- -శశిథరూర్
- 19/03/2012
TAGS:
ఇరవయ్యొకటవ
శతాబ్దపు ద్వితీయార్థంలో ప్రపంచంలో మరింత ఎక్కువ పాత్ర వహించాలని భారత్
కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు సంప్రదాయంగా పొరుగు దేశాలకే పరిమితంగా
ఉన్న తన వ్యవహారశైలిని మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ
నేపథ్యంలో మనదేశ దృష్టిని ఇప్పుడిప్పుడే ఆకర్షిస్తున్నవి లాటిన్ అమెరికా
దేశాలు!లాటిన్ అమెరికా ఎంతోకాలంగా భారత్ స్మృతిపథంలో లేదనే చెప్పాలి. ఒకవేళ సంబంధాలపై శ్రద్ధ చూపివున్నట్లయితే, రెండు ప్రాంతాల్లో ఉన్న సారూప్యతను ఇప్పటికే తప్పనిసరిగా గుర్తించి ఉండేది. కానీ రెండు దేశాలను దూరం చేస్తున్నవి కేవలం రెండు అంశాలు మాత్రమే. ఒకటి దూరం, రెండవది భాష! మొత్తం ఐదువందల మిలియన్ల జనాభాతోపాటు 4.9 ట్రిలియన్ డాలర్ల స్థూలజాతీయోత్పత్తి(మనదేశంకంటే నాలుగురెట్లు ఎక్కువ), ప్రపంచ వాణిజ్యంలో ఆరుశాతం భాగస్వామ్యం కలిగిన లాటిన్ అమెరికా, భారత విధాన నిర్ణేతలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేని దేశమని చెప్పాలి. దేశ విస్తీర్ణం 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు. రష్యా, కెనడాలకంటే ఈ వైశాల్యం అధికం మాత్రమే కాదు, సుసంపన్నమైన జీవవైవిధ్యం, భూమిపైనే అత్యధిక మంచినీటి నిల్వలు కలిగిన ఖండం కూడా! సుస్థిర ప్రజాస్వామ్యం, శాంతి సుస్థిరతలు లాటిన్ అమెరికా దేశాల్లోని చాలావాటిల్లో కొనసాగుతున్నాయి.గత దశాబ్దంలో ప్రపంచం మొత్తం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడినా, లాటిన్ అమెరికా మాత్రం సగటున ఐదుశాతం ఆర్థిక ప్రగతిని చూపుతూ ప్రగతిపథంలో పయనించడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం. 2010లో 6.1శాతం , 2011లో 4.5 శాతం ఆర్థిక ప్రగతిని సాధించింది. ప్రగతిసాధనలో లాటిన్ అమెరికా సాధిస్తున్న విజయాలు నిజంగా చెప్పాలంటే, అభివృద్ధిలో భారత్‌కు గట్టి ప్రత్యర్థిగా నిలబడే అవకాశాలు కల్పిస్తున్నాయనే చెప్పాలి. అంతే కాదు ఆధునిక సమాచార యుగంలో, భౌగోళికత మాత్రమే చరిత్రకు హామీ ఇస్తున్న నేపథ్యంలో లాటిన్ అమెరికా ప్రాధాన్యత విస్మరించలేనిది.
ప్రస్తుతం పోకడలు ఎంతోప్రోత్సాహకరంగా ఉన్నాయి. భారత్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల మధ్య వాణిజ్యం, 2000 నుంచి 2010 వరకు తొమ్మిదిరెట్లు వృద్ధి చెంది, 21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరి ఈ వర్తకంలో పాలు పంచుకుంటున్న దేశాల సంఖ్యను పరిశీలిస్తే, ఈ సంఖ్య పెద్ద గొప్పదేమీ కాదు. చిలీ దేశానికి చెందిన విద్యావేత్త, దౌత్యవేత్త కూడా అయిన జార్జి హైనీ మాటల్లో చెప్పాలంటే, ‘సరికొత్త లాటిన్ అమెరికా, భారత్‌తో తన వాణిజ్య సంబంధాలను మరింతగా దృఢతరం చేసుకొనే దిశగా పయనిస్తోంది.’ స్థూల ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య నిర్వహణ, సరియైన రీతిలో ఆర్థిక మరియు బ్యాంకింగ్ వ్యవస్థల పర్యవేక్షణ, సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాల అమల్లో లాటిన్ అమెరికా ఎంతో ముందంజలో ఉండగా, పొదుపు, పెట్టుబడుల రేటు అధికమొత్తంలో కలిగివుండి వేగంగా విస్తరిస్తున్న బలీయమైన మధ్యతరగతి కలిగిన దేశం భారత్ అంటూ ఆయన అభివర్ణించారు. లాటిన్ అమెరికానుంచి మనదేశం చేసుకొనే దిగుమతుల్లో చాలావరకు ప్రకృతిసిద్ధమైన వనరులనుంచి జరిపే ఉత్పత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇదే సమయంలో భారత్ నుంచి చేసుకొనేవి సాధారణ వస్తువుల కంటే భిన్నంగా ఉంటున్నాయి. అదే చైనా ఎగుమతులు లాటిన్ అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతున్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇవి స్థానిక ఉత్పత్తి దారులు అమ్మే వస్తువుల ధరలకంటే చాలా తక్కువ ఖరీదుకే లభ్యమవుతుండటంతో..వారు చైనా నుంచి ఎదురయ్యే పోటీని ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితి నెలకొనివుంది. ఇదే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో కనీసం సగభాగమైనా అక్కడి పరిశ్రమలు, తమ ఉత్పత్తులను సంగం ధరకే ఉత్పత్తి చేయడానికి సహాయపడేవిగా ఉంటున్నాయి. అంతేకాదు ప్రపంచ మార్కెట్లో అవి గట్టి పోటీ ఇవ్వడానికి కూడా అనువుగా ఉంటున్నాయడంలో ఏమాత్రం సందేహంలేదు. అయితే ఇక్కడ విచారించాల్సిన అంశమేమంటే..ఈ వర్తకం లాటిన్ అమెరికాకు పూర్తి ప్రతికూలంగా పరిణమించడం. ముఖ్యంగా వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తూ, బయటినుంచి పూర్తిగా తయారైన వస్తువులను దిగుమతి చేసుకొనేదిగా లాటిన్ అమెరికాను ఈ వర్తకం మార్చివేసింది. ఒకదశలో ఇది అక్కడ పారిశ్రామీకరణను నిరోధించడానికి కూడా దారి తీయవచ్చు.
2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే లాటిన్ అమెరికా దేశాల్లో భారత పెట్టుబడులు బాగా విస్తరించాయనే చెప్పాలి. ప్రస్తుతం అవి 12 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. మనదేశానికి చెందిన ఒఎన్‌జిసి విదేశ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), విప్రో వంటి ఐటి దిగ్గజాలు ఇప్పుడే లాటిన్ అమెరికాలో అడుగుపెట్టాయి. భారతీయ పెట్టుబడులు, భిన్న రంగాల్లో లాటిన్ అమెరికా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వివిధ వస్తువులకోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ నుంచి చిన్న స్థాయి పెట్టుబడులు కూడా క్రమంగా అక్కడికి ప్రవేశాన్ని పొందుతుండటం విశేషం. మనదేశానికి చెందిన ఒక సిక్కు యువకుడు బొగొటాలో ఆయుర్వేద ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారతీయ ప్రత్యామ్నాయ ఆరోగ్య వ్యవస్థను ఇక్కడ ఆయన పరిచయం చేస్తున్నాడు. అంతేకాదు, అత్యంత సారవంతమైన, మంచి నీటివనరు కలిగిన భూమి కోసం భారత్ ఎంతగానో ఎదురుచూస్తున్నది. సరీగ్గా మనదేశం కోరుకుంటున్న భూములు లాటిన్ అమెరికా దేశాల్లో పుష్కలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తిని మరింతగా పెంచడానికి ఈ భూములు ఎంతో ఉపయోగకరం.
ఇక్కడ అభివృద్ధి చెందడానికి అనువైనవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఐటి సేవారంగాలు. ప్రపంచ మార్కెట్లో భారత్ గుర్తింపు తెచ్చుకున్నది కేవలం ఈ రంగాల ద్వారానే! భారతీయ ఐటి కంపెనీలను ఇక్కడ వ్యవస్థాపించి, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన యువకులకు ఈ రంగంలో తగిన శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం.. ప్రపంచ మార్కెట్లో వీరికి ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయడం ద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి దోహదం చేయవచ్చు. ప్రపంచంలో లాటిన్ అమెరికా దేశాలకు తగిన గుర్తింపును తీసుకొని రావడానికి, భారత్ ఐటి రంగం ఎంతగానో దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించడం వల్ల, దౌత్య సంబంధాలకు కూడా మంచి ప్రోత్సాహం లభించింది. న్యూఢిల్లీలో లాటిన్ అమెరికా దేశాలకుచెందిన 19 దౌత్యకార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ అక్కడ 14 వరకు దౌత్య కార్యాలయాలు నెలకొల్పింది. 2002లో ఎల్‌ఎసి దేశాలకు చెందినవి కేవలం 12 దౌత్యకార్యాలయాలు మాత్రమే న్యూఢిల్లీలో ఉండేవి. అదేవిధంగా మనదేశానికి చెందిన ఏడు దౌత్యకార్యాలయాలు అక్కడ పనిచేసేవి. 2010లో భారత్ గ్వాటెమాలాలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. కేవలం మధ్య అమెరికా ప్రాంతంతో సంబంధాల మెరుగు కోసం దీన్ని ఏర్పాటు చేసారు. అయితే ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్ దేశాల్లో ఇంకా మనదేశ రాయబార కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ముఖ్యంగా మానవ వనరుల కొరత కారణంగానే ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఐఎఫ్‌ఎస్ సిబ్బిందికి స్పానిష్ భాషను నేర్పడంలో తగిన శ్రద్ధ వహించకపోవడం, వల్ల చాలా తక్కువమంది దౌత్యవేత్తలు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. లాటిన్ అమెరికా దేశాలతో పరస్పరం లోతైన సంబంధాలను నెలకొల్పుకోవాలంటే, అక్కడి భాషలో ప్రావీణ్యతను సంపాదించడమొక్కటే మార్గం.
గత దశాబ్దకాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఎల్‌ఎసి-్భరత్‌ల మధ్య సంబంధాల్లో చాలా సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయన్న సంగతి అవగతమవుతుంది. ప్రస్తుతం ఇండియా-ఎల్‌ఎసిల మధ్య కొనసాగుతున్న వర్తకం, ఈ ప్రాంతంలో భారత పెట్టుబడులు ఒక మాదిరి స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఇవి భవిష్యత్ పోకడలకు మార్గదర్శకం వహించనున్నాయనే చెప్పాలి. రెండు వైపులా ప్రస్తుతం కొనసాగుతున్న విధాన నిర్ణేతల రాకపోకలు మరింత వేగం పుంజుకోవాల్సి వుంది. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాలను మరింత విస్తృత ప్రాతిపదికన నిర్మిస్తూ కొనసాగాలి.
దక్షిణాది దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని భావన యొక్క పరిణామ రూపానికి, ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా భారత్-ఎల్‌ఎసిల మధ్య సంబంధాలను అభివర్ణించవచ్చు. సరికొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమం (ఎన్‌ఐఇఓ)లో సార్వభౌమత్వ భావనను రెండు ప్రాంతాలు ఆమోదించడమే కాకుండా, అభివృద్ధి చెందిన దేశాలనుంచి మరింత పెద్దమొత్తంలో వనరుల బదిలీ జరగాలని ఎలుగెత్తి చాటిన నేపథ్యంలో.. స్వదేశీయ ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధికి శక్తి ఇంధనాలుగా మార్పిడి చెందడం ఇక్కడ గమనార్హం.సామ్యవాదానికి సంబంధించిన ప్రతిధ్వనులు, లాటిన్ అమెరికా దేశాలకంటే భారత్‌లోనే ఎక్కువకాలం కొనసాగిన నేపథ్యంలో, ఇప్పటి వరకు ఆ దేశాల్లో అనే్వషించని ప్రాంతాల్లో ప్రవేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవిధంగా అనే్వషణలను కొనసాగించడం ద్వారా ఇప్పటి వరకు ‘మరచిపోయిన ఖండం’ ఇక ముందు ‘అవకాశాలు పుష్కలంగా ఉన్న ఖండం’గా మారిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అది సాధించాలంటే ఒక విస్పష్టమైన దృక్కోణం, న్యూఢిల్లీలోని అత్యున్నత స్థాయినుంచి సహకారం ఎంతో అవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి