4, అక్టోబర్ 2013, శుక్రవారం

లాలూకు ఐదేళ్లు జైలు


-రూ. 25 లక్షల జరిమానా...దాణా స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు
-మాజీ సీఎం మిశ్రా, జేడీయూ ఎంపీ శర్మలకు నాలుగేళ్ల శిక్ష

రాంచీ, అక్టోబర్ 3: మూగజీవాల నోటికాడి కూడును లాగేసిన ఫలితం! అధికారాన్ని అడ్డుపెట్టుకొని గడ్డి తిన్నందుకు తగినమూల్యం! ఇటు బీహార్‌లో, అటు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కటకటాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో ఆయనకు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది.
laluuరూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ శిక్షతో లాలూ రాజకీయ భవిష్యత్తు దాదాపుగా ముగిసినట్టే. ఎంపీగా అనర్హతకు గురవడమే కాకుండా.. ఆయన దాదాపు 11 ఏళ్లపాటు ఎన్నికలకు దూరం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీకి ఈ తీర్పు అశనిపాతంగా మారింది. దాణా స్కాంలో దోషిగా తేలిన మరో నేత, బీహార్ మాజీ సీఎం జగన్నాథమిశ్రాకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఆర్జేడీ సిట్టింగ్ ఎంపీ జగదీశ్ శర్మకు నాలుగేళ్ల శిక్ష విధించింది. దీంతో ఆయన కూడా ఎంపీగా అనర్హుడయ్యారు. ప్రస్తుతం రాంచీ శివార్లలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్న లాలూ, మిశ్రా, శర్మలకు వీడియో కాన్ఫన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవాస్‌కుమార్ సింగ్ గురువారం శిక్షలు ప్రకటించారు. ‘ఇలాంటి రాజకీయ నాయకులు రాజ్యాంగంపై తాము చేసిన ప్రమాణాన్ని, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని మరచిపోతున్నారు. ప్రజాధనాన్ని దోచుకోడానికి ఉన్నతస్థాయి అధికారులు ,రాజకీయ నాయకులతో కుమ్మకై అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకొవడమే రహస్య ఎజెండాగా వ్యవహరించారు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను అమాయకుడినని లాలూ న్యాయమూర్తిని వేడుకున్నారు.

మొత్తంగా రూ. 950 కోట్ల విలువైన కుంభకోణంలో 45 మందిని దోషులుగా ప్రకటిస్తూ రాంచీలోని సీబీఐ కోర్టు గత నెల 30న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన ఆరుగురు రాజకీయనేతలు, నలుగురు ఐఏఎస్ అధికారులకు కూడా కోర్టు శిక్షలు ఖరారుచేసింది. దోషులు జరిమానా చెల్లించలేనిపక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. 1990లో అవిభజిత బీహార్‌లో లాలూ హయాంలో చాయ్‌బాసా కోశాగారం నుంచి పశువుల దాణాకు సంబంధించిన బడ్జెట్ నుంచి రూ. 37.7 కోట్లు అక్రమం గా వసులు చేసిన కేసులో నిందితులపై అభియోగాలురుజువయ్యాయి. జార్ఖండ్ ఏర్పాటు తర్వాత ఈ కేసు రాంచీ జిల్లా పరిధిలోకి వచ్చింది. మొత్తం 45మంది దోషులలో ఎనిమిది దోషులుకు తీర్పు ప్రకటించిననాడే కోర్టు శిక్షలు ఖరారుచేసింది. దోషులకు కనీసం ఏడేళ్ల శిక్ష విధించాలని సీబీఐ కోర్టును కోరింది. మిశ్రా, శర్మ, దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే ఆర్కే రాణా న్యాయవాదులు తమ క్లైంట్లకు తక్కువ శిక్ష విధించాలని కోరారు. మాజీ ఐఏఎస్‌లు పూల్‌చంద్‌సింగ్, మహేశ్‌ప్రసాద్, బెక్ జెల్యుస్, అధీప్ చంద్రచౌదరి, బీహార్ పశుసంవర్థకశాఖ మాజీ అధికారులు గౌరీశంకర్‌ప్రసాద్, ప్రజ్ఞానందన్ శర్మ, ప్రసాద్ దోషులుగా తేలారు.

లూలూను ఊరిస్తున్న చిన్ని ఆశ!
క్రిమినల్ కేసుల్లో మూడేళ్ల కంటే ఎక్కువ శిక్షపడ్డ ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు సంచనల తీర్పు నేపథ్యంలో మరో మూడురోజుల్లో లాలూపై అనర్హత వేటు పడనుంది. దీనికితోడు ఐదేళ్ల శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో లాలూను ఒకే ఒక ఆశ వెంటాడుతోంది. శిక్షపడ్డప్పటికీ ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు ఒక మార్గం ఉంది. దిగువకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించినపక్షంలో.. సదరు కళంకిత నేత ఎన్నికల్లో పోటీచేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కాగా, తమ పార్టీ అధినేత లాలూకు పడిన శిక్షను ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. తీర్పు పాఠాన్ని పూర్తిగా చదివిన తర్వాత తదుపరి లీగల్‌చర్య తీసుకుంటామని లాలూ తనయుడు తేజస్వి చెప్పారు.

సార్.. నేను అమాయకుడిని!
‘సార్, నేను అమాయకుడిని’.. ఇది న్యాయమూర్తికి దీనంగా లాలూ చేసిన విజ్ఞప్తి! ‘నేను ఎలాంటి నేరానికి పాల్పడలేదు. నాకెందుకు శిక్ష విధిస్తారు’ అని ఆయన న్యాయమూర్తిని అడిగినట్టు తెలిసింది.‘నేను రెండుసార్లు బీహార్‌కు సీఎంగా పనిచేశాను. కేంద్ర రైల్వేమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. నాకు తక్కువ శిక్ష విధించేలా చూడండి’ అని వీడియో కాన్ఫన్స్ ద్వారా లాలూ అభ్యర్థించినట్టు సమాచారం.

సింహసనం నుంచి చెరసాలకు..
‘‘అవును... మావాళ్లు లేటయ్యారు. అయితే ఏంటి.. ఏం ఫర్లేదు. బ్రహ్మండంగా పనిచేస్తారు’’ ఢిల్లీలో రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యోగులు డ్యూటీలకు ఆలస్యంగా వస్తున్నారంటూ, ఆ కార్యాలయం ముందు ఓ టీవీ లైవ్ టెలికాస్ట్ పెట్టిన వేళ.... కారు దిగిన మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మైకు ముందు పెట్టిన విలేకరికి తాపీగా పాన్ నములుతూ తాపీగా చెప్పిన మాట ఇది. కంగుతిన్న విలేకరి సర్దుకుని ఇది శాఖ పనితీరు మీద ప్రభావం చూపదా? అని ప్రశ్నించినపుడు ‘‘అస్సలుండదు.. చూస్తారు కదా!’’ అని బదులిచ్చిన లాలూ... ఆ లేట్ కమర్స్‌తోనే అదే ఏడాదిలో రైల్వే చరిత్రలో మొదటిసారి లాభాలు సాధించి చూపించారు. ఇది లాలూ సమర్థత. 1946లో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన లాలూ బీహార్ రాష్ట్రాన్ని రాజులాగే ఏలారు. 1973 ప్రాంతంలో జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవకాలంలో విద్యార్థి నాయకుడి హోదాలో ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకున్న లాలూ ఎమ్జన్సీ అనంతరం 1977లో ఇందిర వ్యతిరేక ప్రభంజనంలో 29 ఏళ్ల వయసులో అలవోకగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత కేవలం 13 ఏళ్ల కాలంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై 1990లో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో కేంద్రమంత్రిగా ప్రమాణం చేసి అత్యంత కీలకశాఖగా భావించే రైల్వే మంత్రి పదవి చేపట్టారు.

1990లో రథయాత్రకు బీహార్‌లో బ్రేకులేసి అద్వానీని అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. మిత్రుడు ములాయం అద్వానీని అరెస్టు చేస్తానని తొడలు కొట్టి సవాలు చేస్తున్న వేళ, చెప్పా పెట్టకుండాహఠాత్తుగా అద్వానీని అరెస్టు చేసి ములాయంకూ షాక్ ఇచ్చారు. ఈ చర్య ఆయనకు అనేక మంది అభిమానులను సృష్టించింది. పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇస్లామాబాద్ మార్కెట్‌కు వెళ్లినపుడు అత్యంత సామాన్యులు కూడా ఆయనతో కరచాలనాలకు, ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. ఒక భారతీయ నాయకుడికి పాకిస్థాన్‌లో ఆ స్థాయి ఆదరణ దక్కడం అరుదు. ఇక నష్టజాతక రైల్వేశాఖ గతిని మార్చి లాభాల కూత వేయించిన లాలూ హార్వర్డ్ లాంటి వర్సీటీలో మేనేజ్‌మెంట్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. బ్రాహ్మణులు, ఠాకూర్‌ల కంచుకోట అయిన బీహార్‌లో ఆయన చేసిసన సామాజిక సమీకరణ ఆ రాష్ట్ర రాజకీయ ముఖచివూతాన్నే మార్చివేసింది.ఆయన హావభావాలు, వేషధారణ, పల్లెటూరి బీహారీ యాస ఆయనకో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. బీహారీలకు దేశవ్యాప్త గౌరవం తెచ్చారాయన. ముఖ్యమంత్రి నివాసంలో గేదెలు పెంచడం..వాటి ఆలనా పాలనా తానే చూడడం పాలు పితకడం అన్నీ సంచలనాలే.. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటాడనే సామెత వినిపించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీహార్‌లో లాలూ రాచరిక పాలనే నడిపించారు. బావమరుదులు, బంధువులు, స్నేహితులు, అందరినీ పదవుల్లో, ఉద్యోగాల్లో కుక్కేశారు. పాలనను దర్బారుగా మార్చేశారు. ఇంట్లో పశువుల శాలలో పనులు చేసుకుంటూ ఐఏఎస్‌లకు ఆదేశాలిచ్చారు. యాదవ సామ్రాజ్యాన్ని ఆవిష్కరించి తిరుగులేని ఓటుబ్యాంకును ఏర్పరుచుకున్నారు. గడ్డి కుంభకోణంలో తాను అరెస్టయినప్పుడు పెద్ద చదువుసంధ్యలు లేని తన భార్యను సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. అనంతర కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో వెనుకంజ వేసినా కేంద్రంలో మాత్రం చక్రం తిప్పుతూనే వచ్చారు. తాజాగా సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న గడ్డికుంభకోణంలో ఆయనకు సీబీఐ కోర్టు ఐదేళ్ల కారాగారం విధించింది. రాజకీయంగా గ్రహణ కాలంలో ఇలా జరగడం లాలూకు ఇబ్బందే. దీనికి తోడు నేరచరితులపై సుప్రీంతీర్పు అనుసారం ఉన్న ఎంపీ పదవి పోయింది. మరో ఆరేళ్లు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. పార్టీకి ప్రజల్లో నాటి ఆదరణ లేదు. ఈ పరిస్థితిలో ఐదేళ్లు జైలులో ఉండి పార్టీని కాపాడడం కష్టమే. ఏదేమైనా నితీష్ ఉత్థానంతో మొదలైన లాలూ పతనం ఇప్పడప్పుడే నిలిచిపోయే అవకాశం కనిపించడం లేదు.

చట్టం నుంచి తప్పించుకోలేరు!
శిక్షను స్వాగతించిన బీజేపీ, జేడీయూ

ఆర్జేడీ అధినేత లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడటాన్ని బీజేపీ, జేడీయూ నేతలు స్వాగతించారు. అవినీతిపరులు ఎంతటి పెద్దవ్యక్తులైనా.. చట్టం నుంచి తప్పించుకోలేరనే సందేశాన్ని ఈ ఉదంతం స్పష్టంచేస్తున్నదని పేర్కొన్నారు. బీహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథమిశ్రాకు కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం.. అవినీతి నిరోధానికి ఉపయోగపడుతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘లాలూ, మిశ్రాలకు కోర్టు శిక్ష ఊహించినదే. ఈ కేసులో న్యాయం ఆలస్యంగా వచ్చినా.. నిరాకరణకు గురికాలేదు. ఈ కేసులో తీర్పు, శిక్షలు.. రాజకీయ నాయకులు భవిష్యత్తులో అవినీతికి పాల్పడకుండా నిరోధించవచ్చు’ అని ఆయన కోల్‌కతాలో విలేకరులతో పేర్కొన్నారు. దేశ చరివూతలోనే దాణా కుంభకోణం అతిపెద్దదని, ఈ దోషులకు శిక్షపడట్టం గట్టి గుణపా బీజేపీ నేత రవిశంకరప్రసాద్ పేర్కొన్నారు. న్యాయస్థానాలపై ప్రజావిశ్వాసాన్ని పెంపొందించేవిధంగా దాణాస్కాంలో తీర్పు వెలువడిందని జేడీయూ ఎంపీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

జగన్నాథ్ మిశ్రాకు అనారోగ్యం!
ఇప్పటికే రాజకీయాల నుంచి వైదొలిగిన బీహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రా(76) రాంచీలోని రాజేంద్రప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చికిత్స పొందుతున్నారు. దాణాస్కాంలో దోషిగా తేలిన ఆయన గత మంగళవారం అకస్మాత్తుగా అనారోగ్యం పేరిట బిర్సాముండా జైలు నుంచి ఆస్పత్రిలో చేరడం.. తక్కువ శిక్ష ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే కావచ్చునని ఊహాగానాలు వినిపించాయి.

లాలూ హీరో: రబ్రీదేవి
‘లాలూప్రసాద్ యాదవ్ హీరో. భవిష్యత్తులోనూ ఆయన హీరోగా ఉంటారు’ అని లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పేర్కొన్నారు. రాజకీయ కుట్రకు తన భర్త బలయ్యారని రబ్రీదేవి ఆవేదన చెందుతున్నారని పార్టీ నేతలు విలేకరులకు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి