అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు
నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని
చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి
వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ‘సోషలిస్టు వ్యవస్ధ’.
అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధే అయినా రష్యా, చైనాలలో సోషలిస్టు
విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయ్యాక ఏర్పడిన సోషలిస్టు
వ్యవస్ధలు అమెరికా, యూరప్ లలో సో కాల్డ్ పాపులిస్టు విధానాల అమలుకు దారి
తీసాయి. రష్యా, చైనా ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసిన సోషలిజం, అమెరికా
యూరప్ ప్రజలకు పరోక్షంగా మేలు చేసింది.
రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిస్టు
విప్లవాలు ప్రపంచాన్ని వెల్లువలా చుట్టు ముట్టాయి. అవి అమెరికా, యూరప్
దేశాలను చుట్టు ముట్టకుండా అక్కడి పెట్టుబడిదారీ వర్గాలు అనేక జాగ్రత్తలు
తీసుకున్నాయి. అందులో భాగంగా తమను తాము సంక్షేమ రాజ్యాలుగా (Welfare
States) ప్రకటించుకున్నాయి. కార్మికవర్గాన్ని సంతృప్తి పరచడానికి, సోషలిజం
జోలికి పోకుండా ఉండడానికి అనేక సంక్షేమ విధానాలను అమలు జరిపాయి. నిరుద్యోగ
భృతి, పెన్షన్లు, ఆరోగ్య భీమా, బోనస్ చెల్లింపులు, ప్రభుత్వమే పాఠశాలలు,
కాలేజీలు నెలకొల్పి ఉచిత విద్యా సౌకర్యం కల్పించడం, సబ్సిడీ ధరలకు సరుకులు
అందజేయడం మొ.వి అమలు చేశారు. 1970 ల వరకూ వేతనాలలో పెరుగుదల సంభవించింది.
ఈ విధానాల ఫలితంగా అమెరికా, యూరప్ లలో మధ్య
తరగతి బాగా అభివృద్ధి చెందింది. కార్మికులు, ఉద్యోగులు సాపేక్షికంగా
సంతృప్తికరమైన జీవనం గడిపారు. వారు పొదుపు జోలికి పోకుండా సంపాదించినదంతా
ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకునే వినియోగదారులుగా మారే విధంగా ‘వినియోగదారీ
సంస్కృతి’ని అమెరికా పెట్టుబడదారీ ప్రభుత్వం పెంచి పోషించింది. ఫలితంగా
అమెరికా మధ్య తరగతి వర్గం దాదాపు అభివృద్ధి చెందిన దేశాలన్నింటికీ స్ధిరమైన
మార్కెట్ గా ఉపయోగపడింది. అమెరికా కంపెనీలతో పాటు పశ్చిమ యూరప్ లోని
జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు, జపాన్ మొదలయిన దేశాల కంపెనీలను కూడా అమెరికా
మధ్యతరగతి వర్గమే ప్రధానంగా పోషించింది. అమెరికాకి చేసే ఎగుమతులే ఈ దేశాల
జిడిపి వృద్ధిలో ప్రధాన భాగంగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు.
అయితే రష్యా లో స్టాలిన్, చైనాలో మావో లు
మరణించాక అక్కడి ప్రభుత్వాలు సోషలిస్టు నిర్మాణాన్ని విడిచిపెట్టాయి.
రష్యాలో కృశ్చెవ్ నాయకత్వంలోనూ, చైనాలో డెంగ్ నాయకత్వంలోనూ పెట్టుబడిదారీ
వ్యవస్ధలవైపుకి తిరుగు ప్రయాణం కట్టారు. దానితో అమెరికా, యూరప్ లకు
సోషలిస్టు వ్యవస్ధల ప్రమాదం తప్పిపోయింది. ఫలితంగా 1970 ల నుండే అమెరికాలో
కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో స్తంభన మొదలయింది. అనంతర కాలంలొ వారి నిజ
వేతనాలు పడిపోవడం మొదలయింది. ప్రపంచంలోని పరిపక్వ పెట్టుబడిదారీ వ్యవస్ధలకు
పోషకులుగా ఉన్న అమెరికా మధ్యతరగతి వర్గం క్రమంగా క్షీణించడం మొదలయింది.
దానర్ధం కంపెనీల సరుకులను వినియోగించే ప్రజల కొనుగోలు శక్తి క్రమంగా
క్షీణించడమే. కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల ఉత్పత్తి మిగులు
పెరిగిపోయింది. (మిగులు ఉత్పత్తి సంక్షోభం మొదట జపాన్ లో ప్రారంభమై పరిపక్వ
పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న అమెరికా, యూరప్ లకు కూడా విస్తరించింది. 90 ల
దశాబ్దం అంతా జపాన్ ప్రతి ద్రవ్యోల్బణంతో తీసుకుంది. 2000 దశాబ్దంలో కొంత
కోలుకుంటున్నని భావిస్తున్నంతలోనే 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం జపాన్
ను మారోసారి చావు దెబ్బ తీసింది.)
కొనుగోలు శక్తి క్షీణించడం అంటె సరుకుల
అమ్మకం పడిపోవడం. అది అనివార్యంగా కంపెనీల లాభాలను కృంగ దీస్తుంది. కంపెనీల
పెట్టుబడికి లాభాలు, వృద్ధి (growth) ప్రాణవాయువులాంటివి. అవి లేకుంటె
కంపెనీల ఉనికినే వ్యర్దంగా పెట్టుబడి భావిస్తుంది. లాభం రాకపోయినా,
తక్కువగా వచ్చినా దానికి సంక్షోభంగా కనిపిస్తుంది. దానిని తప్పించడానికి
అది తానున్న చోటును వదిలెయ్యడానికి ప్రయత్నిస్తుంది. లాభం ఉన్న చోటికి,
ఎక్కువ లాభాలు వచ్చే చోటికీ పరుగులు పెడుతుంది. లాభం కోసం అది సరుకులు
మారుస్తుంది. ఒక సరుకు లాభసాటి కాకపోతే మరొక సరుకు తయారీలోకి
ప్రవహిస్తుంది. ప్రాంతాలు దాటుతుంది. రాష్ట్రాలు దాటుతుంది. సముద్రాలు
దుముకుతుంది. దానితో పాటు లాభాలు పెంచుకోవడానికి కార్మికవర్గ వేతనాలపైనా,
సంక్షేమ సదుపాయాలపైనా దాడి చేస్తుంది. ప్రభుత్వాలతో లాబీయింగ్ జరిపి
ప్రతికూల పన్నుల చట్టాలు రద్దు చేయిస్తుంది. టాక్స్ హాలిడే లు
ప్రకటింపజేస్తుంది. కొత్త చట్టాలు చేయిస్తుంది. లేదా చట్టాల కోరలు
తీయిస్తుంది. ప్రత్యర్ధి పెట్టుబడిని లొంగదీసుకుంటుంది. దానితో కుమ్మక్కు
కూడా అవుతుంది. పోటీని ఎలిమినేట్ చెయ్యడానికి ప్రత్యర్ధి పెట్టుబడితో
విలీనమై బడా పెట్టుబడిగా అవతరిస్తుంది.
లాభాలు పెంచుకోవడానికి పెట్టుబడి అవలంబించే
ప్రధాన చర్య కార్మికవర్గ వేతనాలపైనా, సంక్షేమ సదుపాయాలపైనా దాడి చేయడం.
కార్మికులకు, ఉద్యోగులకు వేతనాల రూపంలో ఇచ్చే భాగంలో కోత పెట్టి ఆ భాగాన్ని
తాను వశం చేసుకోవడం ద్వారా పెట్టుబడి తన లాభాన్ని పెంచుకోవాలని
ప్రయత్నిస్తుంది. అందుకు అనేక సాకులు చూపుతుంది. యంత్రాల ఖరీదు
ఎక్కువయిందని చెబుతుంది. డిమాండ్ పడిపోయిందనీ, సీజన్ కాదనీ, కరెన్సీ విలువ
పెరిగిందనీ లేదా తరిగిందనీ మొదలయిన అనేకసాకులు చూపుతుంది. తాను సృష్టించిన
సంక్షోభాలను సైతం కారణంగా చూపుతుంది. ఎన్ని సాకులు చూపినా అంతిమ ఫలితం
వేతనాలు తగ్గిపోవడం. పొదుపు విధానాల పేరుతో అమెరికా, యూరప్ దేశాలు అమలు
చేస్తున్నవన్నీ అందులో భాగమే. వేతనాల కోత లేదా స్తంభన, వివిధ భృతుల కోత
లేదా రద్దు, పెన్షన్ కోత, సబ్సిడీల రద్దు, ప్రభుత్వ రంగ సంస్ధల ప్రవేటీకరణ
ద్వారా ఉద్యోగాల రద్దు మొదలయిన పొదుపు విధానాలన్నీ కార్మికుల వేతనాలను
పెట్టుబడి లాభాలుగా తరలించే చర్యలే.
ఈ చర్యలే అమెరికా మధ్యతరగతిని బలి
పెడుతోంది. అనేక దేశాలకు ఎగుమతి మార్కెట్ గా శోభిల్లిన అమెరికా మధ్యతరగతి
ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతోంది. (అందుకే పశ్చిమ దేశాలు ఇప్పుడు చైనా,
ఇండియాల మధ్య తరగతి వైపు చూస్తున్నాయి). ఆకలి, దరిద్రంతో అల్లాడుతోంది.
ద్రవ్య కంపెనీల ‘సబ్-ప్రైమ్ రుణ సంక్షోభం’ ఫలితంగా తనఖా ఇళ్లు ఫోర్ క్లోజర్
కి గురై అమెరికా మధ్యతరగతి వర్గం నిలువ నీడలేక కార్లలో కాపురముంటోంది. తన
దుస్ధితికి ఇండియా, చైనాల ఔట్ సోర్సింగే కారణమని భ్రమించి ఆగ్రహిస్తోంది.
తమ వేతనాలు హరిస్తున్న స్వదేశీ కంపెనీలు, వాటికి మద్దతు ఇస్తున్న తమ
ప్రభుత్వాల దుర్మార్గాలను తెలుసుకోకుండా వలస వచ్చిన విదేశీయులపై ఆగ్రహం
వెళ్లబొచ్చుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి