18, అక్టోబర్ 2013, శుక్రవారం

స్వరం మారుతున్నది....


సీమాంధ్ర కేంద్ర మంత్రులు..
రాష్ట్రవిభజన అంశం కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులకు పెనుగండంగా మారింది. నియోజకవర్గాలకు వెళితే రాజీనామాల గురించి నిలదీయడం సర్వసాధారణమైపోయింది. మీడియా కూడా ఎక్కడ కనపడినా రాజీనామా చేశారా అనో ఆమోదించుకున్నారా అని అడగడమూ అంతే సాధారణమైపోయింది. అయితే  కొందరు మంత్రులు స్వరం మారుస్తున్నారు. రాజీనామాల గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. జరగాల్సింది అంతా జరిగిపోయాక రాజీనామాలు ఎందుకంటున్నారు. తాజాగా కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. కేబినెట్ నోట్ ఆమోదంతో తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. రాజీనామా చేయలేదని ఆమె వెల్లడించారు. అంతేకాదు నా రాజీనామాతో ఆగుతుందంటే తప్పకుండా ఆ పని చేస్తానని కూడా ఆమె అన్నారు. మరో సీమాంధ్ర కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఒకడుగు ముందుకు వేసి సీమాంధ్రకు ఏమేం ప్యాకేజీ కావాలో అడగడం మంచిదన్నారు. నిజానికి లక్ష్మి ఇదివరకే రాష్ట్ర విభజన విషయంలో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే తప్పేమిటని కూడా తనను అడ్డగించిన కార్యకర్తలతో ఆమె అన్నారు. వ్యక్తిగతంగా రాష్ట్ర సమైక్యతను కోరుకుంటానని అంటూనే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక కేబినెట్ నిర్ణయంతో బాధకు గురయ్యామని మాట్లాడిన మరో మంత్రి పురంధేశ్వరి కూడా ఇప్పుడు విభజన అడ్డుకునేందుకు ప్రయత్నించడం కన్నా మంచి ప్యాకేజీ డిమాండు చేయడం మంచిదని సూచించారు. ఈ ముగ్గురు మహిళామంత్రులు ఒకరకంగా మార్గనిర్దేశనం చేస్తున్నా అనిపిస్తోంది. ప్రధానిని కలిసి రాజీనామాలపై హడావుడి చేసిన ఇతర  మంత్రులు కూడా ప్రస్తుతం ఆ విషయం మీద ఏమీ మాట్లాడకపోవడం గమనించాల్సిన విషయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి