20, అక్టోబర్ 2013, ఆదివారం

స్వయం పాలన ఆకాంక్షకు స్ఫూర్తి కొమురం భీం


ప్రపంచ చరివూతలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. ఆది నుంచి భూమికోసం, భుక్తికోసం, స్వయంపాలన హక్కుల కోసం భారతదేశంలో జరిగిన పోరాటాల్లోనూ ఆదిమ జనుల పాత్ర అమోఘమైంది.

beemభారతదేశానికి ఆంగ్లేయులు రాక పూర్వమే ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల పరిధిలోని ఆదివాసీ ప్రాంతాలు క్రీ.శ. 1240 నుండి 1749 మధ్య ‘గోండ్వానా’ రాజ్యంగా ఏర్పడ్డాయి. 1750 తర్వాత మరాఠీలు, గోండుల రాజ్యాన్ని హస్తగతం చేసుకుని 1803 వరకు పరిపాలించారు. తదనంతరం ఆంగ్లేయుల ప్రవేశంతో గోండుల తిరుగుబాటు అనివార్యమైంది. గోండు గిరజనుల్లో తొలి వీరుడైన రాంజీ గోండ్ తెల్లదొరలు, నైజాం నవాబుల దమననీతిని ఖండిస్తూ 1836 నుండి 1860 వరకు వీరోచితంగా పోరాడాడు. అప్పటి ‘గోండ్వానా’ రాజ్యంలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణ (ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్) ఆదివాసీ ప్రజలు 1860 నుండి 1948 సెప్టెంబర్ 17 దాకా నిజాం నిరంకుశ పాలనను చవిచూశారు. ‘పుడమి పుత్రులుగా’ అడవిపై వారసత్వ హక్కులను, జీవన సంస్కృతిని, స్వేచ్ఛా స్వపరిపాలనను ఆదివాసీలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు.

రాంజీగోండ్ పోరాట వారసత్వం పుణికి పుచ్చుకున్న యువ గోండు వీరుడు కొమురం భీం. తెలంగాణ సాయుధ పోరులో ‘రగల్ జెండా’ నిజాం నవాబుల నిరంకుశత్వం, రజాకార్ల వ్యవస్థను వ్యతిరేకించి 1931-1940 వరకు వీరోచితంగా పోరాడిన ఘనత భీం సొంతం. ‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో ఆదిమ గిరిజన జాతుల వారికి స్వయంపాలన హక్కు దక్కాలని నిజాం నవాబుపై రణభేరి మోగించి, నవాబుల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు భీం. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం సంకేపల్లి గూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాయి దంపతులకు 1900 సంవత్సరంలో భీం జన్మించాడు. 15వ యేటనే తండ్రి దురదృష్టవశాత్తు అటవీశాఖ సిబ్బంది దాడిలో మరణించడంతో వారి కుటుంబం మకాం సుర్ధాపూర్‌కు మారింది.

భీం అడవిలో స్వేచ్ఛగా తన పోడుభూమిని దున్నుకుంటున్న తరుణంలో ఆ సాగుభూమిని నిజాం అనుచరుడు ‘సిద్ధిఖ్’ అనే జాగీర్‌దార్ దురాక్షికమిస్తాడు. ఇది భీంకు ఆగ్రహం తెప్పించింది. గోండుతో వెట్టిచాకిరి, స్త్రీలపై అత్యాచారాలు, బెదిరింపులు, వంటి చర్యలకూ సిద్దిఖీ పూనుకున్నాడు. వస్తు మార్పిడి తప్ప డబ్బు కళ్ళ జూడని అమాయక ఆదివాసులు అడవుల్లో పశువులు మేపినా, పొయిల కట్టెలు తెచ్చకున్నా, ‘బంబ్‌రాం’, ‘దూపపెట్టి’ పేర్లతో శిస్తులు వసూలు చేశారు. రజాకార్ల దోపిడీ, దుశ్చర్యలను గోండులు ఖండించినందుకు జంగ్లాతు వాళ్ళు, స్థానిక భూస్వాములు కలిసి జోడేఘాట్ పరిసరాల్లోని ఇండ్లను, పంటలను ధ్వంసం చేశారు. దీంతో తెల్లదొరలపై అల్లూరి ‘మన్యసీమ’ (విశాఖ ప్రాంతం)లో (1922-24) సాగించిన మన్యం పోరాటమే స్ఫూర్తిగ భీం నిజాం పాలకులపై ‘తుడుం’ మోగించాడు. నిజాం అల్లరి మూకల దుందుడుకు వైఖరి వల్లే ‘సిద్ధిఖ్’ను హత్య చేసి అసోం రాష్ట్రంలో తలదాచుకున్నాడు. అక్కడే ఐదేళ్ళపాటు పత్తి, కాఫీ, తేయాకు తోటలలో కూలీ పని చేస్తూ కార్మిక ఉద్యమాలకు సారధ్యం వహించాడు. ఈ సమయంలో భీం ఆయుధాలకు కాస్త విరామమిచ్చి, అక్షరాలపై దృష్టి నిలిపాడు. రాత్రి వేళ చదవడం, రాయడం నేర్చుకుంటూ మిత్రుడు కొమురం సూరు ద్వారా రాజకీయాలను ఆకళింపు చేసుకుని తమ ప్రాతం చేరుకున్నాడు.

నిజాం సర్కార్ అరాచకాలకు వ్యతిరేకంగా, తమ జాతి హక్కుల పోరాటానికి భీం ప్రణాళిక రచించాడు. ఆసిఫాబాద్ పరిసరాలలోని జోడేఘాట్, పట్నాపూర్, బాబేఝరీ, టెకెన్నవాడ, చల్ బరిడి, శివగూడ, భీమన్ గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కోశగూడ, లైన్ పటల్ అనే గోండు గూడేలలో భూ పోరాటానికి గోండు, కోయ యువకులతో భీం ‘గెరిల్లా సైన్యం’ స్థాపించాడు. ఆ పన్నెండు గ్రామాలను స్వంతంత్ర ‘గోండు రాజ్యం’గా ప్రకటించడానికీ ప్రణాళిక సిద్ధం చేశాడు. అందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. పెద్ద మనుషులు, విద్యావంతుల సలహా మేరకు డిమాండ్లతో అర్జీ రాసుకుని నవాబుకు తెలపడానికి హైదరాబాద్ వెళ్తే అధికారులు భీంకు అనుమతి నిరాకరించారు. అయినా నిరుత్సాహ పడకుండా సాయుధ పోరాటమే శరణ్యంగా ఆదివాసీ గెరిల్లా సైన్యంతో జోడేఘాట్ గుట్టలను కేంద్రంగా యుద్ధం ప్రకటించాడు.

నిజాం సైన్యంపై అటవీ సిబ్బందిపై భీం కొదమ సింహంలా విజృంభించాడు.
భీం తిరుగుబాటుకు నివ్వెరపోయిన నిజాం సర్కార్ గెరిల్లా సైన్యంపై ప్రతిదాడులు చేసి భీం వద్ద హవల్దార్‌గా వున్న కొమురం సూరును, లచ్చు పటేల్‌ను బంధించింది. చాలామందిని జైల్లో నిర్బంధించింది. రాజీ పడని భీం పోరాట ఉధృతికి నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చి మన్యం గిరిజనుల భూములకు పట్టాలిస్తామని వర్తమానం పంపింది. పట్టాలే కాదు అడవిపై సర్వహక్కులను, గూడేలకు పూర్తి స్వేచ్ఛాపాలనను ఇవ్వాలని భీం మరోమారు డిమాండ్ చేశాడు. భీం షరతులను తిరస్కరించిన నిజాం అతని స్థావరాలపై పోలీసు, సైనిక బలగాలతో నిఘా పెంచింది. భీం రహస్య స్థావరాలను కుర్ధు పటేల్ (కొరియర్) ద్వారా తెలుసుకున్న సైనికులు అర్ధరాత్రి జోడేఘాట్ గుట్టలను చుట్టుముట్టారు. హోరాహోరీగా జరిగిన ఎదురు కాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీర మరణం చెందాడు. ఆ రోజు తిథి ప్రకారం ఆశ్వీయుజ, శుద్ధ పౌర్ణమి (ఆదివారం).

భీమంటే గోండు నాయకుడే కాదు. నిజాం గిరిని ధిక్కరించిన తొలి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. నేటి స్వయంపాలన (తెలంగాణ) ఆకాంక్షకు ఉద్యమ స్ఫూర్తి. అనేక సామాజిక, న్యాయ పోరాటాలకు మార్గదర్శకుడు. భీం ఒక తుడుం మోత. ఆదివాసీ హక్కుల పోరాటానికి ఆయన త్యాగం ఓ దిక్సూచి. ఆదివాసీల ఆశాజ్యోతిలా వెలిగిన భీం నేడు తెలంగాణ పోరుబిడ్డలందరికీ స్వేచ్ఛా గీతం. భీం మరణానంతరం నిజాం సర్కార్ హయాంలో ఇంగ్లాండ్ ఆంత్రోపాలజిస్ట్ హైమండ్ డార్ఫ్‌తో ఆదివాసీ తెగల జీవితాలపై అధ్యయనం జరిగింది.


‘‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం
వచ్చే తరాలు బతుకుతాయి
ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది
వెన్ను చూపడం తగదు’’
-కొమురం భీం


‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో ఆదిమ గిరిజన జాతుల వారికి స్వయంపాలన హక్కు దక్కాలని నిజాం నవాబుపై రణభేరి మోగించి నవాబుల గుండెల్లోనే సింహ స్వప్నంగా మారాడు భీం.
-గుమ్మడి లక్ష్మీనారాయణ



వ్యాసకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ రచయితల సంఘం
సెల్:9491318409

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి