2, అక్టోబర్ 2013, బుధవారం

రోగం ముదిరింది!


అమెరికాలో సాగుతున్న షట్‌డౌన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలన వార్త! రెండు రాజకీయ పక్షాలు ఏకాభివూపాయం లేక బడ్జెట్ ఆగిపోవడం, పరిపాలన స్తంభించి పోవడం వంటి సమస్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలోని తప్పనిసరి తద్దినంగా భావించి గర్వపడే వారూ ఉండే ఉంటారు! కానీ ఇటువంటి షట్ డౌన్‌ల మాయాజాలంతో, రెండు పార్టీల విభేదాలతో అమెరికా ప్రజానీకం ఎదుర్కొంటున్న అసలు సమస్య అడుగున పడిపోతున్నది. పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన కనీస బాధ్యతను అమెరికా ప్రభుత్వం ఎందుకు స్వీకరించడం లేదనే ప్రశ్న చర్చనీయాంశం కాకుండా మీడియా జాగ్రత్త పడుతున్నది. ఒబామాకేర్ అనే ఆరోగ్య పథకాన్ని ప్రతిపక్షం అనవసరంగా వ్యతిరేకిస్తున్నదనేది డెమొక్షికాటిక్ పార్టీ మద్దతుదారుల ఆరోపణ. ఏ రంగంలోనైనా ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే నీతిని రిపబ్లికన్ పార్టీ వల్లిస్తున్నది. నిజానికి పేద ప్రజల వైద్య వ్యయాన్ని ప్రభుత్వం భరించకూడదనే విషయంలో అమెరికాలోని రెండు పార్టీలకు ఏకాభివూపాయం ఉన్నది. అదే చట్రంలో ప్రభుత్వం అనుసరించవలసిన విధానాలపై గొడవ పడుతున్నాయి.

పారిక్షిశామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలతో పోలిస్తే అమెరికాలో వైద్య చికిత్స కోసం చాలా ఎక్కువ డబ్బు పారబోయాల్సి వస్తున్నదని 2003లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. అనేక ఇతర రంగాలలో మాదిరిగానే వైద్య రంగంలో ప్రభుత్వ నియంవూతణ ఉండకూడదనే సూత్రాన్ని అమెరికా విధానకర్తలు ప్రచారం సాగిస్తూ ఆచరిస్తుండడం వల్ల ఈ సమస్య వచ్చి పడింది. భారీ రోగ నిర్ధారణ యంత్రాలు, భవనాలు, వైద్యుల పేర పెట్టుబడి పెరిగి అది లాభాలను రాబట్టుకునే క్రమంలో రోగులను పీల్చి పిప్పిచేస్తున్నది. ఔషధం సరే, నిర్వహణ వ్యయం ఎక్కువైంది.

మానవ సేవ లక్ష్యంగా ఉండాల్సిన వైద్య రంగాన్ని అమెరికా విధానకర్తలు కుట్రపూరితంగా వ్యాపారమయం చేయడం వల్ల ఏర్పడిన దుస్థితి ఇది. ఇప్పుడు ఒబామా ఈ వైద్య రంగాన్ని మళ్ళీ ప్రజాసేవగా మార్చడానికి యత్నించడం లేదు. ఇప్పటికీ అనేక మంది పేదలు వైద్య బీమా పథకానికి బయట ఉన్నారు. వీరి వైద్యం బాధ్యత ప్రభుత్వంపై పడుతున్నది. 2020 వరకు క్రమపద్ధతిలో ప్రభుత్వానికి భారంగా ఉన్న ఈ పేద రోగులను ప్రైవేటు బీమా పరిధిలోకి తేవాలనేదే ఒబామా వ్యూహం. దీని వల్ల వచ్చే పదేళ్ళలో ఏడు వందల బిలియన్ డాలర్ల మేర పేదలకు వైద్యం సదుపాయం తగ్గుతుంది. ఐదు కోట్ల మంది పేద వృద్ధులు, వికలాంగులు వైద్య సేవకు దూరమవుతారని అంచనా. వృద్ధులు, రోగక్షిగస్తులు అనే అభ్యంతరాలు లేకుండా అందరికీ బీమా పథకం అమలు చేయడం ఇప్పటికప్పుడు గొప్పగానే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వీరిని బీమా కంపెనీల చేతిలో పెట్టి వదిలించుకుంటున్నదనేది వాస్తవం.

ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలు వైద్యసేవలను వదలించుకున్నాయి. కార్మికులకు వైద్యబీమా యాజమానుల బాధ్యత అని ప్రభుత్వం అంటున్నది. కానీ అందులో లొసుగులు పెట్టి అనేక కంపెనీలు తప్పించుకునే వీలు కల్పించింది. ప్రభుత్వ వైద్య సేవలేక, బీమా లేక కొట్టుమిట్టాడే పేదల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నది. వృద్ధుల వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించడాన్ని సాకుగా చూపి ఇన్స్యూన్స్ కంపెనీలు మిగతా పథకాల్లో ప్రీమియంను పెంచడం ఇప్పటికే ప్రారంభించాయి. ప్రభుత్వం పైకి కనిపిస్తున్న మేర వీటిని నియంవూతించడం లేదు. ఒబామా కేర్ వల్ల బీమా కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ సేవలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం వైద్య సేవా పథకాలను అమలు పరుద్దామన్నా న్యాయస్థానాలు అందుకు అంగీకరించని స్థాయిలో అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరపడిపోయింది. ఆర్థిక సంక్షోభం పేరుతో లక్షల కోట్ల డాలర్ల బెయిలవుట్లు ప్రకటించిన ఒబామా ప్రభుత్వం పేద రోగుల వైద్య బాధ్యతను మాత్రం క్రమంగా వదిలించుకుంటున్నది.
నల్లజాతీయుడు అయినందు వల్ల కావచ్చు, ఒబామా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

అమెరికాలో ఏదో మార్పు తెస్తాడనే ఆశ వెల్లివిరిసింది. రైటిస్ట్, కార్పొరేట్, శ్వేత జాతి కులీన వర్గం మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకున్న రిపబ్లికన్ పార్టీ నాయకుడు బుష్ అనుసరించిన సామాజిక అణచివేత విధానాల నుంచి, ఒబామా వచ్చిన తరువాత ప్రజలకు కొంత ఊరట కలిగిన మాట నిజం. ఒబామా పెట్టుబడిదారీ విధానం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను కొంత వెనకకు మళ్ళిస్తాడనే భ్రమలు కొందరిలో కనిపించాయి. కానీ సంక్షుభిత ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే పేరుతో ఒబామా పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత సుస్థిరపరచే ప్రయత్నమే చేసిండు. అంతరంగిక విధానాల్లోనే కాదు, విదేశీ వ్యవహారాలలోనూ ఒబామా ఒక ముసుగు మనిషేనని తెలిసిపోయింది. అమెరికా యుద్ధోన్మాదం ఒబామా వచ్చిన తరువాత ఏ మాత్రం తగ్గలేదు. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంటా బయటా విశ్వసనీయత కోల్పోతున్న దశలో ఒబామాను వ్యూహం ప్రకారం ముందుకు తెచ్చింది. ఒబామా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి వచ్చి హఠాత్తుగా వ్యవస్థను మార్చడం సాధ్యమయ్యే పని కూడా కాదు. ఆక్యుపై వాల్ స్ట్రీట్ వంటి ఉద్యమాలు కొంత కలకలం కలిగిస్తాయి. కానీ నిర్మాణాత్మక పోరాటాల వస్తే తప్ప అమెరికా సమాజంలో మౌలిక మార్పుకు ఆస్కారం లేదు. షట్‌డౌన్ నాటకాలు సాగుతూనే ఉంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి