ష్ట్రంలో రాజకీయంగా కొత్త సమీకరణలకు ఉప ఎన్నికలు నాందీ అవుతాయో
లేదో కాని ఈ పదమూడో శాసనసభ ఉప ఎన్నికల విషయంలో రికార్డు సృష్టిస్తోంది.
ఇప్పటికే పదహారు నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు వెళితే , మరో పాతిక
నియోజకవర్గాలు ఎన్నికలకు ఎదురు చూస్తున్నాయి. నిజానికి శాసనసభ స్పీకర్ లు
కాస్త నిబంధనల జోలికి వెళ్లకుండా, ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను సీరియస్
గా తీసుకోకపోవడం వల్ల శాసనసభ రద్దు కాకుండా ఉందని చెప్పాలి.రెండువేల
తొమ్మిదిలో ఎన్నికలు జరిగి పదమూడో శాసనసభ ఆరంభమైనప్పటినుంచి బహుశా
ఎమ్.ఐ.ఎమ్. , లోక్ సత్తా, సిపిఎం వంటి కొన్ని రాజకీయపక్షాలకు చెందిన కొద్ది
మంది మినహా దాదాపు ఎమ్మెల్యేలంతా ఏదో రకంగా రాజీనామా పత్రం
సమర్పించినవారే. లోపల ఇష్టం ఉన్నా , లేకపోయినా రాజీనామా చేసినవారు
కొందరైతే, రాజీనామా చేసి కూడా ఆమోదించవద్దని చెప్పినవారు మరికొందరు, ఎలాగూ
రాజీనామాలు ఆమోదించరులే అన్న ధైర్యంతో పత్రాలు సమర్పించినవారు ఇంకొందరు..
వీరంతా కలసి రాజీనామాలను ఒక ప్రహసనంగా మార్చారంటే అతిశయోక్తికాదు. ప్రత్యేక
వాదం తీవ్ర రూపం దాల్చి తెలంగాణ ఎమ్మెల్యేలు, దానికి ప్రతిగా సమైక్యంగా
రాష్ట్రం ఉండాల్సిందేనంటూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు పోటీలు
పడి రాజీనామాలు చేశామని ప్రకటించారు. వీటితోపాటు ఇప్పుడు పార్టీ విధానాలు
నచ్చకో, వేరే పార్టీకి ఆకర్షితులయ్యో రాజీనామాలు చేస్తున్నవారి సంఖ్య కూడా
గణనీయంగానే ఉంది.అలాగే దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి కోసం పదహారు మంది అనర్హత
వేటు వేయించుకుని మరీ ఉప ఎన్నికలకు సిద్దపడడం మరో ప్రత్యేకతగా తీసుకోవాలి.
ఇంకా మూడేళ్లు కూడా పూర్తికాకముందే ఇన్ని వింతలు ఈ సభలో చోటు చేసుకున్నాయి.
వచ్చే రెండేళ్లలో ఏమి జరుగుతుందో కాని రాష్ట్రంలో ఉప ఎన్నికల చరిత్రను
పరిశీలిస్తే అనేక ఆసక్తికర ఘట్టాలు కనిపిస్తాయి. గణాంకాల ప్రకారం
ఇప్పటివరకు రాష్ట్రంలో నూట తొంభైనాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన
ఏడు ఉప ఎన్నికలు కలిపితే రెండు వందల ఒక్క ఉప ఎన్నికలు జరిగినట్లు లెక్క.
ప్రజారాజ్యం తరపున ఎన్నికైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను,
అలాగే రాజ్యసభకు ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే రాజీనామ పరిగణనలోకి
తీసుకోవలసి ఉంది. అలాగే అనర్హత వేటుకు గురి అయిన పదహారు స్థానాలకు ఎన్నికలు
జరగాలి. ఇవన్ని కలిపితే రెండువందల పందొమ్మిది ఉపెన్నికలు జరిగినట్లు
అవుతుంది. అత్యధికంగా ఈ టరమ్ లో ( 2009-2014) ఇప్పటికే నలభై ఉప ఎన్నికలు
జరిగాయి. ఆ తర్వాత 1994-99 మధ్య ఇరవై ఆరు ఉప ఎన్నికలు జరిగాయి.తదుపరి
రెండువేల నాలుగు నుంచి రెండువేల తొమ్మిది మధ్యకాలంలో ఇరవై రెండు ఉప
ఎన్నికలు జరిగాయి. ఇక 1952 నుంచి అరవై రెండు సంవత్సరం వరకు రెండు టరమ్ లలో
కలిపి ముప్పై ఏడు ఉప ఎన్నికలు జరిగాయి.1956 లో ఆంధ్రప్రదేశ్
ఆవిర్భవించింది. 1962లో రాష్ట్రం అంతటికి కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ
టరమ్ లో పదమూడు ఉప ఎన్నికలు, 1967 టరమ్ లో పదిహేను ఉప ఎన్నికలు, 1972
నుంచి 1978 వరకు ఆరేళ్ల టరమ్ లో పదకుండు ఉప ఎన్నికలు జరగ్గా, 1978 -83 మధ్య
కాలంలో పదమూడు , 1983-85 మధ్య ఏడు, 1985-89 టరమ్ లో పది , 1989-94 మధ్య
పదమూడు , 1994-99 మధ్య టరమ్ లో ఇరవై ఆరు, 1999 నుంచి 2004 వరకు పదకుండు ఉప
ఎన్నికలు జరిగాయి.కాగా జిల్లాల వారీ చూసుకుంటే అత్యధికంగా ఇప్పుడు జరిగిన
మూడు ఉప ఎన్నికలతో కలుపుకుని పదిహేను ఉప ఎన్నికలు జరిగినట్లవుతుంది. ఆ
తర్వాత కృష్ణాజిల్లాలో పద్నాలుగు ఉప ఎన్నికలు జరిగితే, హైదరాబాద్ జిల్లాలో
పదమూడు, కరీంనగర్, మెదక్ జిల్లాలలో పన్నెండు చొప్పున ఉప ఎన్నికలు ఆయా టరమ్
లలో జరిగాయి.
తూర్పుగోదావరి , కర్నూలు జిల్లాలలో కూడా పన్నెండు ఉప ఎన్నికలు జరగ్గా,
తూర్పు గోదావరిలో ఒక ఉప ఎన్నిక, కర్నూలులో రెండు ఉప ఎన్నికలు సమీప
భవిష్యత్తులో జరగవలసి ఉంది.ఆసక్తికరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లాలలో ఒకటైన
గుంటూరు జిల్లాలో అతి తక్కువగా రెండు ఉప ఎన్నికలు జరిగాయి. మరో రెండు
ఇప్పుడు జరగవలసి ఉంది.నియోజకవర్టాల వారీగా చూస్తే సిద్దిపేట నియోజకవర్గం
అత్యధికంగా ఐదుసార్లు ఉప ఎన్నికలకు వెళ్లింది. ఈ ఐదుసార్లు కూడా
తెలంగాణవాదానికి పరీక్షగా ఉప ఎన్నికలు జరగడం విశేషం.అన్నిసార్లు
తెలంగాణవాదులే ఇక్కడ నుంచి విజయం సాధించారు.1970లో మదన్ మోహన్
ఇండిపెండెంటుగా గెలిస్తే, రెండువేల ఒకటిలో టిడిపి నుంచి బయటకు వచ్చిన
కె.చంద్రశేఖరరావు సొంతంగా టిఆర్ ఎస్ ను ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేసి తిరిగి అక్కడే పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కెసిఆర్
మేనల్లుడు టి.హరీష్ రావు మూడు ఉప ఎన్నికలలో గెలుపొంది మరో రికార్డు
సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా మూడు ఉప ఎన్నికలలోను,ఒక సాధారణ
ఎన్నికలోను గెలిచిన రికార్డు ఈయనదే. రెండువేల నాలుగులో కెసిఆర్ కరీంనగర్
లోక్ సభకు, సిద్దిపేట అసెంబ్లీకి పోటీచేసి రెండు చోట్ల గెలుపొందారు. ఆ
తర్వాత సిద్దిపేట సీటును ఖాళీ చేయగా అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో హరీష్ రావు
గెలిచారు.ఆ తర్వాత 2008, 2010లలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే
పదవికి రాజీనామా చేసి తిరిగి భారీ మెజార్టీతో నెగ్గడం విశేషం.రాష్ట్రంలో
తెలంగాణవాదం కోసం రాజీనామా చేసిన సందర్భాలు మరెప్పుడూ లేవు. తొలుత రెండువేల
ఒకటిలో కెసిఆర్, ఆ తర్వాత రెండువేల ఎనిమిదిలో పదహారు మంది, రెండువేల పదిలో
పన్నెండు మంది, రెండువేల పదకుండులో ఒకరు, రెండువేల పన్నెండులో ఏడుగురు
రాజీనామా చేశారు. అయితే రెండువేల ఎనిమిదిలో మాత్రం టిఆర్ఎస్ కాస్త
దెబ్బతింది. పదహారు మంది రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఏడుగురే
గెలిచారు. అదే రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన చిదంబరం తెలంగాణ
ప్రకటన తదుపరి జరిగిన పరిణామాలలో రెండువేల పదిలో పది మంది టిఆర్ఎస్,
టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రాజీనామా చేసి తిరిగి పోటీచేస్తే ఘన
విజయం సాధించారు. కాగా టిఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, సీనియర్
ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ లు రెండేసి సార్లు రాజీనామా చేసి తిరిగి
గెలుపొందడం విశేషం. ఆ తర్వాత అసిఫ్ నగర్, గుడివాడ, ఆళ్లగడ్డ, శ్రీకాళహస్తి
, పులివెందుల వంటి కొన్ని నియోజకవర్గాలు మూడేసి సార్లు ఉప ఎన్నికలకు
వెళ్లాయి.పులివెందుల నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది.
ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ప్రమాదంలో మరణించిన డాక్టర్
వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల నుంచి ఒకసారి
ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి
అనతికాలంలోనే తిరిగి పోటీచేసి ఘన విజయం సాధించారు. వీరితో పాటు రెండు
సార్లు ఉప ఎన్నికలలో గెలుపొందిన చరిత్ర ఈలి వరలక్ష్మికి ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు
ఉప ఎన్నికలలో ఎన్నికయ్యారు. ఆమె ఒకసారి టిడిపి పక్షాన, మరోసారి కాంగ్రెస్
తరపున ఇలా గెలిచారు. మరో నేత ఆనం సంజీవరెడ్డి రెండుసార్లు ఉప ఎన్నికల
ద్వారా శాసనసభకు వచ్చారు. ఒకసారి ఆయన ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. మరో
ముగ్గురు నేతలు ముఖ్యమంత్రులు అయ్యాక ఉప ఎన్నికల ద్వారా శాసనసభలోకి
వచ్చారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విశాఖ
జిల్లా ఎస్.కోట నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు టి.అంజయ్య రాయాయంపేట
నుంచి, కోట్ల విజయభాస్కరరెడ్డి పాణ్యం నుంచి ఉప ఎన్నికల ద్వారానే శాసనసభకు
ఎన్నియ్యారు. ప్రకాశం పంతులు,అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఆంధ్ర
ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ తొలి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నీలం సంజీవరెడ్డి 1952 సార్వత్రిక
ఎన్నికలలో ఓడిపోయి, తిరిగి 1953 లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఉప
ఎన్నికలో పోటీచేసి శాసనసభకు ఎన్నికవడం విశేషం. సొంత జిల్లాలో ఆయన సొంత
బావమరిది తరిమెల నాగిరెడ్డిపై ఓడిపోయి, ఆ తర్వాత తన శిష్యుడైన ఆడూరి
బలరామిరెడ్డి ఖాళీచేసి ఇచ్చిన సీటు నుంచి గెలుపొందడం విశేషం.కాగా పార్టీ
ఫిరాయింపుల చట్టం లేని రోజులలోనే కొందరు నేతలు విలువల కోసం పార్టీ మారినా,
లేదా పార్టీ వేరే పార్టీలో విలీనం అయినా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి
తిరిగి ఉప ఎన్నికలలో గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివారిలో పివిజి
రాజు, తెన్నేటి విశ్వనాధం, పద్మనాభరాజు, గంట్లాన సూర్యనారాయణ ప్రభృతులు
ఉన్నారు. కెసిఆర్ కూడా అదే కోవలోకి వస్తారు. అలాగే అనంతపురం జిల్లా పరిటాల
రవీంద్ర 1995 లో తెలుగుదేశంలో సంభవించిన పరిణామాలలో తొలుత
ఎన్.టి.ఆర్.పక్షాన ఉండేవారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ మరణంతో మళ్లీ చంద్రబాబు
నాయకత్వంలోని టిడిపిలోకి వచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా
కూడా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , తిరిగి పెనుకొండ నుంచే
టిడిపి పక్షానే గెలుపొందిన చరిత్ర ఈయనకు దక్కింది.కాగా 2004లో అనూహ్యంగా
టిడిపిలోకి వచ్చి అసిఫ్ నగర్ నుంచి పోటీచేసి గెలిచిన ప్రస్తుత మంత్రి దానం
నాగేందర్ , ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే మళ్లీ
కాంగ్రెస్ లోకి ప్రవేశించదలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.కాని ఉప
ఎన్నికలో ఆయన పరాజయం చెందడం విశేషం. ఇక ఉప ఎన్నికలలో ఎక్కువ సందర్భాలలో ఆయా
నేతల కుటుంబ సభ్యులకు అవకాశాలు వస్తుండడం గమనిచదగిన పరిణామంగా గమనించాలి. ఈ
అరవై ఏళ్లలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉంటూ మరణించినవారి స్థానాలలో,
రాజీనామా చేసిన స్థానాలలో ఇరవైఐదు చోట్ల వారి భార్యలే ఉప ఎన్నికల ద్వారా
ఎమ్మెల్యేలు అయ్యారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ప్రస్తుత హోం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత
రాజకీయాలలోకి వచ్చారు. అలాగే టిడిపి నేత ఎలిమినేటి మాధవరెడ్డి మరణం తర్వాత
రాజకీయాలలోకి వచ్చిన ఉమా మాధవరెడ్డి కూడా మంత్రి పదవి నిర్వహించారు.ఆమె
ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి
సతీమణి విజయమ్మ కూడా అలాగే రాజకీయ ప్రవేశం చేసి రెండుసార్లు ఉప ఎన్నికలలో
గెలుపొందారు.ప్రస్తుత సభలో కె.భారతి(టెక్కలి), పరిటాల సునీత(ఈసారి
రాప్తాడు, అంతకుముందు పెనుకొండ) కూడా భర్తల స్థానే వచ్చినవారే. కాగా తాజాగా
రాజీనామా చేసిన శోభా నాగిరెడ్డి 1997లో భర్త నాగిరెడ్డి ఎమ్.పిగా ఎన్నికైన
కారణంగా జరిగిన ఉప ఎన్నిక ద్వారా రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు. అలాగే
ఎమ్మెల్యేలుగా ఉంటూ మరణించడమో, లేదా రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీలలో
ఇరవై ఏడు నియోజకవర్గాలలో వారి కుటుంబ సభ్యులే విజయం సాధించి చట్టసభలోకి
వచ్చారు. ప్రస్తుతం కోవూరు శాసనసభ నియోజకవర్గానికి రాజీనామా చేసి తిరిగి
పోటీలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో ఆయన తండ్రి
శ్రీనివాసులు రెడ్డి మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నిక ద్వారానే సభలోకి
వచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న పి.జనార్దనరెడ్డి
మరణంతో ఆయన కుమారుడు విష్ణువర్ధనరెడ్డి ముందు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక
ద్వారా సభలోకి వచ్చారు. ఇప్పుడు జూబ్లి హిల్స్ కు ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక కేంద్ర
రాజకీయాలలోకి వెళ్లి ఢోన్ నియోజకవర్గానికి రాజీనామా చేయగా , అప్పుడు ఆయన
అల్లుడు రాంభూపాల్ రెడ్డి గెలిచారు.
ఉప ఎన్నికలకు సంబంధించి మరో పరిశీలన కూడా ఆస్తకికరంగా ఉంటుంది. 1983 లో
తెలుగుదేశం అధికారంలోకి వచ్చే ముందు వరకు మన రాష్ట్రంలో దాదాపు ఏక పార్టీ
వ్యవస్థ నడిచేది. ఉప ఎన్నికలలో సైతం ఎప్పుడో ఒకటి , అరా తప్ప అన్ని
కాంగ్రెస్ పార్టీనే గెలుచుకునేది. ఆ తర్వాత రెండు పార్టీల వ్యవస్థ బలపడ్డాక
కాంగ్రెస్, టిడిపిలు ఎవరు అదికారంలో ఉంటే వారు ఎక్కువ ఉప ఎన్నికలు
గెలుస్తుండడం కనిపిస్తుంది. 1983-85 మధ్య ఏడు ఉప ఎన్నికలు జరిగితే టిడిపి
ఐదు గెలవగా, కాంగ్రెస్, బిజెపిలు ఒక్కొక్కటి గెలిచాయి. అప్పట్లో టిడిపిలో
ముఖ్యమైన నాయకుడిగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర హిమయత్ నగర్ ఉప ఎన్నికలో
పోటీచేసి నరేంద్రపై పరాజయంపాలవడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 1985-89
మధ్య పది ఉప ఎన్నికలు జరిగితే టిడిపి ఆరు, కాంగ్రెస్ మూడు, ఎమ్.ఐ.ఎమ్. ఒకటి
గెలుచుకున్నాయి. 1988లో చిత్తూరు జిల్లా వాయల్పాడు లో ప్రస్తుత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాధ్ రెడ్డి మరణం కారణంగా
జరిగిన ఉప ఎన్నికలో కిరణ్ తల్లి పోటీచేసి టిడిపి చేతిలో ఓడిపోవడం విశేషం.
1994-96 మద్యన ఇరవై ఆరు ఉప ఎన్నికలకు గాను, ఇరవై చోట్ల టిడిపి, నాలుగు
కాంగ్రెస్, ఒకచోట ఎన్.టి.ఆర్.టిడిపి, ఒక చోట టిడిపి మిత్రపక్షంగా సిపిఎం
గెలుపొందాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎంత శక్తిమంతుడుగా ఉన్నా
ఎన్.టి.ఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని పాతపట్నంలో ఓడించానికి తీవ్ర
ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కాగా హిందూపురం నుంచి
ఎన్.టి.ఆర్ మరణం తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఉప ఎన్నికలో గెలిచారు.లోక్
సభ మాజీ స్పీకర్ జి.ఎమ్.సి బాలయోగి ముమ్మడి వరం నుంచి ఉప ఎన్నిక ద్వారా
శాసనసభలోకి వచ్చి మంత్రి అయి, ఆ తర్వాత 1998లోనే తిరిగి రాజీనామా చేసి లోక్
సభకు ఎన్నికై స్పీకర్ కావడం విశేషం.1999-2004 మధ్య జరిగిన ఉప ఎన్నికలలో
ఏడుచోట్ల టిడిపి, రెండు కాంగ్రెస్, ఒకటి టిఆర్ఎస్, ఒకటి ఎమ్.ఐ.ఎమ్.
గెలుపొందాయి. దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ ను నక్సల్స్ కాల్చి
చంపడంతో ఆయనపై గౌరవంతో ఆయన భార్య భారతిని ఏకగ్రీవంగా శాసనసభకు
ఎన్నుకున్నారు. ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.2004 నుంచి 2009 వరకు
కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఇరవైరెండు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్
ఎనిమిది, టిడిపి ఆరు, టిఆర్ఎస్ ఏడు, ఎమ్.ఐ.ఎమ్. ఒకటి గెలుచుకున్నాయి. ఈ
టరమ్ నుంచే టిఆర్ఎస్ ప్రభావం పెరుగుతూ వచ్చింది. రెండువేల తొమ్మిది నుంచి ఈ
మూడేళ్లలో ఇంతవరకు పదహారు ఉప ఎన్నికలు జరగ్గా పన్నెండు టిఆర్ఎస్, ఒకటి
బిజెపిరెండు కాంగ్రెస్ ఐ, ఒకటి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్
గెలుచుకున్నాయి.రెండువేల పది నుంచి జరిగిన ఏ ఉప ఎన్నికలోను అధికార
కాంగ్రెస్, విపక్ష టిడిపి గెలవకపోవడం ఒక ప్రత్యేకత అయితే, రాజీనామా చేసిన
ఎమ్మెల్యేలంతా విజయపధంలో నడవడం మరో ప్రత్యేకత. ప్రధానంగా ప్రత్యేక వాదం
తెలంగాణాలో, వై.ఎస్.సెంటిమెంటు సీమలోను ఉండడం వల్లనే టిఆర్ఎస్,
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు గెలిచాయి. అదే ట్రెండు ఇప్పుడు కొనసాగింది.
అందువల్లనే ఆరు టిఆర్ఎస్, ఒకటి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుచుకున్నాయని
చెప్పవచ్చు.
|
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి