17, అక్టోబర్ 2013, గురువారం

371డి అధికరణ ఏమిటి: విభజనకు మెలికనా?


 
హైదరాబాద్‌ : నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ రాష్ట్ర విభజనకు గుదిబండగా మారుతుందనే చర్చ సాగుతోంది. నిజంగానే అది గుదిబండగా మూరుతుంది. అది విభజన ప్రక్రియలో మెలిక అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ అధికరణపై ఓ న్యాయవాది కోర్టుకు వెళ్లాడు.
రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేకవాదం ఉవ్వెత్తున సాగిన నేపథ్యంలో మధ్యే మార్గంగా కేంద్రం ఆంధ్రా, రాయలసీమ, తెలం గాణ ప్రాంతాల మధ్య సమతుల్యత వుండాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధి, ఇత్యాది రంగాలకు 371డి ఆర్టికల్‌ ద్వారా 1973లో మార్గ దర్శకాలను రూపొందించింది. పబ్లిక్‌ సర్వీసెస్‌లలో మూడు ప్రాంతాలలో సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని ఈ అధికరణ తెలియజేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలో ఉద్యమం ఎగిసినపడిన ఫలితం అది ముందుకు వచ్చింది.
371డి అధికరణ ఏమిటి: విభజనకు మెలికనా?
అప్పటి పరిణామాలలో భాగంగానే ఆర్టికల్‌ 371 డి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ సీట్లను ఓపెన్‌ కేటగరీలో 54 శాతం వుండాలని నిర్దేశించడం జరిగింది. అదే విధంగా ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి.లకు సంబంధించి 46 శాతం వుండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా 1974 నాటి ప్రెసెడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం స్థానిక అభ్యర్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ కేటగరీలో 15 శాతం అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది.
దాని ఫలితంగా రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో ఆరు జోన్లు ఏర్పడ్డాయి. ఈ ఆర్టికల్‌ను ఆయుధంగా చేసుకుని రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఏపిఎన్జీవో నేతలు భావిస్తున్నారు. దాన్ని రద్దు చేస్తే గానీ రాష్ట్ర విభజన సాధ్యం కాదు. దాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని, అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెబుతూ వస్తున్నారు.
అయితే, ఉద్యోగాల్లో సమానావకాశాల కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 371డి అధికరణ చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన చేసే సమయంలో రాష్ట్రపతి ఆ ఉత్తర్వును ఉపసంహరించుకుంటే సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఓ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి