలాల్లో ఇప్పటికే 55 టీఎంసీలను రాయలసీమకు విడుదల చేశాం. వరద వచ్చినపుడు వినియోగించుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టులను చేపట్టిన సంగతిని గుర్తుంచుకోవాలి. కంట్రోల్ అథారిటీ ఏర్పాటయ్యాక ఏ ప్రాజెక్టుకు ఎంత వరద నీటిని కేటాయించాలనే విషయాన్ని అదే చూసుకుంటుంది.

గోదావరిలో నికర జలాలే వాడడం లేదు..
గోదావరి బేసిన్ విషయానికి వస్తే బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి 1,486.156 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. ఇందులో ఇంకా 700 టీఎంసీలను వాడడమే లేదు. ప్రస్తుతం ఆంధ్ర 255.974 టీఎంసీలు, తెలంగాణ 435.004 టీఎంసీలను వాడుకుంటున్నాయి. ఆంధ్రాలో మరో 253.470 టీఎంసీలు, తెలంగాణలో 406.848 టీఎంసీలు వినియోగించుకునే ప్రాజెక్టులు- ప్రాణహిత-చే మిడ్‌మానేర్, కంతనపల్లి, పోలవరం ఉన్నాయి. ఈ నికర జలాలకు తోడు ఏటా సగటున 2,500 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.

పోలవరంపై ఆందోళనలు అక్కర్లేదు..
తెలంగాణ ఏర్పాటైతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు రావంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా పోలవరం ఆయకట్టుకు ఇబ్బంది ఉండదు. ఏటా గోదావరి నుంచి 2,500 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. గోదావరి ఉప నది సీలేరుపై నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కోసం రోజూ 4వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. గత 30 ఏళ్ల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే డిసెంబర్-మార్చి మధ్యలో పోలవరం ఎగువన 70-80 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ సామర్థ్యం 100 టీఎంసీలు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ నీటిని వాడుకునే వీల్లేదు. కానీ, పోలవరంలో డెడ్ స్టోరేజీని కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. మార్చి నాటికి రబీ సీజన్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సవాల్ చేసి చెబుతున్నా. కృష్ణా డెల్టా ఆయకట్టు కోసం పులిచింతల ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును చేపట్టే అంశం నా పరిధిలో లేదు.

నీటి యుద్ధాలు రావు..
రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి నీటి యుద్ధాలు రావు. ఈ విషయంలో ఎవరేమన్నా నాకు సంబంధం లేదు. మంత్రిగా నూరు శాతం వాస్తవాలు చెబుతున్నా. నీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాగం, సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడా ఇబ్బందులు రావు. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర డ్యాం 1953లోనే పూర్తయింది. ఈ డ్యాం ద్వారా 132 టీఎంసీల నీటిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 93 టీఎంసీల నీటిని రాయలసీమ వాడుకుంటోంది. నీటి పంపకాల పర్యవేక్షణకు 1953లోనే తుంగభద్ర బోర్డు ఏర్పాటైంది. గత 60 ఏళ్లుగా ఇబ్బందుల్లేకుండా నీటి పంపకాలు జరుగుతున్నాయి. ఈ బోర్డు నూటికి నూరు శాతం విజయవంతమైంది.

తెలంగాణకు ఎత్తిపోతలే శరణ్యం
తెలంగాణకు నీటి లభ్యత ఉన్నా దాన్ని వినియోగించుకోవాలంటే ఎత్తిపోతలే శరణ్యం. అందుకే కృష్ణా, గోదావరిలపై పలు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాం. ప్రాణహిత-చే ప్రాజెక్టులో పెద్దగా రిజర్వాయిర్ల నిర్మాణం చేపట్టలేదు. అయితే, కొత్తగా రిజర్వాయిర్లు నిర్మించాలని అధికారులను ఆదేశించాం. దేవాదుల ప్రాజెక్టుకు నీటి లభ్యత సమస్య రాకుండా కంతనపల్లిని చేపట్టాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి