2, అక్టోబర్ 2013, బుధవారం

మహానగరానికి మణిహారం మెట్రో



Posted on: Fri 03 Oct 00:54:16.895001 201304
మోడల్‌కోచ్‌ ఆవిష్కరణలో సిఎం
నేటి నుండి ప్రజల సందర్శనార్థం బోగి
ప్రజాశక్తి-హైదరాబాద్‌ప్రతినిధి
మెట్రోరైలు ప్రాజెక్టు హైదరాబాద్‌ మహానగరానికి మణిహారమని, దీంతో నగర ప్రతిష్ట మరింత పెరగనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెక్లెస్‌ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన మెట్రోరైలు మోడల్‌ కోచ్‌ను సిఎం బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, అవుటర్‌రింగ్‌రోడ్డు వల్ల నగరానికి విలువ పెరిగిందన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు మార్చి 2015 నాటికి పూర్తవుతుందన్నారు. అనంతరం మెట్రోరైలు బోగీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి హెచ్‌ఎంఆర్‌ ఎండి ఎన్‌విస్‌ రెడ్డి వివరించారు. మూడు కార్లతో ట్రెయిన్‌ సెట్‌, స్టాండర్డ్‌ గేజ్‌ 1435 మిల్లీ మీటర్లు ఉంటుందన్నారు. గరిష్ట డిజైన్‌ వేగం గంటకు 90 కిలోమీటర్లు, గరిష్ట ఆపరేటింగ్‌ వేగం 80 కిలోమీటర్లు, సరాసరి వేగం 33 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. 20 సెకన్లలో స్టేషన్‌, 30 సెకన్లలో టర్మినల్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. రేపటి నుండి ప్రజల సందర్శనార్థం ఉంటుందని ప్రకటించారు. ఎల్‌అండ్‌టిహెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండి గాడ్గిల్‌ మాట్లాడుతూ బోగీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో కూడిన లైట్‌వెయిట్‌ ఉంటుందని, శక్తిని పునరుత్పత్తి చేసుకుంటుందని అన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన లేజర్‌షో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, కాసు వెంకటకృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి