27, మార్చి 2012, మంగళవారం

ఆస్ట్రేలియా వీసా కుంభకోణంలో భారత విద్యార్థికి జైలుశిక్ష


మెల్‌బోర్న్, మార్చి 27: ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం విదేశీయులకు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఇఎల్‌టిఎస్) టెస్టులో మోసానికి పాల్పడ్డ భారత విద్యార్థికి 14 నెలల జైలుశిక్ష పడింది. పెర్త్‌లో నివాసముంటున్న 31 ఏళ్ల రాజేష్ కుమార్ ఐఇఎల్‌టిఎస్ అభ్యర్థుల నుంచి 32వేల డాలర్లను లంచంగా అందుకున్నట్లు స్థానిక కోర్టులో రుజువైంది. విదేశీయులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందాలంటే ఐఇఎల్‌టిఎస్ టెస్టులో కనీసం 7.0 పాయింట్ల స్కోరు తప్పనిసరిగా సాధించాలి. ఈ క్రమంలోనే 2009 నవంబర్, 2010 జూన్ మధ్య పెర్త్‌లోని కుర్టిన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐఇఎల్‌టిఎస్ టెస్టులో కావాల్సిన స్కోరు వచ్చేలా చేస్తానని రాజేష్ కుమార్ ముగ్గురు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇందుకు ఓ మధ్యవర్తితోపాటు కుర్టిన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగి సాయం తీసుకున్నట్లు పశ్చిమ ఆస్ట్రేలియా అవినీతి, నేర పరిశోధనా విభాగం దర్యాప్తులో బయటపడటంతో రాజేష్‌కుమార్ కటకటాలపాలయ్యాడు. కాగా, మొత్తం ఈ వ్యవహారంలో రాజేష్‌కుమార్‌తోపాటు 10 మంది జైలుపాలవగా, మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రితేష్ షా కు ఏడాది, కుర్టిన్ విశ్వవిద్యాలయం మాజీ ఉద్యోగి కోక్ కెయిత్‌లో కు రేండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి