1, అక్టోబర్ 2013, మంగళవారం

మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar Dist)


మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఒకటి. ఈ జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు, గుల్బర్గా జిల్లాలు సరిహద్దులుగా కలవు. ఈశాన్య దిశలో హైదరాబాదు జిల్లా కలదు. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించారు. రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. కృష్ణా మరియు తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేవి కూడా ఈ జిల్లాలోనే. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలంపూర్, మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్, మన్యంకొండ, వట్టెం, ఊర్కొండపేట, శ్రీరంగాపూర్, ఉమామహేశ్వరం, సిర్సనగండ్ల లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, జూరాల, కోయిలకొండ, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట, అంకాళమ్మ కోట, ప్రతాపరుద్రకోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు, వందేమాతరం రామచంద్రారావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, కపిలవాయి లింగమూర్తి, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్.టి.రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన నారాయణపేట మరియు కొత్తకోట,  చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వర్థమానపురం మరియు వల్లూరు, కళ్యాణి చాళుక్యుల సామంతరాజధానిగా ఉండిన గంగాపురం, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడిపండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు (పాతపేరు 7) జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. జిల్లాలో మొత్తం 10 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి.
భౌగోళికం
భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణా ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇది రెండో పెద్ద జిల్లా. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది సరిహద్దుగా ప్రవహిస్తున్నది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా ఉత్తర, దక్షిణంగా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-ద్రోణాచలం రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. 2001 జనాభా గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాలా, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.
చరిత్ర
(తూర్పు కమాన్)
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు (Palamooru) అని రుక్మమ్మపేట (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా వున్నది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.

పాలించిన రాజవంశాలు

    మౌర్య సామ్రాజ్యం : క్రీ.పూ.250 లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యం లో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది.
    శాతవాహన రాజ్యం : క్రీ.పూ.221 నుంచి క్రీ.శ 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది.
    చాళుక్య రాజ్యం : క్రీ.శ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతము చాళుక్య రాజ్యంలో భాగంగా ఉండింది.
    రాష్ట్రకూట రాజ్యం : క్రీ.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు.
    కాకతీయ రాజ్యం : క్రీ.శ.1100 నుంచి క్రీ.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు.
    బహమనీ రాజ్యం : క్రీ.శ.1347 నుంచి క్రీ.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యం లో భాగంగా ఉండింది.
    కుతుబ్ షాహి రాజ్యం : క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం
    మొఘల్ సామ్రాజ్యం : క్రీ.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతంను మొఘలులు పాలించారు.
    నిజాం రాజ్యం : క్రీ.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్రం అనంతరం హైదరాబాదు సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది.

ఆధునిక చరిత్ర

హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చినది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి. స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అద్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అద్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అద్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు. 1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది.

నిజాం విమోచనోద్యమం
నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ప్రముఖ స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. వందేమాతరం రామచంద్రారావు, వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సురభి వెంకటేశ్ శర్మ, పాగపుల్లారెడ్డి, ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, బి.సత్యనారాయణరెడ్డి లాంటి ప్రముఖులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
పట్టణ ప్రాంతాలు
మహబూబ్ నగర్ జిల్లాలో 10 మున్సీపాలటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), జడ్చర్ల (మున్సీపాలటి), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పమ్చాయతి)ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), అచ్చంపేట్ (మేజర్ గ్రామ పంచాయతి). 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై మరియు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డీవిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పం గానూ ఉంది.

జనాభా
1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2011 జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడినది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్.

రవాణా సౌకర్యాలు

రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రోడ్ రైల్వేస్టేషన్ వరకు జిల్లాలో మొత్తం 33 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషన్లు కలవు (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని వాడి మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషన్ ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయచూరుకు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.

రోడ్డు సౌకర్యం
: దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు కలదు. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపూర్ రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.

బస్ డిపోలు
: మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల, షాద్‌నగర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్.

జిల్లా రాజకీయాలు
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకె అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితర ప్రముఖులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు. ప్రస్తుత మంత్రివర్గంలో గద్వాల శాసనసభ్యురాలు డి.కె.అరుణ కొనసాగుతుంది.

పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.

విద్యారంగం
మహబూబ్ నగర్ జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, 2006-07 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది. 2008-09 నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది. ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

సాహిత్యం
సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి. హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.

వర్షపాతం, వాతావరణం

మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల జూన్, జూలై మరియు ఆగస్టు నెలలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మద్య తేడాలున్నాయి. దక్షిణవైపున తుంగభద్ర మరియు కృష్ణానది తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.

జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ మరియు చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.

అడవులు
జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు 329 చ.కి.మీ.లతో కలిపి మొత్తం 1944 చ.కిమీ.ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవీప్రాంతంలో ఉంది. జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న అమ్రాబాదు మండలంలో అధికశాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు మరియు ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించియున్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగము. జిల్లాలోని అడవులను రెండు డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్‌లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్‌నగర్ డివిజన్‌లో కొంత భాగం అడవులున్నాయి.

నీటిపారుదల సౌకర్యం
దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర మరియు చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా మరియు మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉన్నది.

ఖనిజ వనరులు

పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి.

పరిశ్రమలు
రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కొత్తూరు మండలంలో జిల్లాలోనే అత్యధిక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రసాయన, ఇంజనీరింగ్, ఫార్మా, డ్రగ్స్ తదితర 137 పరిశ్రమలతో కొత్తూరు మండలం ప్రథమస్థానంలో ఉంది. మహబూబ్‌నగర్ మండలంలో 92, షాద్‌నగర్ మండలంలో 69, జడ్చర్ల మండలంలో 67 పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలోనే తొలి సెజ్ జడ్చర్ల సమీపంలోని పోలెపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉండగా. నారాయణపేట డివినల్‌లో తక్కువగా ఉన్నాయి.

క్రీడలు
జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ స్కూల్ నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు.
విభాగాలు: పాలమూరు జిల్లా సమాచారం,   మహబూబ్‌నగర్ జిల్లా పట్టణాలు, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి