7, అక్టోబర్ 2013, సోమవారం

గ్రిడ్ కూల్చేకుట్ర!


-ఉద్యోగుల ఆందోళనపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నిల్..
-జెన్‌కో సిబ్బందికి అరాచక శక్తుల హెచ్చరికలు
-400 కేవీ సబ్‌స్టేషన్లే లక్ష్యం..
-దక్షణాది గ్రిడ్‌పై ప్రభావం చూపించాలనే దుర్మార్గం

హైదరాబాద్, అక్టోబర్ 6 ( టీ మీడియా) :రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు తమ ఆందోళనల్లో హద్దులు మీరుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సమ్మెవల్ల తలెత్తుతున్న పరిస్థితులకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. సమ్మె ద్వారా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా జరుగకుండా అడ్డుకోవడం,
Currentఫలితంగా గ్రిడ్ ఫ్రీక్వెన్సీని గణనీయంగా తగ్గించడం వల్ల, దాని ప్రభావం దక్షణాది రాష్ట్రాలపై పడి గ్రిడ్ ఫెయిల్యూర్ కావడమే తమ లక్ష్యమనే రీతిలో సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిపట్ల సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణలో సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ప్రణాళికలు, పారా మిలటరీ బలగాలతో రక్షణ వంటి చర్యలేవీ ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంత జిల్లాల్లో కనిపించకపోవడాన్ని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. సర్కారీ కనుసన్నల్లోనే సీమాంధ్ర ఉద్యమం నడుస్తుందన్న ఆరోపణలకు ఇంతకంటే నిదర్శనం మరేమి కావాలని నిలదీస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిని, సరఫరాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా సాంకేతిక లోపాలంటూ కప్పదాటు వ్యవహారంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములవుతున్నా పత్యామ్నాయ ఏర్పాట్లల్లో విఫలమయ్యాయని అంటున్నారు.

ఇందుకు విజయవాడలోని వీటీపీఎస్ 1,260 మెగావాట్లు, కడపలోని ఆర్టీపీపీలో 1,050 మెగావాట్లు, శ్రీశైలం ఎడమకాల్వ కింద 770 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, తూర్పుగోదావరి జిల్లాలోని అప్పర్ సీలేరులో 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, డొంకరాయిలో 25 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరగకుండా విద్యుత్ ఉద్యోగులు మొండిగా వ్యవహరిస్తున్న ఉదంతాలను గుర్తుచేస్తున్నారు. ఉద్యమంలో అరాచకశక్తులు చేరాయని రెండు రోజుల క్రితం ఏపీ జెన్‌కో డైరెక్టర్(థర్మల్) ఆంజనేయరావుపై చేయిచేసుకునేందుకు వెనుకాడని పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం. సుదీర్ఘకాలం వీటీపీఎస్‌లో పనిచేసిన ఆంజనేయరావుకు ఉద్యోగుల్లో గౌరవమర్యాదలున్నాయి. థర్మల్ పవర్ జనరేషన్ రంగంలో అంతటి అనుభవం కలిగినవారులేరు. ఈనెలాఖరుతో డైరెక్టర్‌గా పదవీకాలం పూర్తి అవుతున్నా జెన్‌కో సంస్థలో ఆయనను కొనసాగించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉద్యమంలో అరాచకశక్తుల రాకతోనే ఆయనపై వాటర్ బాటిళ్ళు విసిరేంత పరిస్థితులు దాపురించాయని అంటున్నారు. విద్యుత్‌రంగం అత్యవసర సర్వీసుల కింద ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. విద్యుత్ ఉత్పత్తిని, పంపిణీని, సరఫరాను అర్ధాంతరంగా అడ్డుకునే ఉద్యోగులపై కేసులు నమోదుచేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు విచారం వ్యక్తంచేస్తున్నారు.

ఉద్యమాలు చేయవచ్చు కానీ, ఉద్యోగులుగా అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా బాధ్యతలను విస్మరించడం సరైందికాదంటున్నారు. ఇదిలా ఉండగా, విద్యుత్‌ఉత్పత్తి, పంపిణీ, సరఫరాకు విద్యుత్ ఇంజనీర్లు ముందుకువస్తున్నా కొన్ని శక్తులు వారిని అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. విద్యుత్ జనరేటింగ్ స్టేషన్లలో కింది స్థాయి ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన యూనియన్లు విద్యుత్ ఇంజనీర్ల విధులకు అంటకం కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌కో పరిధిలోని 400కేవీ, 220కేవీ, 132 కేవీ సామర్ధ్యం కలిగిన సబ్‌స్టేషన్ల నిర్వహణ అంతా ప్రైవేటు కాంట్రాక్టర్ల పరిధిలో ఉండడం, సబ్‌స్టేషన్ కాంట్రాక్టర్లు రాజకీయపార్టీలకు అనుసంధానంగా ఉండడం వల్ల విద్యుత్ పంపిణీ(ట్రాన్స్‌మిషన్) వ్యవస్థకు అడ్డంకులు కలిగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. సీమాంవూధలోని విజయవాడ, నెల్లూరు, కడప జిల్లాల్లోని పెద్ద సబ్‌స్టేషన్లు అన్నీ దాదాపుగా రాజకీయపార్టీలకు చెందిన కార్యకర్తల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయాయి. దీంతో సబ్‌స్టేషన్లలోని అన్ని ఫీడర్లను నిలిపివేసి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంటకాలు కలిగిస్తున్న విషయాన్ని ట్రాన్స్‌కో యంత్రాంగం నిర్ధారిస్తున్నది.

నాడు సకల జనుల సమ్మెలో....

కరెంటు బిల్లుల వసూళ్ళను మాత్రమే నిలిపివేశారు.
-విద్యుత్ పంపిణీ, సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు సహకరించారు.
-జనరేటింగ్ స్టేషన్లలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు సకల జనుల సమ్మె సమయంలో ఏ ఒక్కరోజూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగించలేదు.
-సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లు సామర్థ్ధ్యానికి మించి రోజుకు 2,300మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాయి.
-సింగరేణి కార్మికులు భాగస్వామ్యం వల్ల సకల జనుల సమ్మె కాలంలో బొగ్గు ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. బొగ్గు సరఫరా జరగలేదు.
-వ్యవసాయరంగానికి అరగంటపాటు అధిక విద్యుత్ సరఫరా అందించారు.


నేడు సీమాంధ్ర సమ్మెలో....
విద్యుత్ ఉద్యోగులు నిరోధిస్తున్నారు.
-విద్యుత్ ఇంజనీర్లు విధులకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తంచేస్తున్నా స్థానిక రాజకీయశక్తులు వారిని అడ్డుకుంటున్నాయి.
-నేడు విజయవాడ, కడపలోని పవర్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద పారా మిలటరీ బలగాలు కాదు కదా, స్పెషల్ పోలీసు బలగాల రక్షణ కూడా లేదు.
-విధులు నిర్వహించేందుకు ముందుకు వచ్చే విద్యుత్ ఉద్యోగులకు రక్షణ కల్పించలేని పరిస్థితులున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి