20, అక్టోబర్ 2013, ఆదివారం

శాస్త్రీయ పద్ధతుల్లోనే రాష్ట్ర విభజన


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాష్ట్రాల విభజనకు సంబంధించి అనేక వాద, వివాదాలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచీ, బాధ్యాతాయుత మీడియా నుంచి రావడమే విచిత్రం. దీంతో అనుమానాలు, అపోహలు, అనవసర భయాలు ప్రజల్లో నెలకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఏర్పడిన మంత్రుల కమిటీ విషయంలో కూడా కొంత సందిగ్దత ఏర్పడింది. యువకుడు, నిపుణుడు అయిన ఆదిత్య కృష్ణ చింతపంటి అనే అడ్వకేట్ రాష్ట్రాల విభజనకు సంబంధించి అనేక రీ-ఆర్గనైజేషన్ యాక్ట్స్ అధ్యయనం చేశాడు. బొంబాయి (1960), పంజాబ్ (1966), మధ్యవూపదేశ్ (2000), బీహార్ (2000) రాష్ట్రాల విభజన సందర్భంగా వచ్చిన చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేశాడు. ఈ విధి విధానాలన్నీ గత 40 ఏళ్లలో అనేక చారివూతక సందర్భాల్లో ఉనికిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాల్లోంచి తెలంగాణ, ఆంధ్ర విభజన జరుగు తున్న సమయంలో ఉన్న సమస్యలను, పరిష్కారాలను ఓసారి చూద్దాం.
ddr5

మొదటిది: ఆర్టికల్ మూడు అంశం. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన కానీ, కలపడం కానీ పార్లమెంటుకు పూర్తి హక్కును రాజ్యాంగం కట్టబెట్టింది. అలాగే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆర్టికల్-3కు సవరణలు కూడా చేయడానికి సర్వహక్కులు కలిగి ఉన్నది. ఇవన్నీ సుప్రీంకోర్టు ఆమోదంతో రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కులు. ఆర్టికల్-3 ప్రకారం విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి అభివూపాయం కోసం మాత్రమే పంపుతుంది. ఒక జమ్మూ-కశ్మీర్ విషయంలో మాత్రమే మినహాయింపుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి అవసరం. కానీ ఒకవేళ రాష్ట్రపతి పాలన సందర్భంలో స్థానిక అసెంబ్లీ సస్పెండ్ చేయబడినప్పుడు ఈ మినహాయింపులేవీ వర్తించవు. పార్లమెంటుకే సర్వాధికారాలు ఉంటాయి. అలాగే.. రాష్ట్ర విభజనకు సంబంధించి ముందస్తు అసెంబ్లీ తీర్మానాలు కూడా అవసరం లేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ విషయంలో స్థానిక ప్రభుత్వాలను ఒప్పించి ముందస్తు తీర్మానాలు వచ్చేట్లు చేసింది. మధ్యవూపదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ ప్రభుత్వం, బీహార్‌లో రబ్రీదేవీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజనకు ముందస్తు తీర్మానాలు చేయించింది ఎన్డీఏ ప్రభుత్వం. బీజేపీ పాలిత ఉత్తరవూపదేశ్‌లో ఉత్తరాఖండ్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇలాంటి తీర్మానాన్ని చేయించడం బీజేపీకి సమస్య కాలేదు.


రెండో అంశం: పార్లమెంటులో రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు పాస్ అయిన వెంటనే రెండు వేర్వేరు అసెంబ్లీలుగా ఏర్పడవలసి ఉంటుంది. విభజన జరిగిన అసెంబ్లీల్లో ఉమ్మడి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పదవీకాలం యధావిధిగా ఉంటుంది. అలాగే శాసనమండలి సభ్యుల కాలం కూడా అలాగే ఉంటుంది. కానీ పదవీ కాలం ముగిసిన వారు మాత్రం కొత్తగా ఏర్పడిన (విభజన కారణంగా ఏర్పడిన) అసెంబ్లీల నుంచే ఎన్నిక కాలవలసి ఉంటుంది.
మూడో అంశం: రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర హైకోర్టుల ఏర్పాటును పార్లమెంటు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాయర్లు కూడా ప్రాంతాల వారిగా విడిపోయి ఉద్యమిస్తున్న సందర్భంలో ఉమ్మడి హైకోర్టు ఉండటం అసమజసం. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉన్న హైదరాబాద్‌లోనే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసి, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తారు.
నాలుగవ అంశం: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉన్న అనేక కమిషన్‌లు, కమిటీలు అన్నీ యధాతథంగా ఉంటాయి. అలాగే విభజన జరిగిన తర్వాత అంతవరకు అస్తిత్వంలో ఉన్న కమిటీలు, కమిషన్‌లు, రాజ్యాంగ బాడీలు రెండు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల దాకా అమలులో ఉంటాయి. అదే సమయంలో.. ఇరు రాష్ట్రాలు తమ ప్రాంతానికి, రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్, తదితర పాలనాపరమైన విభాగాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

అయిదో అంశం: ఆదాయ, వనరుల పంపకం అనేది ఉమ్మడి రాష్ట్ర మొత్తం రాబడి,వ్యయం, అప్పుల ఆధారంగా రెవెన్యూ పంపకాలు జరుగుతాయి. అలాగే ఆదాయ, రెవెన్యూ రాబడులకు సంబంధించి ప్రాంతీయ సరిహద్దులు పునాదిగా శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా పంపకాలు జరుగుతాయి.
ఆరో అంశం: ఆస్తులు, వనరుల పంపకాలకు సంబంధించి ఉభయ రాష్ట్రాలు చర్చలతో, సామరస్య పూర్వకమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలి. ఉదాహరణకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులాంటి విషయంలో ఉభయ రాష్ట్రాలు చర్చించుకుని ఒక ఒప్పందానికి రావాలి. లేనట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఒక ఇండిపెండెటు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి వనరులు, నీటి పంకాల లాంటి అంశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తుంది. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే బచావత్ ట్రిబ్యూనల్ చేసిన పంపకాలు అస్తిత్వంలో, అమలులో ఉన్నాయి. 1976 నుంచి ఈ ట్రిబ్యూనల్ తీర్పుననుసరించే నీటి పంపకాలు జరుగుతున్నాయి. ఇందులో ఏ సమస్యా, వివాదాలులేవు.

ఏడో అంశం: ఆర్టికల్ 371(డి) అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు వచ్చిన ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసేందుకు వచ్చింది. బాంబా యి, పంజాబ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాలు ఆర్టికల్ 371ను సవరించాయి. తెలంగాణ ప్రాంతం ప్రయోజనాల పరిరక్షణ కోసం వచ్చిన 371(డీ), రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాని అవసరం తీరిపోతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాల నేపథ్యంలో 371(డీ) అవసరమవుతుంది. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల రిజర్వేషన్ కోసం వచ్చిన ఈ చట్టం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దానిలో మార్పులు చేర్పులు ఉండవచ్చు, లేదా తొలగించబడవచ్చు.

ఎనిమిదో అంశం: అతిముఖ్యమైనది ఉమ్మడి రాజధాని గురించి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్ఠంగా పది సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రరాష్ట్ర రాజధాని ఉండి.. దాని పాలన 200ల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పాలించాలి. ప్రజల బాగోగులను చూడాలి. ప్రయాణ దూరం రీత్యా ప్రజలకు ఇది పెను భారం, అసౌకర్యం. 1953లో ఆంధ్రా యాక్ట్ ప్రకారం ఇరు ప్రాంతాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం 14 ప్రత్యేక పాలనా విభాగాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే.. ఆంధ్ర రాష్ట్ర పాలక ప్రభుత్వానికి అవసరమైన వసతుల ఏర్పాటుకు సంబంధించి ఇరు ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం జరగాలి. అలాగే ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి తగిన పూర్తి రక్షణ బాధ్యతలు స్థానిక ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటికీ పూర్తి రక్షణ కల్పించాలి. కొత్తగా ఉనికిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రాంతాల్లోని శాంతి భద్రతలకు పూర్తి బాధ్యత వహించాలి.


రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి సుదీర్ఘ కాలవ్యవధిలో ఎన్నో కాలపరీక్షల్లో నిలిచిన చట్టాలూ, సుప్రీంకోర్టు విధి విధానాలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ విభజన విషయంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా స్పష్టమైన రాజ్యాంగ సూత్రాలు, విధివిధానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అప నమ్మకాలకు తావులేదు. చిక్కుముడులు కూడా లేవు. ప్రజల మధ్యన అపనమ్మకాలు, అపోహలు తలెత్తడానికి అవకాశాలు, ఆస్కారాలు అసలే లేవు. ఆంధ్రావూపాంత నేతలు 1953 నాటి ఆంధ్రాస్టేట్, 1956 నాటి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు నాటి పరిస్థితులను, ఆనాడు ఆలంబనగా చేసుకున్న చట్టాలను ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలియజేయాలి. తెలంగాణ ఏర్పాటు అనేది ఆనాడు జరిగిన దానికి వ్యతిరేక దిశలో జరుగుతున్న విధానంగానే, దానిలో కొనసాగింపుగానే వివరించాలి.
-గౌతమ్ పింగ్లే
(‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి