29, మార్చి 2012, గురువారం

బానిసకొక బానిసకొక బానిస ఆఫ్ఘన్ మహిళ

తాలిబాన్ మత ఛాందస ప్రభుత్వ అణచివేత నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేస్తామని బీరాలు పలికిన అమెరికా, తన పదేళ్ళ దురాక్రమణలో సాధించిందేమీ లేదని మానవ హక్కుల సంస్ధ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక వెల్లడించింది. కుటుంబ హింస భరించలేక ఇంటి నుండి పారిపోయినా, భర్త అనుమానంతో పదే, పదే స్క్రూ డ్రైవర్ తో కుళ్ళ బొడిచినా ‘నైతిక నేరానికి’ పాల్పడ్డారంటూ మళ్ళీ స్త్రీలనే ఆఫ్ఘన్ ప్రభుత్వం జైళ్ళలో పెడుతున్నదని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తెలిపింది. ఎన్ని హింసలు పెడుతున్నా “పారిపోవడమే” నేరంగా పరిగణిస్తున్న ఆఫ్ఘన్ సమాజంలో బాధిత స్త్రీలే నేరస్ధులుగా జైలు పాలవుతున్నారని నివేదిక వెల్లడించింది.
వివాహానికి ఆవల లైంగిక సంబంధం ఉండడం సహించరాని నేరం కావడంతో రేప్ కి గురవుతున్న స్త్రీలను సైతం ఆఫ్ఘన్ చట్టాలు జైలు పాలు చేస్తున్నాయి. శారీరకంగా బలహీనులైన స్త్రీలను బలవంతంగా చెరబట్టినా వ్యభిచారంగా ఆఫ్ఘన్ చట్టాలు పరిగణిస్తున్నాయి. బలవంతపు అపహరణ, రేప్, బలవంతపు వివాహాలు లాంటి పలు నేరాలకు గురవుతున్న మహిళలు న్యాయం పొందడానికి బదులు నేరస్ధులుగా న్యాయస్ధానాలలో ముద్ర పడి జైళ్ళలో బతుకులు వెళ్లదీస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ ని అమెరికా దురాక్రమించి పదేళ్ళు గడిచాయి. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధ్యక్షుడయిన హామీద్ కర్జాయ్ సారధ్యంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందనీ, కొత్త రాజ్యాంగం స్త్రీల సమానత్వాన్ని గ్యారంటీ చేసిందనీ, తాలిబాన్ కబంద హస్తాలనుండి ఆఫ్ఘన్ స్త్రీని విముక్తం చేశాననీ చెప్పుకుంటున్న అమెరికా ప్రచారం పరమ అబద్ధమని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తేటతెల్లం చేసింది.
 
బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టబడిన అమీనా కి కేవలం 17 సంవత్సరాలు. స్త్రీ సమానాత్వాన్ని ప్రభోదించే రాజ్యాంగం నీడలో విముక్తి పొంది స్వేచ్చా గాలులు పీల్చవలసిన అమీనా నెలల పాటు జైలు శిక్షలో మగ్గినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ కార్యకర్తలతో తెలిపింది. రేప్, బలవంతపు వ్యభిచారం లాంటి ‘నైతిక నేరాలకు’ పాల్పడిన కేసుల్లో 400 కు పైగా మహిళలు జైళ్ళలో ఉన్నారని అమెరికా మానవ హక్కుల సంస్ధ తయారు చేసిన నివేదిక తెలిపింది. ప్రభుత్వం నుండి గానీ, న్యాయ వ్యవస్ధ నుండి గానీ వీరికి ఏ మాత్రం సాయం అందకపోగా, స్త్రీ పక్ష పాత రాజ్యాంగం చేతిలో మరింత అణచివేతకు గురయ్యారు. ఇంటి నుండి పారిపోయిన స్త్రీలు సమీప బంధువు దగ్గరికో, పోలీసు దగ్గరికో వెళ్లకపోతే వారిని వెంటనే జైళ్ళలో పెట్టాలని ఆఫ్ఘన్ సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చాక మహిళలను జైళ్ళలో పెట్టడం బాగా పెరిగిందని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక వెల్లడించింది. రేప్ కి గురయిన స్త్రీలు, బలవంతంగా వ్యభిచార గృహాలకు చేరిన మహిళలపైన ‘వివాహేతర సంబంధం’ నేరారోపణతో జైలు పాలయ్యారని తెలిపింది.
నీలోఫర్ అనే మహిళను ఆమె భర్త అనుమానంతో స్క్రూ డ్రైవర్ తో ఒంటి నిండా విచక్షణా రహితంగా పొడిచేశాడు. తలలో, ఛాతీలో, చేతులపైనా ఎక్కడంటే అక్కడ పొడిచాడు. ఇంటి బయట నిలబడ్డ పురుషుడొకరిని కూర్చోమంటూ ఇంటిలోకి ఆహ్వానించడమే ఆమె చేసిన నేరం. ఆఫ్ఘన్ సమాజంలో, భర్తకు అనుమానం వస్తే అది కూడా వ్యభిచారమే. వళ్ళంతా గాయాలతో నిండిన నీలోఫర్ ని ప్రభుత్వం అరెస్టు చేసింది, గాయాలు చేసిన ఆమె భర్తను వదిలి పెట్టింది. భర్త చేసిన అమానుష దాడిలో నీలోఫర్ చనిపోలేదు గనక, కనీసం చావుకు దగ్గరగానైనా వెళ్లలేదు గనక అతను నేరస్ధుడు కాదట.  నీలోఫర్ ను గాయపరిచిన తీరు జైలులో ఉంచదగినంత నేరంగా చట్టానికి కనిపించలేదు. అలాగని కేసులో వాదించిన ప్రాసిక్యూటరే స్వయంగా చెప్పాడని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
“నైతిక నేరాలకు పాల్పడ్డారంటూ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్ధితి తాలిబాన్-అనంతర ఆఫ్ఘన్ ప్రభుత్వమూ, దాన్ని సమర్ధిస్తున్న అంతర్జాతీయ మద్దతుదారుల మొఖాలపై మాయని మచ్చ. మహిళల హక్కుల ను గుర్తించడంలో, సమాన హక్కులను అమలు చేయడంలో తాము తాలిబాన్ ప్రభుత్వం కన్నా విభిన్నంగా ఉంటామని వీరు హామీలు కురిపించారు” అని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది. “మహిళల హక్కుల విషయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఏ నాడూ స్ధిరంగా లేడు. ప్రతి సారీ నిర్ణయాలు మార్చుకున్నాడు. దేశంలోని మత ఛాందస శక్తులకు లొంగిపోయి హామీలు గాలికొదిలేశాడు” అని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక కర్జాయ్ ని తూర్పారబట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో జరిగే వివాహాలలో మూడొంతులు బలవంతపు వివాహాలేనని ఐక్య రాజ్య సమితి అంచనా వేసిందని ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. వివాదాలు పరిష్కరించుకోవడానికీ, కట్నాల చేలించడానికీ మహిళలను ఇచ్చేయడం, మార్చుకోవడం జరుగుతోందని ఆ పత్రిక తెలిపింది.
హింస నుండి పారిపోయి తమను తాము రక్షించుకోవడానికి ఆఫ్ఘన్ స్త్రీలకు ఎటువంటి సౌకర్యాలూ అందుబాటులో లేవు. బాల్య వివాహాల నుండీ, బలవంతపు వివాహాల నుండీ, పెళ్ళిళ్ళ కోసం, వివాదాల పరిష్కారం కోసం సాగే అమ్మకమూ కొనుగోళ్ల నుండీ, బలవంతపు ‘ఆత్మ త్యాగాల’ నుండీ పారిపోవడానికి, రక్షణ పొందడానికీ ఆఫ్ఘన్ ప్రజాస్వామ్యం ఏ చట్టమూ చేయలేకపోయింది. అదే ప్రజాస్వామ్యం నైతిక నేరాలకు మహిళలను శిక్షించడానికి చేసిన చట్టాలకు కొదవ లేదు. తాము చేయని ‘నైతిక నేరాలకు’ జైలు శిక్ష అనుభవించి విడుదలయిన స్త్రీల పరిస్ధితి కడు దుర్భరం. ఇంటి గౌరవానికి మచ్చ తెచ్చినందుకు ‘పరువు హత్య’లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. భర్త హింసను భరించలేక పారిపోయినందుకు మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన 20 యేళ్ళ ఆషా హ్యూమన్ రైట్స్ వాచ్ కి అదే చెప్పింది. “నాకు విడాకులు కావాలి. మా నాన్న దగ్గరికి కూడా నేను వెళ్లలేను. ఎందుకంటే ఆయన నన్ను చంపేస్తాడు. మా కుటుంబం అంతా నన్ను వదిలేసింది” అని ఆషా మానవ హక్కుల కార్యకర్తలతో చెప్పింది.
“బానిసకొక బానిసవోయ్ బానిసా” అని భారతీయ శ్రామిక మహిళనుద్దేశించి శ్రీశ్రీ అన్నాడు. అమెరికా కింద బానిసలు ఆఫ్ఘన్ పాలకవర్గం. వారి కింద బానిసలు ఆఫ్ఘన్ ప్రజలు. వారికింద బానిసలు ఆఫ్ఘన్ మహిళలు. “బానిసకొక బానిసకొక బానిస ఆఫ్ఘన్ మహిళ”.
ఆఫ్ఘనిస్ధాన్ పైన రెండు డజన్ల దేశాలు మూకుమ్మడిగా దురాక్రమణ చేయడానికి చెప్పిన కారణాలలో ‘ఆఫ్ఘన్ స్త్రీలను తాలిబాన్ నుండి విముక్తి చేయడం’ ముఖ్యమయినది. ఆ కారణమే చెబుతూ తాలిబాన్ ప్రభుత్వాన్ని న్యాయమైన ప్రభుత్వంగా గుర్తించడానికి పశ్చిమ దేశాలు నిరాకరించాయి. తాలిబాన్ ను గద్దె నుండి దించి పదేళ్లయినా, మరో రెండు, మూడు సంవత్సరాలలో ఆఫ్ఘనిస్ధాన్ ను ఆఫ్ఘన్లకు అప్పగించి వెళ్తామని చెబుతున్నా, ఆఫ్ఘన్ మహిళల పరిస్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోయింది.
దానికి కారణం ఆఫ్ఘన్ మహిళల పరిస్ధితులు ఏ క్షణంలో కూడా పశ్చిమదేశాలకు లెక్కలో లేకపోవడమే. ఆఫ్ఘన్ మిలిటెంట్లపై దాడులు చేయడానికీ, ఆఫ్ఘన్ ప్రజలను మిలిటెంట్ల పేరుతో జైళ్ళలో కుక్కడానికీ, అర్ధ రాత్రులు గ్రామాలపై బడి యువకులను అరెస్టులు చేసి మాయం చేయడానికీ… ఆఫ్ఘన్ పాలకులపై అనుక్షణం ఒత్తిడి తెచ్చిన అమెరికా పాలకులు, నాటో కమాండర్లూ ఏనాడూ ఆఫ్ఘన్ స్త్రీల కోసం చట్టాలు చేయాలని ఒత్తిడి చేయలేదు. ప్రజల హక్కులను గుర్తించని వాడూ, స్వతంత్ర దేశాల సార్వభౌమ హక్కులను హరించేవాడూ, గ్రామాలలో దూరి మహిళలనూ, పిల్లలనూ విచక్షణా రహితంగా కాల్చి చంపేవాడూ మహిళల హక్కులను ఎలా కాపాడతాడు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి