రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ
ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ
ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం
వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం
ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది.
రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట
వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ ప్రతిభా పాటిల్ చేసినన్ని
విదేశీ ప్రయాణాలు చేయలేదని కూడా వెల్లడవుతోంది.
గత మూడు సంవత్సరాలుగా
సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అనేక సార్లు ఆర్టీఐ చట్టాన్ని వినియోగించి
ఆమె విదేశీ ప్రయాణాల ఖర్చుల వివరాలను తెలుసుకోవడానికి తీవ్రంగా
ప్రయత్నిస్తూ వచ్చారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలకు ఖర్చులు భరించే రక్షణ
మంత్రిత్వ శాఖ ఈ ప్రయత్నాలను ప్రతిసారీ ప్రతిఘటిస్తూ వచ్చిందని ‘ది హిందూ’
పత్రిక తెలిపింది. అనేక సార్లు ఆర్టీఏ కార్యకర్తలు కోరిన సమాచారాన్ని
వెల్లడించలేదని ఆ పత్రిక తెలిపింది. పదే పదే కోరాక మాత్రమే అతి తక్కువ
సమాచారాన్ని వెల్లడించారని తెలిపింది.
రాష్ట్రపతి ప్రయాణాల
కోసం ఎయిర్ ఇండియా సంస్ధ రు. 169 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి ప్రయాణంలోనూ
బోయింగ్ 747-400 చార్టర్డ్ విమానాన్ని వాడవలసిందే. ఓ సారి భూటాన్
వెళ్ళినపుడు చిన్న జెట్ విమానాన్ని సైతం ప్రతిభా పాటిల్ వినియోగించింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం రు.36 కోట్లు ప్రతిభా పాటిల్ విదేశీ
ప్రయాణాల కోసం ఖర్చు పెట్టింది. హోటల్ ఖర్చులు, విదేశాలు వెళ్ళాక అక్కడ
టూరిస్టు ప్రదేశాలు చూసేందుకు అయిన ఖర్చులు, రోజువారీ ఖర్చులు, ఇతర చిల్లర
ఖర్చులు విదేశీ మంత్రిత్వ శాఖ భరించిన ఖర్చుల్లో ఉన్నాయి. ఎయిర్ ఇండియా
పెట్టిన ఖర్చు రు. 169 కోట్లలో రు.153 కోట్లు ఇంతవరకూ వసూలు చేసిందట.
మిగిలిన 16 కోట్లు ఎయిర్ ఇండియాకు చెల్లించనే లేదు.
పాటిల్ ప్రయాణించిన
దేశాలు ఇవి: బ్రెజిల్, మెక్సికో, చిలీ, భూటాన్, వియత్నాం, ఇండోనేషియా,
స్పెయిన్, పోలాండ్, రష్యా, తజకిస్ధాన్, యు.కె, సైప్రస్, చైనా, లావోస్,
కాంబోడియా, యు.ఏ.ఈ, సిరియా, మారిషస్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్,
ఆస్ట్రియా. ఈ దేశాల్లో ఈమె 79 రోజులు గడిపింది. ఈమెకు ముందు
కె.ఆర్.నారాయణన్ 6 సార్లు విదేశీ ప్రయాణాలు చేసి 10 దేశాలు సందర్శించగా,
శంకర్ దయాళ్ శర్మ నాలుగు సార్లు మాత్రమే వెళ్ళి 16 దేశాలు చుట్టి వచ్చాడు.
ఏ.పి.జె అబ్దుల్ కలాం 7 సార్లు ప్రయాణాలు చేసి 17 దేశాలు చుట్టి వచ్చాడు.
ఆయన 47 రోజులు విదేశాల్లో గడపగా, నారాయణన్ 46 రోజులు, శంకర్ దయాళ్ శర్మ 47
రోజులు గడిపారు.
ప్రజా ధనం పట్ల
ట్రస్టీలుగా వ్యవహరించాల్సిన పాలకులు లూటీదారులుగా మాత్రమే వ్యవహరిస్తున్న
సంగతి అనేకసార్లు వెల్లడయింది. స్వదేశీ, విదేశీ కంపెనీలకు దేశ వనరులను దోచి
పెట్టే విధానాలను త్రికరణ శుద్ధిగా అమలు చేసే పాలకులు ప్రజల సంక్షేమం కోసం
చేసే ఖర్చును ప్రభుత్వాలపై భారంగా పరిగణిస్తున్నారు. నూతన ఆర్ధిక విధానాల
ప్రారంభకుడు మన్మోహన్ పాలన తర్వాత ఈ పరిస్ధితి మరింతగా తీవ్రమయింది.
ప్రభుత్వ విధానాలతో ధైర్యం పొందుతున్నారో ఏమో తెలియదు గానీ రబ్బరు
స్టాంపుగా భావించే రాష్ట్రపతి కూడా ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేయడానికి
వెనకాడడం లేదని పై సమాచారం చెబుతోంది.
ఖర్చు పెట్టడం ఒక సంగతి
కాగా, సదరు ఖర్చుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిరాకరించడం మరొక
సంగతి. అలా నిరాకరించడం లోనే ప్రజా ధనం పట్ల ప్రభుత్వ పెద్దలకు ఉన్న
బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిస్తోంది. తాము చేసిన చట్టాలను తామే
ఉల్లంఘించడానికి కూడా వారు వెనకాడరనీ, చట్టాలు అమలు కోసం కాక
ఉల్లంఘించడానికేననీ ప్రభుత్వ పెద్దలు చెప్పదలుచుకున్నారా?
ప్రతిభా పాటిల్
ప్రయాణాలకు ఉన్న మరొక కోణం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఒడిశాలోని పది
గ్రామాల ప్రజలను ఖాళీ చేసి ఆ భూములను దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో
కు అప్పజెప్పడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ ఫ్యాక్టరీ
వల్ల పర్యావరణం నాశనం అవుతుందని చెబుతూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ
అనుమతి నిరాకరిస్తూ వస్తుంది. ఫ్యాక్టరీ నిర్మాణం తలేపెట్టిన ప్రాంతం అటవీ
ప్రాంతం. ఫ్యాక్టరీ వల్ల గ్రామాల ప్రజలు ఇళ్లూ, పొలాలు ఖాళీ చేయాలి. చుట్టూ
పక్కల ఉన్న అటవీ ప్రాంతం అంతా ఫ్యాక్టరీ వల్ల నాశనం అవుతాయి. ప్రజల
జీవనాధారమయిన తమల పాకు తోటలు నాశనం అవుతాయి. దానితో అక్కడి ప్రజలు తమ
గ్రామాలు ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. ఎలాగయినా ఫ్యాక్టరీ నిర్మాణం
ప్రారంభీంచాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రవేటు గూండాలను
పెట్టి ప్రజలకు చెందిన తమల పాకు తోటలను ధ్వంసం చేయించింది. అయినా ప్రజలు
మళ్ళీ తోటలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ప్రతిభా
పాటిల్ దక్షిణ కొరియా సందర్శించినపుడు అక్కడి ప్రభుత్వం ప్రతిభా పాటిల్ తో
తమ ఫ్యాక్టరీకి త్వరగా అనుమతులు ఇప్పించాలని లాబీయింగ్ జరిపింది. దేశ ప్రజల
ప్రయోజనాలు గాలికి వదిలిన ప్రతిభా పాటిల్ కొరియా కి హామీ ఇచ్చి వచ్చింది.
ఆమె ప్రయాణం ముగిశాక పోస్కో ఫ్యాక్టరీ కి పర్యావరణ అనుమతులు ఇస్తున్నట్లు
పర్యావరణ మంత్రి జైరాం రమేష్ ప్రకటించాడు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ దేశ
ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం అయినప్పటికీ తనపై వచ్చిన ఒత్తిడులకు లొంగి
పోస్కో కు అనుమతి ఇవ్వవలసి వచ్చిందని రమేష్ ప్రకటించాడు.
రాష్ట్ర పతి విదేశీ
ప్రయాణాల వల్ల ప్రజా ధనం అనవసరంగా ఖర్చు కావడమే కాక దేశ ప్రజల ప్రయోజనాలు
తాకట్టు పెడతారని కూడా దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి