- - పివివి సత్యనారాయణ ఎపి ఎన్జీవో సంఘం, హైదరాబాద్ అధ్యక్షుడు
- 17/10/2013
TAGS:
విభజన
జరిగితే ఇప్పటివరకూ ఉన్న ఆర్టికల్ 371(డి)ని ఏం చేస్తారో? ఎలా అమలు
చేస్తారో మంత్రుల బృందం (జివోఎం) చెప్పాలి. ఉద్యోగుల సర్వీసు విధానాలు,
సీనియారిటీ, ఉద్యోగ భద్రత ఇలాంటి అనేక అంశాలను ఏం చేస్తారో జివోఎం
ఖచ్చితంగా ఉద్యోగులకు సమాధానం ఇవ్వాలి. ఆర్టికల్ 317 (డి) రద్దు చేయకుండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసాధ్యం. ఎంతో మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి
ఉన్న ఆర్టికల్ 371(డి)ని రద్దు చేస్తే మరి వారి పరిస్థితి ఏమిటి? కొందరు
భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులై వారి ఎంతోకాలంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు
చేసుకుంటున్న వారు ఉన్నారు. వారి పిల్లలు ఇక్కడే పుట్టి పెరగడంతో వారు
ఇక్కడ లోకల్ అవుతారు. విభజన జరిగి భార్యాభర్తలు సీమాంధ్రకు వెళ్లాల్సి
వస్తే వారి పిల్లల భవిష్యత్ ఏమైపోవాలి? వీటితోపాటుగా మరో ముఖ్యమైన విషయం
హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత. విభజన జరగక ముందే కొందరు విభజనవాదులు
హైదరాబాద్‌లోని సీమాంధ్రులను భయబ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు
పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. అలాగే విభజన జరిగితే సీమాంధ్రకు సాగు నీరు
అందక పచ్చని పొలాలు బీళ్లుగా మారి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు
లేకపోలేదు. ఇలాంటి ముఖ్యమైన విషయాలపై ఎంతమాత్రం స్పష్టత ఇవ్వకుండా సీమాంధ్ర
ప్రజల, ఉద్యోగుల భవిష్యత్‌ను పరిగణలోనికి తీసుకోకుండా విభజించాలని చూడడం
దారుణం. ఈ అన్ని అంశాలను కేంద్రం ఏర్పాటు చేసిన జివోఎం దృష్టికి
తీసుకెళ్తాం. విభజన జరిగితే వచ్చే అనేక సమస్యలను జివోఎం దృష్టికి
తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంత వరకూ పోరాడుతాం. అలాగే విభజనపై సీమాంధ్ర
ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను కూడా జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. విభజనతో
సుమారు 50 వేల మంది ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
విభజనతో జోన్ల విధానం రద్దయ ఉద్యోగుల ప్రమోషన్లపై కొత్త సమస్యలు వస్తాయి.
వారి పరిస్థితి ఏమవ్వాలి? ఇంతకు ముందు విభజన జరిగిన మూడు రాష్ట్రాల్లో
ఇప్పటికి ఉద్యోగులు సీనియారిటీ, ప్రమోషన్లు, పెన్షన్ల వంటి అంశాలపై
కోర్టుకెక్కారు. రాష్ట్ర విభజన జరిగితే రేపు రేపు సీమాంధ్ర ఉద్యోగులు కూడా
అలా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ముఖ్యంగా
హైదరాబాద్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన సీమాంధ్ర ఉద్యోగికి పెన్షన్ ఏ
ప్రభుత్వం చెల్లిస్తుంది? పదవీ విరమణ పొందాక ప్రభుత్వ చెల్లించే మొత్తం ఏ
రాష్ట్రం చెల్లిస్తుంది? విరమణ ఉద్యోగి ఆదాయం లేని కొత్త రాష్ట్రానికి
వెళ్తే అతడికి రావాల్సిన భత్యాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అనేక అంశాలపై
స్పష్టత ఇవ్వాలని జివోఎంను కలిసి నివేదిక అందిస్తాం. ఉద్యోగుల సమస్యలతోపాటు
సాగు నీటి పంపకాలు, విద్యుత్ ఉత్పత్తికి కేటాయించాల్సిన నీటిపై కూడా
జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇవేగాక రాష్ట్ర విభజన జరిగితే ప్రభుత్వ
ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్‌కు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల
భవిష్యత్, హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఉద్యోగ అవకాశాలు, భద్రత ఇలా అనేక
సమస్యలను జివోఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి అనేక సమస్యలకు ఏకైక పరిష్కార
మార్గం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే. విభజన అనివార్యమైతే మాత్రం
ఉద్యోగుల, సీమాంధ్రుల ఆందోళనలను, అపోహలపై క్షుణ్ణంగా చర్చించి స్పష్టమైన
హామీ ఇచ్చాకే ముందుకు వెళ్లాలని జివోఎంకు స్పష్టం చేస్తాం. సీమాంధ్ర
ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వడంతోపాటు, ఈ పదేళ్లలో సీమాంధ్రలో కొత్త రాజధానిని
అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి 2023 తర్వాతే పార్లమెంట్‌లో తెలంగాణ
బిల్లును ప్రవేశపెట్టాలని జివోఎం దృష్టికి తీసుకెళ్తాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి