9, నవంబర్ 2013, శనివారం

రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? P

రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? Posted by: Garrapalli Rajashekhar Published: Saturday, November 9, 2013, 16:38 [IST] రూపాయి కష్టాలకు కారణాలు ఏమిటి? గత కొద్ది మాసాల క్రితం వరకూ రూపాయి విలువ పతనం అంశం మనదేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కాగా, గత కొంత కాలంగా రూపాయి విలువ తిరిగి కాస్తంత పుంజుకొని, నిలదొక్కుకున్నట్లుగా కనబడుతోంది. కానీ ముందు ముందు పరిస్థితి ఇలాగే స్థిమితంగా ఉంటుందని చెప్పుకోలేం. దీనికి కారణాలు అనేకం. వాటికి సంబంధించి చర్చంచే ముందర, అసలు రూపాయి విలువ ఎలా నిర్ధారించబడుతుందనే అంశాన్ని పరిశీలించాలి. 1944 నుంచి నేటి వరకూ అమెరికా కరెన్సీ అయిన డాలర్ విలువ ప్రాతిపదికగా.. అంతర్జాతీయంగా అన్ని ఇతర దేశాల కరెన్సీల విలువలను నిర్ధారిస్తున్నారు. 1944లో అమెరికాలోని బ్రెట్టన్ ఉడ్స్ అనే చోట ఈ మేరకు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారంగా- అమరెకా కరెన్సీ డాలర్‌ను బంగారంతో ముడిపెట్టారు. అంటే ఒక ఔన్స్ బంగారం (28 గ్రాములు) విలువను 35 డాలర్లుగా నిర్ధారించారు.ఈ ప్రకారంగా అమెరికా డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ముందుకు వచ్చింది. అప్పటికే(రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు నాటికి) అమెరికా ప్రపంచంలోని దేశాలలో ఆర్థిక అగ్రరాజ్యంగా ఆవిర్భవించడం దీనికి కారణం. కాబట్టి, 1944 అనంతర కాలంలో వివిధ దేశాలు తాము అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు గాను డాలర్‌ను వినియోగించాల్సిన అగత్యం ఏర్పడింది. కాగా, అమెరికా ఈ డాలర్ ఆధారిత వ్యవస్థకు నిర్వహక కర్తగా, తాను ముద్రించిన ప్రతీ డాలర్ కూ గాను- ఆ మేరకు వెనుకతట్టున బంగారాన్ని నిల్వ పెట్టాల్సి ఉంటుంది. అంటే, అది 35 డాలర్లను ముద్రిస్తే- దానికి అనుగుణంగా ఆ దేశం 28 గ్రాముల బంగారాన్ని తన వద్ద నిల్వలో చేర్చాలి. ఈ విధంగా బంగారం వెన్నుదన్నుతో అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ అయిన డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా నిలిచింది. ఇక, ఈ డాలర్ విలువ ఆధారితంగా ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ విలువలు నిర్ణయం అయ్యాయి. ఈ క్రమంలోనే నాడు (1947) భారతదేశ కరెన్సీ ఒక రూపాయి= ఒక డాలర్‌తో సమానమని నిర్ణయించారు. నాటి భారతదేశానికి ఆర్థిక పాఠవం లేకున్నా, దానికి అప్పులు కూడా లేకపోవడం వల్ల ఈ విధంగా, నాటి రూపాయి విలువ డాలర్‌తో సమానంగా నిలిచింది. కాగా 1950ల అనంతరం మనదేశంలో పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ మొదలయ్యాయి. దీని కోసం విదేశీ రుణాలు అవసరం అయ్యాయి. అలాగే 1962, 65లలో మన దేశానికి చైనా, పాకిస్థాన్ దేశాలతో యుద్ధాలు జరిగాయి. వీటి కోసమూ (ఆయుధాల కోసం) విదేశాల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 1966 నాటికి దేశీయంగా దవ్యోల్బణం కూడా తీవ్రంగా పెరగసాగింది. అంటే రూపాయి విలువ, లేదా దాని నిజ కొనుగోలు శక్తీ క్షీణించసాగాయి. దీనితో అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువను 1966లో భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగాయి. 1970ల చివర, 1980లలోని రాజకీయ అనిశ్చితి నడుమ దేశీయ కరెన్సీ విలువా, కొనుగోలు శక్తీ మరింతగా క్షీణించాయి. ఫలితంగా, 1990లో రూపాయి విలువను(డాలర్ తో) మరో దఫా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. కాగా ఈ 1966, 1990లలోని రూపాయి విలువ తగ్గింపులు, ప్రభుత్వ లేదా కేంద్ర బ్యాంకుల నిర్ణయం మేరకు జరిగాయి. 1991లో దేశంలో ఎగుమతి-దిగుమతి సంక్షోభం ఏర్పడింది. అంటే మన ఖజానాలోని విదేశీ మారకం నిల్వలు, కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే, మనదేశం తన వద్ద ఉన్న బంగారాన్ని కొంత విదేశాలకు తాకట్టు పెట్టింది. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి రుణం కోరింది. దాంతో, మనదేశంలో ఐఎంఎఫ్ షరతుల ప్రకారంగా ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. ఈ పరిణామాలలో భాగంగానే 1992లో రూపాయి విలువను- పాక్షికంగా మార్కెట్ ఆధారితంగా మార్చారు. అంటే, అనంతర కాలంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ- ప్రభుత్వాలు, బ్యాకుల మధ్యన జరిగే నిర్ణయాల మేరకు కాక, అది, మార్కెట్ లోని డిమాండ్-సరఫరాల ఆధారితంగా ఉండేదిగా మారింది. కాబట్టి, రూపాయి కూడా మార్కెట్ లో ఒక సరుకుగా పరిణామం చెందింది. ‘రూపాయి' అనే ఈ ‘సరుకుకు' డిమాండ్ బాగా ఉంటే- దాని ధర లేదా విలువ పెరుగుతాయి. లేకుంటే, అవి తగ్గుతాయి. అదీ విషయం. ఈ నేపథ్యంలోనే 2011లోనూ మరల 2013లోనూ రూపాయి విలువ కొద్ది మాసాలపాటు భారీగా క్షీణించింది. దీనికి ముందర 2002-07లో రూపాయి విలువ భారీగా పెరిగింది. రూపాయి విలువలో ఈ ఎగుడు దిగుడులకు కారణం, సమకాలీనంగా- దాని విలువ డిమాండ్- సరఫరా శక్తుల ఆధారితం కావడమే. ముందుగా, 2002-07లో రూపాయి విలువ ఎందుకు పెరిగిందో చూద్దాం. ఈ కాలంలో మనదేశీయ షేర్ మార్కెట్ సూచీలు భారీగా పెరిగాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే దీనికి కారణం. వారు ఆ డబ్బును ప్రధానంగా డాలర్ల రూపంలో తీసుకువస్తారు. కానీ మనం మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు వారికి రూపాయలు కావాలి. దీని కోసం వారు మన బ్యాంకులకూ, ఫైనాన్స్ సంస్థలకు డాలర్లను అమ్మేసి వాటి వద్ద రూపాయలను కొనుగోలు చేస్తారు. అంటే, ఇక్కడ డాలర్లను అమ్మేయడం, రూపాయలను కొనుగోలు చేయడం జరిగింది. రూపాయికి డిమాండ్ పెరగడం అనేది దీని సారాంశం. ఈ క్రమంలోనే రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 2002-07 కాలంలో పుంజుకుంది. డాలర్ విలువ తగ్గింది. కానీ, 2007 అనంతరం షేర్ మార్కెట్ సూచీలు పతనం కాసాగాయి. అంటే విదేశీ మదుపుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోసాగారు. ఈ క్రమంలో షేర్లు అమ్మేయగా వచ్చిన వచ్చిన రూపాయలను వారు తిరిగి డాలర్లుగా మార్చుకుని స్వదేశాలకు తీసుకుపో సాగారు. అంటే ఇప్పుడు రూపాయికి డిమాండ్ పతనమవుతోంది. ఈ క్రమంలోనే 2007 అనంతరకాలంలో రూపాయి విలువ పతనం కాసాగింది. అనంతరం అది పతనవేగం తగ్గి కాస్తంత స్థిరపడింది. కాగా, 2011 ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో మన షేర్ మార్కెట్ సూచీలు మరలా తీవ్రంగా పతనం కాసాగాయి. ఈ క్రమంలోనే రూపాయి విలువ కూడా 2011 డిసెంబర్ వరకు వేగంగా పడిపోతూనే ఉంది. అనంతరం అది కాస్తంత నిలదొక్కుకుంది. షేర్ మార్కెట్ పతనం కొంత మేరకు ఆగటమే దీనికి కారణం. కాగా, మరల 2011 మార్చి మాసం చివరి నుంచి రూపాయి విలువ పతనం కాసాగింది. దీనికి కారణం ఈ సారి కొంచెం భిన్నం. ఈ దఫా అమెరికా ఫెడరల్ బ్యాంకు తన దేశం ఆర్థిక వ్యవస్థకు ఇస్తోన్న(నెలవారి 85 బిలియన్ల డాలర్ల) ఉద్దీపన పథకాన్ని కుదించుకోవాలని నిర్ణయించుకోనుందనే వార్తలు రావడమే దీనికి కారణం. ఈ క్రమంలో రూపాయితోపాటుగా అంతర్జాతీయంగా దరిదాపు అన్ని దేశాల కరెన్సీలు, డాలర్ తో పోలిస్తే పతనమయ్యాయి. దీనికి కారణం సరళం. అది, ఉద్దీపన పథకంలో కోతల వలన-డాలర్ల చలామణి తగ్గే పరిస్థితి ఏర్పడడం. అంటే సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం. దీని వలన డాలర్ విలువ పుంజుకుంటుంది. ఈ వార్తలు వెలువడడంతోనే, ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీలలో ఉన్న తమ పెట్టుబడులను మదుపుదారులు డాలర్లలోకి మార్చుకో సాగారు. ఫలితంగా వివిధ దేశాల కరెన్సీలతోపాటుగా మన దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా పతనమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒక్కటుంది. అది, ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీల కంటే రూపాయి విలువ, డాలర్ తో పోలిస్తే అత్యధిక స్థాయిలో పతనమవడం. దీనికి కారణం ఏమిటి? మన కరెన్సీ అన్ని కరెన్సీల కంటే ఎందుకు బలహీనంగా ఉంది. జవాబు సులువే. అది, మనదేశీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొని ఉన్న తీవ్రమైన అంతర్గత బలహీనతలు: 1. ఎగుమతి-దిగుమతుల సమతుల్యత దెబ్బతినడం- అంటే దేశీయ ఎగుమతుల కంటే దిగుమతుల విలువ అధికంగా ఉండడం. ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపో సాగాయి. 2. మన స్థూల జాతీయోత్పత్తి (జడిపి) ఎదుగుదల రేటు(అంచనాల ప్రకారం 9శాతం ఉండాల్సింది) దారుణంగా కుదేలై 4.7-5శాతానికి పరిమితం కావడం. 3. దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీలు దారుణంగా దిగజారి పోవడం. 4. సేవారంగంలో తిరోగమనం, వ్యవసాయ రంగం పరిస్థితి గాలిలో దీపం కావడం. 5. ద్రవ్యోల్బణం విపరీతంగా అధికస్థాయిలో ఉండడం. ఈ మొత్తం అంతర్గత కారణాల వల్ల దేశీయ ఆర్థికరంగం తీవ్రంగా దెబ్బతిని ఉంది. ఈ దుస్థితికి అమెరికా ఫెడరల్ బ్యాంకు ‘నిర్ణయం' తాలూకు అంచనాలు అగ్గికి ఆజ్యంలా తోడై, రూపాయి విలువ 2013లో పతనమైంది. అనంతరం గత రెండు మాసాలుగా మరల మన రూపాయి కాస్తంత పుంజుకుంది. దీని విలువ కనిష్ట స్థాయే అయిన డాలర్ తో పోలిస్తే 68-69 రూపాయల నుంచి, నేడు మరల 61-62 రూపాయలకు చేరింది. దీనికి కారణం అమెరికా ఫెడరల్ బ్యాంకు తన ఉద్దీపన పథకాన్ని మరికొంత కాలంపాటు కొనసాగించే నిర్ణయాన్ని తీసుకోవడం. అంటే రూపాయికి నేడు కాస్తంత ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. నేడు ఈ ఉపశమన కాలంలో భారత రిజర్వు బ్యాంకు, ముందు ముందు అమెరికా ఫెడరల్ బ్యాంకు కుదించివేసిన రూపాయిని నిలకడగా ఉంచగలిగేటందుకు తీవ్రంగా ‘కృషి' చేస్తోంది. కానీ, స్థూలంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ తాలూకు సూచీలు కోలుకోకుండా, భవిష్యత్ లో కూడా రూపాయి విలువ నిలకడగా ఉండే అవకాశాలు స్వల్పం. నయా ఉదారవాదం... మార్కెట్ ఆధారిత విధానాలు... షేర్ మార్కెట్ ఆధారిత అభివృద్ధులపై మన ఆర్థిక వ్యవస్థను ఆధారపడేలా చేసిన... మన్మోహనామిక్స్ అనే ఆర్థిక సిద్ధాంతం విస్మరిస్తోన్న కఠోర వాస్తవమిది!!! - డి. పాపారావు

Read more at: http://telugu.oneindia.in/feature/columns/d-paparao-column-reasons-the-devauation-rupee-125217.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి