- 30/03/2012
TAGS:
హైదరాబాద్,
మార్చి 29: రాష్ట్రంలో భూముల పంపిణీలో జరుగుతున్న అక్రమాలు, అనవసర లబ్ధిపై
కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్రంగా ఆక్షేపించింది. వేల కోట్ల
రూపాయల మేర లబ్ధిదారులకు అనుచిత లబ్ధిని అందించినట్లు విమర్శించింది.
ఎన్నిసార్లు ఆక్షేపించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అక్షింతలు వేసింది.
2006 నుంచి 2011 వరకు జరిగిన భూపందేరంలో తనిఖీ చేసిన కొన్ని అంశాల్లోనే
ఏకంగా 1750 కోట్ల రూపాయల వరకు అనుచిత లబ్ధి అందించినట్లు, ఈ మేరకు ఖజానాకు
రావలసిన నిధులు నష్టపోయినట్లు ప్రకటించింది. కాగ్ నివేదికలను గురువారం
శాసనసభ ముందు ప్రభుత్వం ఉంచింది. ఇందులో అనేక అంశాలపై తీవ్రంగా విమర్శలు
చేసిన కాగ్ భూముల పంపిణీపై ప్రత్యేక నివేదికనే తయారుచేసింది. భూ
కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదని, ప్రజా ప్రయోజనాలను రక్షించే విధంగా
చర్యలు చేపట్టలేదని, ఏకరీతి విధానాన్ని కూడా పట్టించుకోలేదని కాగ్
విమర్శించింది. ప్రధానంగా వివిధ పరిశ్రమలకు అందించిన భూముల్లో సక్రమమైన
విధానాన్ని పాటించలేదని కాగ్ ఆక్షేపించింది. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తులో
భాగంగా దర్యాప్తు జరుగుతున్న అనేక సంస్థలకు గతంలో ఇచ్చిన భూమి సక్రమంగా
అందించలేదని కూడా ప్రకటించింది. బ్రహ్మణి, వాన్‌పిక్, ఓబుళాపురం మైనింగ్
సంస్థ, రహేజా, బళ్లారి ఐరన్ ఓర్ వంటి అనేక సంస్థలకు ఇచ్చిన భూములపై కాగ్
విమర్శలు గుప్పించింది. దాదాపు ఈ సంస్థలన్నీ నేడు సిబిఐ దర్యాప్తును
ఎదుర్కొంటున్నవే కావడం గమనార్హం.కడప జిల్లాలో వాణిజ్య విమానాశ్రయం, ఫ్లయింగ్ అకాడమీలను ఏర్పాటుచేసేందుకు బ్రహ్మణి సంస్థకు 3,115 ఎకరాల భూమిని కేటాయించారని, అయితే కేంద్ర విధానాలను, స్థల అనుకూలత, ప్రాజెక్టు మనుగడను పరిగణనలోకి తీసుకోకుండా విమానాశ్రయానికి భూమిని కేటాయించారని కాగ్ పేర్కొంది. కడప విమానాశ్రయం నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత విమానాశ్రయం ఉందన్నది కూడా విస్మరించారని కాగ్ ఆక్షేపించింది. అలాగే కడప జిల్లాలోనే గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు బ్రహ్మణి సంస్థకే 10.760 ఎకరాల భూమిని కేటాయించడాన్ని కూడా కాగ్ తప్పు పట్టింది. ఇందులో 674 ఎకరాల జలాశయ భూములు కూడా ఉన్నాయని, పర్యావరణ అనుమతులు లేకుండా ఈ భూమిని కేటాయించడాన్ని కాగ్ తప్పుపట్టింది. అలాగే ప్రాజెక్టు రిపోర్టును అధ్యయనం చేయకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా గండికోట రిజర్వాయర్ నుంచి బ్రహ్మణికి రెండు టిఎంసిల నీటిని కేటాయించడాన్ని కూడా ఆక్షేపించింది.అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థకు 8844 ఎకరాల భూమిని కేటాయించడం, అక్కడ ఎటువంటి పరిశ్రమ స్థాపించకుండానే ఎకంగా ఆ సంస్థ 4397 ఎకరాల భూమిని బాంకులో తాకట్టు పెట్టి 790 కోట్లు రుణాన్ని తీసుకోవడాన్ని కూడా కాగ్ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఓబుళాపురం మైనింగ్ సంస్థ 413 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకోగా, 2008లో కలెక్టర్ దీనిని నిరాకరించారు. అయితే ఒక నెల కాలంలోనే ఎపిఐఐసి విజ్ఞప్తి మేరకు 304 ఎకరాల భూమిని ఓఎంసికి అప్పగించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా కాగ్ తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లాలోని ఐదొందల ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే టెక్‌జోన్, బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌లకు కేటాయించడంపై విమర్శలు చేసింది. వాన్‌పిక్‌కు కేటాయించిన భూముల్లో పారదర్శకత లోపించిందని, ఇందులో ఒప్పందాలు వాన్‌పిక్‌కే అనుకూలంగా ఉండడం చూస్తే ప్రభుత్వానికి న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నట్లు కాగ్ పేర్కొంది. ఇక రహేజా ఐటి సంస్థకు ఇచ్చిన భూమిలో 110 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు, తనఖా పెట్టుకునేందుకు ఆస్కారం కల్పించేలా ఒప్పందం ఉండడం కూడా ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు కల్పించేదేనని కాగ్ పేర్కొంది.
అంతర్జాతీయ కనె్వన్షన్ సెంటర్, స్టార్ హోటల్, గోల్ఫ్ కోర్సు, ఇతర టౌన్‌షిప్‌లతో ఒక విస్తృత ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ఎమ్మార్ సంస్థకు 535 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, అయితే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసే హక్కులను సహ సంస్థలకు ధారాదత్తం చేయడం వల్ల ఆ భూములపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోవాల్సి వచ్చిందని కాగ్ ఆరోపించింది. ఇక అనంతపురం జిల్లాలో 20 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బళ్లారి ఐరన్ ఓర్ సంస్థపై అక్కడి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, మరో 5069 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించారని కాగ్ ధ్వజమెత్తింది.
ఇక వివిధ సంస్థలకు, పరిశ్రమలకు భూములను అందించేందుకు ఏర్పాటైన ఐపిఐఐసి తీరుపైనా కాగ్ విమర్శలు చేసింది. ఈ సంస్థ తీరు లక్ష్యిత పారిశ్రామికీకరణకు, ప్రభుత్వానికి ఎటువంటి తోడ్పాటు అందించలేదని ఆరోపించింది. భూముల వినియోగాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షించడంలో ఎపిఐఐసి వైఫల్యం కారణంగా ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు కాగ్ ధ్వజమెత్తింది. సెజ్‌ల అభివృద్ధి కోసం కేటాయించిన భూములు కూడా లక్ష్యాన్ని అధిగమించలేకపోయినట్లు కాగ్ పేర్కొంది. 11 సెజ్‌ల ద్వారా 5.93 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ అందులో నాలుగు సెజ్‌లు ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని, మరో ఏడు సెజ్‌లు కేవలం 26 వేల ఉద్యోగాలను ల్పించాయని కాగ్ విమర్శించింది.
ఇలా ఉండగా, ఇకపై భూముల కేటాయింపులో నిర్దిష్ట విధానాలను అవలంబించాలని కాగ్ సూచించింది. విచక్షణాధికారాలతో భూములను పంపిణీ చేసేందుకు అవకాశాలు ఇవ్వరాదని సూచించింది. వినియోగదారుల నుంచి వాణిజ్య రీతిలో ఫీజులను వసూలు చేసే ఆసుపత్రులు, విద్యా సంస్థలకు రాయితీలతో కాకుండా మార్కెట్ ధరలకే భూములు కేటాయించాలని హితవుపలికింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి