11, అక్టోబర్ 2013, శుక్రవారం

తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదు


-తెలంగాణపై నిర్ణయంలో హడావుడి లేదు
-డిసెంబర్ 9 ప్రకటనతోనే ప్రక్రియ మొదలు
-ఢిల్లీలో హోం మంత్రి షిండే వ్యాఖ్యలు
-రాష్ట్రపతి పాలన విధింపునకు సంకేతాలు!
-పార్లమెంటులో బిల్లుపై కొరవడిన నిర్దిష్ట హామీ
-నేడు మంత్రుల బృందం తొలి భేటీ
-సాధ్యమైనంత త్వరలో జీవోఎం నివేదిక
-నిర్ణయంపై పునరాలోచన లేదు
-జీవోఎంలో రాష్ట్ర మంత్రులు లేకున్నా
-ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తాం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. సీమాంధ్రలో ఆందోళనలు అదుపులోకి రాని పక్షంలో ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదని కూడా సంకేతాలిచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

antoni‘తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు అవకాశాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు’ అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు. గురువారం తన శాఖ విషయాలపై ఏర్పాటు చేసిన నెలవారీ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు తెలంగాణ విషయంలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నా.. తెలంగాణ నిర్ణయాన్ని అమలు చేయడానికే కట్టుబడి ఉన్నామని షిండే సహా వివిధ నేతలు చెప్పడాన్ని చూస్తే రాష్ట్రపతిపాలన విధింపు దిశగా ఆలోచనలు సాగుతున్నాయన్న వాదనలకు బలం చేకూరుతున్నది. రాష్ట్ర విభజన విషయంలో శుక్రవారం తొలి భేటీ జరుపనున్న మంత్రుల బృందం.. అందరు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలూ వింటుందని, వాటిని కేబినెట్‌కు అందజేస్తుందని షిండే చెప్పారు.

దానిని రాష్ట్రపతికి పంపించి, అక్కడి నుంచి తిరిగి కేబినెట్‌కు వచ్చాక పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. నవంబర్ చివరిలో మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అంశంపై ఆయన నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. ‘చూద్దాం’ అని మాత్రం సమాధానమిచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో నెలకొల్పిన మంత్రుల బృందం తన నివేదికను సాధ్యమైనంత త్వరలో అందిస్తుందని, అందుకే దానికి ఎలాంటి కాలపరిమితి విధించలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని తెలిపారు. అయితే.. జీవోఎం సిఫారసులు అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించే ఆలోచన కేంద్రం చేస్తున్నదా? అని ప్రశ్నించగా.. అందుకు అవకాశాలను ఆయన కొట్టిపారేయలేదు. ‘ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేను’ అని బదులిచ్చారు. మంత్రుల బృందంలో రాష్ట్రానికి చెందిన ఒక్క మంత్రిని కూడా సభ్యుడిగా నియమించకపోవడాన్ని ప్రస్తావించగా.. అది పెద్ద విషయం కాదని షిండే వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రుల బృందంలో ప్రాతినిధ్యం లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి కూడా షిండే ఈ సందర్భంగా వివరించారు. మంత్రుల బృందం విధి విధానాలను రూపొందించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తూ వరుస చర్యలు చేపట్టడం జరుగుతుందని షిండే చెప్పారు. తొలుత జీవోఎం తన నివేదికను కేబినెట్‌కు సమర్పించాల్సి ఉంటుందని, అనంతరం దానిని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పారు. అక్కడిన ఉంచి తిరిగి వచ్చాక పార్లమెంటులో ప్రవేశపెడతామని అన్నా రు. రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదించనిపక్షంలో కొత్త రాష్ట్రం పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ‘గతంలో కూడా ఇటువంటి తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ పక్కనపెట్టింది.

రాజ్యాం గ ప్రకారం అది (అసెంబ్లీ తీర్మానం) తప్పని సరి కాదు’ అని అన్నారు. విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని విషయంలో ప్రశ్నించగా.. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేసి, గుంటూరులో హైకోర్టు నెలకొల్పాలని కొందరు సూచిస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఆ ప్రాంతంవారేనని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తొందరపాటు తగదని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న వాదనలను ఆయన తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 2009లో నాటి హోం మంత్రి పీ చిదంబరం చేసిన ప్రకటనతోనే మొదలైందని చెప్పారు. అయితే అనంతరం తలెత్తిన నిరసనల వల్ల ప్రభుత్వం తదుపరి సంప్రదింపుల కోసం శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. తాను కూడా 2012లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా సాగిన ఈ ప్రక్రియకు కొనసాగింపుగానే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని షిండే చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా జీవోఎం పరిశీలిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం, రాజకీయ పార్టీలతో మాట్లాడటం వంటి అంశాలు జీవోఎం తొలి రెండు సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉంటాయని వెల్లడించారు. ఇంతకు మించి ఈ విషయంలో ఇప్పుడే మాట్లాడటం సరికాదని అన్నారు.

సీమాంవూధకు అదనపు బలగాలు
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సహకరించేందుకు 7500 మంది కేంద్ర పారా మిలిటరీ బలగాలను పంపించినట్లు షిండే చెప్పారు. ‘తెలంగాణ ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి, 45 కంపెనీల అదనపు బలగాలను పంపించాం. వాటితోపాటు మరో 30 కంపెనీలను ఈ వారం రోజుల్లో పంపించాం’ అని చెప్పారు.

ఢిల్లీలో బాబు దీక్ష అసాధారణం
చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్షకు దిగడం అసాధారణ చర్యగా షిండే అభివర్ణించారు. ‘యే అజీబ్ తరహ్ కా ఆందోళన్ హై (ఇది అసాధారణమైన ఆందోళన). ఒక రాష్ట్ర అతిథి గృహం ఆవరణను ఒకరు ఇలా నిరాహారదీక్షకు వేదికగా ఉపయోగించుకోవడాన్ని మొదటిసారిగా చూస్తున్నాను’ అన్నారు. ఏపీభవన్ ఆవరణలో చంద్రబాబు దీక్ష విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నకు నిరాహారదీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు మధ్య వివాదంలో తాము జోక్యం చేసుకునే ఉద్దేశం లేదన్నారు. దురాక్రమణ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని సలహా ఇచ్చారు. ‘ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉంటే అప్పుడు మేం ఏమైనా సహాయం చేయగలం’ అన్నారు. ఆందోళనను విరమించి ఏపీకి తిరిగి వెళ్లాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని టీడీపీ స్పష్టంగా కేంద్రాన్ని కోరిందని, వారి అభిప్రాయానికి విలువ ఇచ్చామని షిండే చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి