21, మార్చి 2012, బుధవారం

2012 అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీనీ నమ్మని భారత ప్రజలు


భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే పార్టీలు ప్రకటిస్తున్న విధానాలు, మేనిఫెస్టోల ప్రాతిపదికన కాకుండా అధికారంలో ఉన్న పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే ప్రత్యర్ధి పార్టీల గెలుపుకు కారణంగా ఉంది.

పంజాబ్, మణిపూర్ లలో అధికార పార్టీనే ప్రజలు తిరిగి ఎన్నుకున్నప్పటికీ అక్కడ ప్రజల అసంతృప్తిని సొమ్ము చేసుకోగల బలమూ, శక్తీ ప్రతి పక్ష పార్టీలకు లోపించడం వల్లనే అధికార పార్టీలు అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగాయి తప్ప వారి ప్రజానుకూల విధానాలేవీ అందుకు కారణంగా నిలవలేదని జాతీయ పత్రికలు, టి.వి ఛానెళ్ల విశ్లేషణలు చెబుతున్నాయి. అదీ కాక ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీలే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న పంజాబ్, మణిపూర్ లలో అసెంబ్లీ స్ధానాలు చాలా తక్కువ. రెండు రాష్ట్రాలూ కలిపి 177 స్ధానాలు మాత్రమే. 403 స్ధానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీ కుప్పకూలిపోగా, ప్రతిపక్షంలోని జాతీయ పార్టీలను దాదాపుగా త్యజించి మరొక ప్రాంతీయ పార్టీని మాత్రమే ప్రజలు ఎన్నుకున్న విషయం గమనించవచ్చు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను జాతీయ పార్టీలు కాంగ్రెస్, బి.జె.పిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అవి తమ పరిస్ధితిని ఏ మాత్రం మెరుగుపరుచుకోలేక పోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చరిష్మా గల నేతలుగా కొనసాగుతున్న గాంధీ కుటుంబ నాయకులు కూడా ఓట్లు రాల్చలేకపోతున్నారు. తమ స్వంత పార్లమెంటు నియోజక వర్గాలైన అమేధి, రాయ్ బరేలీ లలో సైతం రాహుల్, ప్రియాంకలు తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించలేకపోయారు. రాయ్ బరేలి పార్లమెంటు నియోజక వర్గంలో గల అసెంబ్లీ స్ధానాలన్నింటిలో కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమి పాలయ్యారు. ప్రియాంక గాంధీ స్వయంగా కాలికి బలపం కట్టుకుని తిరిగినా అక్కడ ఫలితం దక్కని పరిస్ధితి చూస్తే ఛరిష్మా రాజకీయాలకు అంతిమ ఘడియలు వచ్చేశాయని భావించవచ్చా? బహుశా 2014 పార్లమెంటు ఎన్నికలు ఈ అంశాన్ని నిర్ణయాత్మకంగా ప్రకటించవచ్చు.

బి.ఎస్.పి సైద్ధాంతిక పతనం

ఉత్తర ప్రదేశ్ లో దళితుల పార్టీగా పేరొందిన బహుజన్ సమాజ్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. సమాజంలో కులపరంగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బిసిలు జనాభాలో 80 శాతంగా ఉన్నారనీ, వీరంతా బహు (మెజారిటీ) జనులనీ, ఈ బహుజనులు ఐక్యమయితే అగ్రకులాల రాజ్యాధిపత్యానికి గండి కొట్టి దళితులే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చనీ ‘బహుజన సిద్ధాంతాన్ని’ ప్రతిపాదిస్తూ కాన్సీరామ్ 1980 ల్లో బహుజన్ సమాజ్ పార్టీ ని స్ధాపించాడు. స్ధాపించిన అనతి కాలంలోనే ఆ పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. తన విజయాలను అప్రతిహతంగా కొనసాగిస్తూ వచ్చిన బి.ఎస్.పి చివరికి అధికారం కోసం అగ్రకుల పార్టీ అయిన బి.జె.పి తోనే జట్టు కట్టి ఉత్తర ప్రదేశ్ పిఠాన్ని అధిష్టించింది.

కాన్షీరాం మరణానంతరం బి.జె.పి తో జట్టు కట్టగా వచ్చిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకున్న బి.ఎస్.పి నేత మాయావతి, తమ పార్టీ మూల సిద్ధాంతమైన ‘బహుజనులకు రాజ్యాధికారం’ సిద్ధాంతాన్ని పూర్తిగా పరిత్యజిస్తూ ‘సర్వజన సిద్ధాంతాన్ని’ ముందుకు తెచ్చింది. ఆ సిద్ధాంతం ద్వారా “శతాబ్దాలుగా అణచివేతకు గురయిన బహుజనులకు రాజ్యాధికారం సంపాదించే” మూల లక్ష్యానికి బి.ఎస్.పి పూర్తిగా వదిలిపెట్టినట్లయింది. నిమ్న కులాలకు రాజ్యాధికారం సాధించే లక్ష్యాన్ని వదిలి పెట్టాక ఇక ఆ పార్టీ, దళితుల పార్టీ గా పిలవబడడానికి అర్హతను కోల్పోయింది. నిజానికి బి.జె.పి తో అధికారం పంచుకున్నపుడే బి.ఎస్.పి సైద్ధాంతికి దారిద్ర్యాన్ని రుజువు చేసుకుంది.

తాను చెప్పిన ‘బహుజన సిద్ధాంతం’ కేవలం అధికారం సంపాదించుకోవడానికే తప్ప దళితులను ఉద్ధరించడానికి మాత్రం కాదని బి.జె.పి తో పొత్తు ద్వారా బి.ఎస్.పి రుజువు చేసుకుంది. అధికారం కోసం అగ్ర కుల పార్టీలు దళితులు, ముస్లింలు లాంటి నిమ్నవర్గాల ప్రజలను ఆకర్షించే పధకాలు ప్రకటించినట్లే, బి.ఎస్.పి కూడా “తాము దళితుల పార్టీ” అన్న అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్ళింది తప్ప నిజంగా, నిజాయితీగా దళితుల అభ్యున్నతికి కృషి చేసే పార్టీగా దాని ఆచరణ లేదు. ఆ తర్వాత ‘బహుజన సిద్ధాంతాన్ని’ త్యజించి ‘సర్వజన సిద్ధాంతాన్ని’ చేపట్టిన ఆ పార్టీ సైద్ధాంతికంగా కూడా దళితుల అభ్యున్నతికి కృషి చేసే పార్టీగా అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.

భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి మాయావతే నాయకురాలుగా ఉంటుంది గనుక ‘దళితుల పార్టీ’ గా గుర్తించబడడం కొనసాగవచ్చు గానీ “సైద్ధాంతికంగా” అది దళితులతో ఉన్న సామీప్యతను కోల్పోయిందని చెప్పక తప్పదు. దళితులు/బహుజనుల మద్దతుతో అధికారం లోకి వచ్చినప్పటికీ ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న భూమి, పరిశ్రమలు లాంటి ఉత్పత్తి సాధానాలు దళితుల చేతుల్లోకి వచ్చే ఏర్పాట్లు బి.ఎస్.పి చేయలేదు. సమాజంలో ధనికులుగా ఉన్న అగ్రకులాలవారి సేవలోనే అది తరించిపోయింది. దళితుల చేతికి ప్రధాన ఉత్పత్తి సాధనం “భూమి” ని పరిమితంగానైనా అప్పగించే పనికి ఆ పార్టీ పూనుకోలేదు. “భూసంస్కరణలను” అగ్రకుల పార్టీలు అరవై యేళ్ళుగా ఒక ఫార్సుగా మార్చివేశాయి. కనీసం దళితుల ఆక్రమణలో ఉన్న భూములకైనా పట్టాలిచ్చి భూములను పూర్తిగా వారి వశం చేసిన ఉదాహరణలు లేవు. అగ్రకులాల భూస్వామ్య, బూర్జువా అనుకూల పాలనా పద్ధతినే బి.ఎస్.పి పాలన కొనసాగింది తప్ప దళితుల జీవితాల్లో మౌలికంగా మార్పులు తెచ్చే ప్రయత్నాలను కూడా ఆ పార్టీ చేయలేదు. ఇక దళితుల పార్టీ గా చెప్పుకున్నంత మాత్రాన దళితులకు అది ఏం ప్రయోజనం సాధించినట్లు?

ఈ నేపధ్యంలో కూడా బి.ఎస్.పి ఓటమిని చూడవలసి ఉంది. అధికారంలో ఉండగా మాయావతి తన విగ్రహాలు, ఏనుగు విగ్రహాలు ప్రతిష్టించడం పైన చూపించిన శ్రద్ధను కూడా దళితుల కోసం ఆమె చూపలేదు. అవినీతి ఆరోపణలు ఎటూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను ఒక్కుమ్మడిగా తొలగించడం ద్వారా ప్రజల్లో పలుకుబడి పెంచుకోవచ్చని భావించిన మాయావతి, ఆ నిర్ణయం వల్ల అవినీతి ఆరోపణలు ఆమోదించిన సందేశాన్ని ప్రజలు స్వీకరించినట్లు కనిపిస్తోంది. మునుముందు ఎన్నికల్లో బి.ఎస్.పి మళ్లీ అధికారంలోకి రావడమో లేదా అధికార కూటమిలో సభ్యురాలుగా అధికారం పంచుకోవడమో జరిగినా అది పాలకవర్గ పార్టీలలో ఒక భాగంగానే అది సాధించవచ్చేమో గానీ దళితుల పార్టీగా మాత్రం కాదు.

జాతీయంగా ఏర్పడిన రెండు పాలకవర్గ పార్టీల కూటమిల పరంగ చూస్తే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికీ సంతోషం మిగల్లేదు. పార్టీల పరంగా చూసినా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బి.జె.పి లదీ అదే పరిస్ధితి. కాంగ్రెస్ కూటమి మణిపూర్ రాష్ట్రాన్ని నిలబెట్టుకుని గోవా రాష్ట్రాన్ని కోల్పోగా, బి.జె.పి కూటమి పంజాబ్ ని నిలబెట్టుకుని ఉత్తరాఖండ్ ని కోల్పోయింది. ఉత్తరా ఖండ్ లో బి.జె.పి కంటే కాంగ్రెస్ కేవలం ఒక స్ధానాన్నే ఎక్కువ సంపాదించినా, బి.జె.పి ముఖ్యమంత్రి ఓడిపోవడం ఆ పార్టీ ఎదుర్కొన్న తీవ్ర ఓటమిగా పరిగణించవలసి ఉంది. పంజాబ్ లో చూసినా శిరోమీ అకాలిదళ్ దే ఘనత తప్ప బి.జె.పి ది కాదు. కాంగ్రెస్ పార్టీ మణిపూర్ ని నిర్ణయాత్మకంగానే నిలుపుకోగా గోవాను బి.జె.పి నిర్ణయాత్మకంగా లాక్కుంది.

ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఏ పార్టీనీ పాజిటివ్ ఓటుతో ప్రజలు ఆమోదిస్తున్న పరిస్ధితి భారత దేశంలో లేదని స్పష్టం చేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి