9, నవంబర్ 2013, శనివారం

ఉమ్మడి రాజధాని ఇలా..


0/24/2013 7:02:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (టీ మీడియా): విడిపోయాక కూడా సంసారం కొనసాగాలంటే కొంత ఇబ్బందే! రాష్ట్ర విభజన విషయంలోనూ ఇది వర్తిస్తున్నది. తెలంగాణ ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్మించాల్సి ఉంది. ఆలోపు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే ఇరు రాష్ట్రాలు తమ పాలనా వ్యవస్థలను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని నిర్వహణ ఎలా అన్న విషయంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు తీవ్ర కసరత్తులు చేసిన నిర్దిష్ట ప్రతిపాదనలను మంత్రుల బృందానికి నివేదించినట్లు తెలిసింది. ప్రధానంగా ప్రస్తుత సచివాలయాన్ని సగం సగం పంచుకునేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. సమతా బ్లాక్ నుంచి ఏ, బి, ఎల్, కే బ్లాక్‌లు సీమాంధ్ర సెక్ర డీ బ్లాక్ నుంచి హెచ్, నార్త్ హెచ్, జే బ్లాక్‌ల వరకు తెలంగాణ సెక్రట్రియేట్ నిమిత్తం కేటాయించి పరిపాలన నిర్వహించవచ్చునే విషయాన్ని రాష్ట్ర అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి సీమాంధ్రలోనే ఏర్పాటు చేయాలని, ఇప్పటికిప్పుడే వీలుకాని పరిస్థితి ఎదురైతే హైకోర్టులోని కొన్ని బ్లాక్‌లను సీమాంధ్ర హైకోర్టుకు కేటాయించవచ్చునని తెలిపింది.

హైకోర్టు విభజన సమయంలో ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం తీసుకోవాలని సూచన చేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన దాదాపు 122 ప్రధాన శాఖాధిపతి కార్యాలయాలు ఉన్నాయి. విభజనలో ఈ కార్యాలయాల్లోనే ఒకవైపు తెలంగాణకు, మరోవైపు సీమాంధ్ర రాష్ట్రాలకు కేటాయిస్తే పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు రావని కేంద్రానికి తెలియజేసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

asembly-సచివాలయం ఫిఫ్టీ ఫిఫ్టీ..
- అసెంబ్లీ కూడా సగం సగం..
- కొత్త రాజధాని కోసం ప్రతిపాదనలు
-విజయవాడ-గుంటూరు మధ్య లేదా..
- గుంటూరు-ఒంగోలు మధ్య విస్తారమైన సర్కారీ భూములు
-జీవోఎంకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక

అసెంబ్లీ పంపకాలపై..
రాష్ట్ర అసెంబ్లీని పంచే విషయంలో కూడా నిర్దిష్ట ప్రతిపాదనలు వెళ్లాయి. విభజన నేపథ్యంలో శాసనమండలి రద్దు అవుతుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అలా కాకుండా రెండు రాష్ట్రాలకు శాసనమండలిని నడపాలని నిర్ణయిస్తే ఈ మేరకు శాసనమండలిని యథాతథంగా కొనసాగిస్తారు. అసెంబ్లీ విషయంలో పాత అసెంబ్లీ భవనం ఒక రాష్ట్రానికి, కొత్త అసెంబ్లీ భవనం మరో రాష్ట్రానికి కేటాయించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సెక్ర ఉన్న దాంట్లోనే రెండు రాష్ట్రాల వ్యవహారాలు నిర్వహించేలా విభజించాలని ప్రణాళికా విభాగం కేంద్రానికి తెలిపింది.

ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనపై..
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై ఎవరికి అధికారాలు ఉండాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర నేతలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగినన్నాళ్లూ నగర పరిపాలన కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలన విషయంలో పలు నివేదికలను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. ఇందులో మొదటగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూ పరిపాలన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఉన్నత విద్య నిర్వహణ కేంద్రం చేతుల్లో ఉండటం సాంకేతికంగా సాధ్యం కాదని ప్రణాళికా విభాగం తన నివేదికలో తెలియజేసింది. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో కీలక అంశాలపై నియంవూతణ బాధ్యతలను కేంద్రం తన చేతిలోకి తీసుకున్న ఆధారాల్లేవని పేర్కొన్నారు.

ఢిల్లీలో శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ.. అది భిన్నమైన అంశంగా అధికారులు ప్రస్తావించారు. ఢిల్లీ దేశ రాజధానిగా ఉండటంతోపాటు.. 140కిపైగా దేశాల రాయబార కార్యాలయాలు, హైకమిషన్‌లు ఉన్నాయి. దీంతో అక్కడ అంతర్జాతీయ న్యాయ చట్టాలను అమలు చేయాల్సి వస్తుం ది. ఈ రీత్యానే ఢిల్లీలో శాంతి భద్రతల అంశాన్ని కేంద్రం నిర్వహిస్తున్న సంగతిని గుర్తు చేశారు. ఈ విషయంలో పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి నివేదికలు పంపారు. శాంతి భద్రతలు, భూపరిపాలనను కేంద్రం పరిధిలో ఉంచితే హైదరాబాద్‌లో ఆక్రమించిన భూములు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ వంటివాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్రమార్కులు క్రమబద్ధీకరించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన అధికారులు.. తెలంగాణకు భవిష్యత్తులో పూర్తి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూపరిపాలనను కేంద్రం పరిధిలోకి తీసుకురావడం మంచిది కాదని నివేదించారు.

ప్రత్యేక హక్కుల విషయంలో...
హైదరాబాద్‌లో నివసిస్తున్న స్థానికేతరులకు ప్రత్యేక హక్కుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్(3)లో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రుల బృందానికి ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా భారతీయులేనని తెలిపారు. భారతీయ పౌరులందరికీ దేశంలోని ఏ ప్రాంతంలోనైనే జీవించే హక్కు ఉందని తెలిపారు. ప్రజలంతా సమానులే అయినప్పటికీ వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు చెందిన ఎస్టీలకు మాత్రమే భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు కల్పించింది. ఇదే షెడ్యూల్‌లో మిగతా ఎవ్వరికీ ప్రత్యేక హక్కులు వర్తించవని విస్పష్టంగా వివరించిన విషయాన్ని కేంద్రానికి నివేదించారు.

కొత్త రాజధాని స్థల సేకరణకు ప్రతిపాదనలు
హైదరాబాద్‌లో పదేళ్లు రాజధానిని నిర్వహించుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈలోపు సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక సొంత రాజధానిని నిర్మించే విషయంలో స్థల సేకరణ, ఆర్థిక వనరుల సమీకరణపై ప్రతిపాదనలను అధికారులు మంత్రుల బృందానికి పంపించారు. సీమాంధ్ర జిల్లాల కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల వివరాలను సేకరించి పంపారు. నాలుగు ప్రాంతాలను రాజధానికి అనువైనవిగా గుర్తించారు. అందులో సీమాంధ్రలో అన్ని పాంతాలకు సమదూరంలో ఉన్న గుంటూరు, విజయవాడ నగరాల మధ్యన దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి రాజధాని నిర్మాణానికి అందుబాటులో ఉందని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి కావాల్సిన అనువైన ప్రభుత్వ స్థలం దాదాపు 20వేల ఎకరాలు ఉన్నాయని పేర్కొంది. ఇంకా భూమి కావాల్సి వస్తే సేద్యానికి అనువుగా లేని మెట్ట భూములను అత్యధిక పరిహారం చెల్లించి సేకరించవచ్చునని కేంద్రానికి తెలిపారు. ఈ ప్రాంతాలలో రాజధానిని నిర్మాణం చేస్తే నీటి సమస్యను కూడా అధిగమించ వచ్చునని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కావాల్సిన నీటిని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇప్పటికే రాయలసీమ ప్రజలు రాష్ట్ర విలీన సమయంలో తాము రాజధానిని కోల్పోయామని, తిరిగి ఆంధ్ర రాష్ట్రం పునఃనిర్మాణం అవుతున్న నేపథ్యంలో రాజధానిని కర్నూ లు నగరంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేస్తే కరువుప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు అవుతుందని, రాజధానికి నీటి సరఫరాను శ్రీశైలం ప్రాజెక్టునుంచి తీసుకోవచ్చునని కమిటీ తెలిపింది. చివరి ప్రత్యామ్నాయంగా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుల డిమాండ్ మేరకు విశాఖలో కూడా రాజధాని నిర్మాణం చేయడానికి ఉన్న అవకాశాలను కేంద్రానికి తెలిపారు. విశాఖ- అనకాపల్లి మధ్య రాజధానిని ఏర్పాటు చేయవచ్చునని, ఇది కాకుంటే ఎరవాడ కొండలను కూడా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. తుఫాన్లు వచ్చినప్పుడు విశాఖలోని ఈ ప్రాంతాలైతే సురక్షితంగా ఉంటాయని తెలిపారు. కానీ ఈ ప్రాంతం రాయలసీమ ప్రజలకు దూరం అవుతుందని ప్రస్తావించారు. రాజధాని నగరం కోసం చేసే నిర్మాణాలను ఏవిధంగా చేపట్టాలనే విషయంపై ఇప్పటికే వివిధ కొత్త రాష్ట్రాలలో నిర్మాణం జరిగిన నూతన రాజధానులను ఒక ఉన్నత స్థాయి కమిటీవేసి అధ్యయనం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులను ఏవిధంగా సమీకరించాలనే అంశంపై కూడా కేంద్రానికి ప్రణాళికా విభాగం నివేదించింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్రంతో పాటు, కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయం, ప్యాకేజీలను అంచనావేసి ఇవ్వాలని నివేదికలో కేంద్రానికి తెలియజేసింది.


సీమాంధ్ర రాజధాని నిర్వహణపై..
ప్రస్తుతం కార్యాలయాలు ఉన్న భవనాలనే రెండు రాష్ట్రాలకు పంచాలనే విధానం ప్రకారం పంపకాలు ఏవిధంగా చేయవచ్చునో కేంద్రానికి తెలిపిన అధికార వర్గాలు, అది సాధ్యం కాకపోతే హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏవిధంగా కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చునో కూడా ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఒక సర్వే కూడా నిర్వహించి సీమాంధ్ర రాజధాని కార్యాలయాల నిర్వహణకు అనువైన బంగళాలు ఏమేమున్నాయో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ భవనాల విస్తీర్ణం, ప్రస్తుతం వాటిల్లో కొనసాగుతున్న కార్యాలయాలు, ఉద్యోగుల సంఖ్యను కూడా నివేదిక రూపంలో పంపించింది. ఈ విధంగా చూస్తే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగే అన్ని వసతులు ఉన్న భవనాలుగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం, తొమ్మిదవ నంబర్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని సరూర్‌నగర్‌లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్‌కు చెందిన అతిపెద్ద భవనం, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌తో పాటు నాంపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనాలు అనువుగా ఉన్నాయని గుర్తించారు. ఈ సమాచారాన్నంతా మంత్రుల బృందానికి నివేదించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి