Sakshi | Updated: October 05, 2013 04:02 (IST)
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గానికి గురువారం కేంద్ర హోం శాఖ సమర్పించిన 22 పేజీల నోట్‌లోని ముఖ్యమైన అంశాలు క్లుప్తంగా...
కొత్త రాష్ట్రాన్ని తెలంగాణ అని వ్యవహరించాలి. మిగతా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పేరును యథాతథంగా కొనసాగించాలి
హైదరాబాద్ మరో పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి. అందుకు ఎన్ని నిధులు కావాలో కేంద్రం నిర్ణయించి, కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడ్డ ప్రాంతాలు/జిల్లాల ప్రత్యేక అవసరాలను గుర్తించి, వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలి
రాజ్యసభ స్థానాల్లో తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్‌కు 11 ఉంటాయి
లోక్‌సభ స్థానాల్లో 17 తెలంగాణకు, 25 ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయి
రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్‌ను గానీ, ఇద్దరిని గానీ నియమించాలి
తెలంగాణకు శాసనమండలి ఏర్పాటుపై కొత్త అసెంబ్లీ అభిప్రాయానుసారం నడుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత మండలిని పునర్ వ్యవస్థీకరించాలి.
తెలంగాణలో 119, ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలుంటాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను తెలంగాణ అసెంబ్లీకి నామినేట్ అయినట్టుగా పరిగణించాలి
విభజన అనంతరం మిగిలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (కొత్తవారిని ఎన్నుకునేదాకా) ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లనే కొనసాగించాలి. తెలంగాణ అసెంబ్లీకి కూడా స్పీకర్, డిప్యూటీలను నియమించుకోవాలి.
రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేసేదాకా ప్రస్తుత హైకోర్టే రెండింటికీ కొనసాగుతుంది
ఆదాయాన్ని రెండు రాష్ట్రాల మధ్య సజావుగా పంపిణీ చేయాలి. ఎలాంటి ఖర్చులకైనా గరిష్టంగా ఆరు నెలలకు మించకుండా రాష్ట్ర సంచిత నిధి నుంచి నిధులను విడుదల చేసే అధికారాన్ని ప్రస్తుత గవర్నర్‌కు, (విభజన తర్వాత) తెలంగాణ గవర్నర్‌కు కట్టబెట్టాలి.
విభజన ప్రక్రియ ముగిసేదాకా ఆలిండియా సర్వీస్ అధికారులు రెండు రాష్ట్రాలకూ సేవలందించాలి. తర్వాత వారిలో ఏ రాష్ట్రానికి ఎందరిని కేటాయించాలో కేంద్రంతో సంప్రదించి నిర్ణయించుకోవాలి.
జల వనరుల పంపకంలో తమతో పాటుగా ఆయా నదీ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే ఉన్న హక్కులకు ఎలాంటి విఘాతమూ కలగని రీతిలో కేంద్రం నిర్దేశాల మేరకు రెండు రాష్ట్రాలూ నడచుకోవాలి
విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా, తత్సంబంధిత ఆస్తుల పంపకం రెండు రాష్ట్రాల మధ్య సజావుగా, అవసరమైతే కేంద్రం జోక్యంతో జరగాలి
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యాంగంలో 371డి అధికరణాన్ని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావానంతరం దాన్ని మిగతా ఆంధ్రప్రదేశ్‌కు అనుగుణంగా మార్చడమో, తొలగించడమో చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి