17, అక్టోబర్ 2013, గురువారం

ఆర్టికల్ 371(డి) విభజనకు అడ్డంకా?


Sakshi | Updated: October 18, 2013 01:57 (IST)
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) రాష్ట్ర విభజనకు అడ్డంకని ‘సమైక్య’ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఆర్టికల్ 371(డి)ని సవరిస్తేనేగానీ రాష్ట్ర విభజనకు వీలు కాదన్నది నిపుణుల అభిప్రాయం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు.. తెలంగాణ హక్కుల పరిరక్షణకు ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి వాటికి రాజ్యాంగ రక్షణ లేకపోవడంతో..  విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో 371(డి) అధికరణను చేర్చారు. రాజ్యాంగంలోని 371 (డి) అధికరణను అనుసరించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు జోన్లు ఉన్నాయి. ఈ అధికరణ కింద 85 శాతం ఉద్యోగాలను ఆయా జోన్లలోని స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది.

371(డి)లోని  1, 3, 9 సెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంది. రాష్ట్రాన్ని విభజించడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 3 లేదా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఆర్టికల్ 2, 4 ప్రకారం.. ఆర్టికల్ 371(డి)ని సవరించడం వీలు కాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కొందరు మాత్రం ఇది సాధ్యమేనంటున్నారు. 371(డి)లో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా, రాష్ట్ర విభజన సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి