4, అక్టోబర్ 2013, శుక్రవారం

ఆరు నెలల్లో తెలంగాణ


-ఆర్థిక అంశాలపై మంత్రుల బృందం.. నేరుగా రంగంలోకి ప్రణాళిక సంఘం
-హోంశాఖ నుంచి ముసాయిదా బిల్లు.. రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర అసెంబ్లీకి
-తిరిగి కేబినెట్ ద్వారా పార్లమెంటుకు.. ఇదీ రానున్న వారాల్లో కొనసాగే ప్రక్రియ

న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఏర్పాటై.. తన సొంత పాలన ప్రారంభించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అంటున్నారు. ఇందుకోసం అనేక ప్రక్రియలు, పలు లాంఛనాలను పూర్తి చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.. మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. మంత్రుల బృందంలో హోం శాఖ, ఆర్థిక శాఖ, మానవ వనరులు, ఆరోగ్యం, నీటిపారుదల, విద్యుత్, పర్యావరణ-అటవీ, రైల్వే శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు.

ఈ బృందం దేశంలో కొత్తగా 29వ రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెడుతుంది. ఆర్థిక శాఖ ఒక నిపుణుల కమిటీని ప్రత్యేకంగా నియమిస్తుంది. పునర్విభజించే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన సిఫారసులను ఈ కమిటీ చేస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు నేరుగా ప్రణాళికా సంఘం రంగంలోకి దిగుతుంది. కేవలం ఇదే అంశంపై పని చేసేందుకు ఒక కమిటీని నియమిస్తుంది. దీనికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నేరుగా నాయకత్వం వహిస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలతోపాటు బహుళార్థ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

మరోవైపు కేంద్ర హోం శాఖ కేబినెట్‌కు మరో నోట్‌ను అందిస్తుంది. అదే రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు. మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుల ఆధారంగా దీనిని తయారు చేస్తారు. ఈ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతికి పంపాల్సిందిగా కోరుతారు. తర్వాత మరోసారి కేంద్ర కేబినెట్ సమావేశమవుతుంది. ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి ప్రధాని పంపిస్తారు. రాజ్యాంగంలోని 3వ అధికరణం కింద రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని 30 రోజుల్లోగా పంపాలని రాష్ట్రపతి కోరుతారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి 30 రోజుల్లో తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ అభిప్రాయాన్ని కలుపుకొని బిల్లు న్యాయశాఖ పరిశీలనకు వెళుతుంది. న్యాయశాఖ పరిష్కరించిన ముసాయిదా పునర్విభజన బిల్లుతో మూడవ నోట్‌ను హోంశాఖ సిద్ధం చేస్తుంది. అది కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటుకు వెళుతుంది. పునర్విభజన బిల్లు ప్రవేశ పెట్టేందుకు లోక్‌సభ, రాజ్యసభలో నోటీసు ఇస్తుంది. పార్లమెంటులో ఆ బిల్లు సాధారణ మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్రకు వెళుతుంది. అనంతరం కొత్త రాష్ట్రం ఉనికిలోకి వస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి