18, అక్టోబర్ 2013, శుక్రవారం

నేను సంతకం చేయ..!

Sakshi | Updated: October 18, 2013 04:56 (IST)
నేను సంతకం చేయ..!
పోలవరం ఫైల్‌పై సంతకం పెట్టేందుకు మంత్రి సుదర్శన్‌రెడ్డి విముఖత... తెలంగాణవాదుల నుంచి విమర్శలు వస్తాయనే !
చేసేది లేక మరో ఫైలు రూపొందించిన అధికారులు దాన్ని నేరుగా సీఎం వద్దకు పంపిన వైనం
 

 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం అప్పుడే విడిపోయిందా? మంత్రుల తీరు చూస్తే.. ఈ అనుమానమే కలుగుతోంది. ఒక ప్రాంతానికి చెందిన మంత్రి మరో ప్రాంతానికి సంబంధించిన ఫైల్‌పై సంతకాలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తీరు ఇలాగే ఉంది. ఆయన వ్యవహార శైలి అధికారులను నివ్వెరపాటుకు గురి చేసింది. పోలవరంపై కీలక నిర్ణయం తీసుకునే ఫైల్‌పై నెలల తరబడి సంతకం చేయకుండా మంత్రి తొక్కి పెట్టారు. ఈ ఫైల్ సంతకం చేస్తే... తెలంగాణవాదుల నుంచి తనపై విమర్శలు వస్తాయని భావిస్తున్న మంత్రి ఆ ఫైల్‌ను తొక్కి పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఫైల్‌కు సమాంతరంగా మరో ఫైల్‌ను తయారు చేశారు. దాన్ని మంత్రికి పంపకుండా నేరుగా ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించారు.

 ఏమిటా ఫైలు..?: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. దీనిపై అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం మూడు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఇందులో పక్క రాష్ట్రాలు కొన్ని డిమాండ్లను మన రాష్ర్టం ముందుంచాయి. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పేర్కొన్నారు.

 ఈ పనులన్నింటిని మన రాష్ట్రమే చేయాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్రానికి ప్రత్యేక నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నివేదిక అందజేస్తేనే.. పోలవరానికి ఇచ్చే జాతీయ హోదాపై కేంద్రం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఇంతటి ముఖ్యమైన విషయం కావడంతో అధికారులు ప్రత్యేక ఫైల్‌ను రూపొందించి అనుమతి కోసం మంత్రి సుదర్శన్‌రెడ్డికి పంపించారు.
అయితే ఆయన ఫైల్‌పై సంతకం చేయకుండా పక్కన పెట్టారు. కేంద్రానికి నివేదిక పంపించే గడువు ముగుస్తున్నా... మంత్రి వద్ద ఫైల్ క్లియర్ కాకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫైల్ పెండింగ్ ఉందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఫైల్‌పై సంతకం పెట్టే ఉద్దేశం మంత్రికి లేదని ఆయన కార్యాలయంలోని సిబ్బంది వెల్లడించారు. దాంతో ఉన్నతాధికారులు మరో ఫైల్‌ను తయారు చేసి నేరుగా  సీఎం ఆమోదానికి పంపారు. సీఎం సంతకం అయిన తర్వాత కేంద్రానికి నివేదికను పంపించారు. పోలవరం నిర్మాణాన్ని తెలంగాణలోని కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... ఫైల్‌పై సంతకం చేస్తే తెలంగాణ  వాదుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మంత్రి సంతకం చేయలేదని తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి