20, మార్చి 2012, మంగళవారం

ఛార్జీలు పెంచిన రైల్వే బడ్జెట్ 2012-13


కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీలు పెంచడానికే నిర్ణయింకుకున్నాడు. 2012 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 14, బుధవారం ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేవేశపెట్టాడు. కొద్దిగానే పెంచానని మంత్రి చెబుతున్నప్పటికీ పెంచినవన్నీ ప్రయాణీకులపై భారం పడవేసేవే. రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వ, ప్రవేటు వేతన జీవుల నిజ వేతనాలు బాగా పడిపోయినందున ఎంత పెంచినా ప్రయాణీకుల జేబుకు ఇప్పటికే ఉన్న చిల్లుల్ని పెద్దవి చేసేవే.
కిలో మీటరుకి రెండు పైసల నుండి 30 పైసలవరకూ ఛార్జీలు పెంచినట్లు రైల్వే మంత్రి ప్రకటించాడు. ఛార్జీలు పెంపుదలతో పాటు 75 కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లు, 21 కొత్త పాసెంజర్ రైళ్ళు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఉన్న మరో 39 ట్రైన్ల ప్రయాణాన్ని పొడిగించానని తెలిపాడు. 23 రైళ్ళకు ప్రయాణాల సంఖ్య పెంచానని కూడా ఆయన తెలిపాడు.
ప్లాట్ ఫారం టికెట్ రు. 3 నుండి రు. 5 కు పెంచారు. పెంచిన ఛార్జీలు ఇంకా ఇలా ఉన్నాయి. సబర్బన్, ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఛార్జీలు కి.మీ కి 2 పైసలు,  మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఛార్జీలు 3 పైసలు, స్లీపర్ క్లాసు ఛార్జీలు 5 పైసలు, ఏ.సి చైర్ కార్/ఏ.సి 3 టైర్/ఫస్ట్ క్లాస్ ఛార్జీలు 10 పైసలు పెంచగా, ఏ.సి 2 టైర్ ఛార్జీలు కి.మీ కి 15 పైసలు, ఏ.సి ఫస్ట్ క్లాస్ ఛార్జీలు కి.మీ కి 30 పైసలు పెంచారు.
సామాన్య మావవుడిపైన ఎక్కువ భారం పడకుండా ఉండడానికే జాగ్రత్తలు తీసుకున్నానని మంత్రి యధావిధిగా చెప్పుకున్నాడు. దీనార్ధం భారం తగ్గే సమస్య లేదనే. సామాన్య జనంపై భారం తగ్గాలంటే ఛార్జీలు తగ్గించాలే తప్ప పెంచుకుంటూ పోవడం వల్ల భారం పడకుండా ఎలా ఉంటుంది? ఛార్జీలు పెంచే ప్రక్రియను సాధారణ సూత్రంగా చేసినపుడు పెంచకుండా ఉండడం, తక్కువ పెంచడం ప్రజానుకూల చర్యలుగా స్ధిరపడిపోయాయి.
గత ఎనిమిది సంవత్సరాలుగా ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఛార్జీలు పెంచాల్సిందేనని తనపై వత్తిడులు వచ్చాయని మంత్రి వెల్లడించాడు. కానీ ప్రజల కోసమే తక్కువ పెంచానన్నది ఆయన లాజిక్, తక్కువ పెంచినా, ఎక్కువ పెంచినా, పెంపుదల భారమే. “అందరూ కోరినట్లు, పెద్ద రాయితో కొట్టలేదు, కేవలం చిన్న రాయితోనే కొట్టేను. కనుక ప్రజానుకుల బడ్జెట్” అని మంత్రి చెబుతున్నాడు. ఇంతకీ ఛార్జీలు పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చిన పెద్ద మనుషులు ఎవరో? ప్రధాన మంత్రా? ప్రణాళికా సంఘమా? లేక ఆర్ధిక మంత్రా? లేక మొత్తం మంత్రివర్గమా? చెపితే బాగుండేది.
అయితే చాలా తక్కువ పెంచిన చార్జీలవల్ల రైల్వేలకు అదనంగా రు. 36,200 కోట్లు ఆదాయం వస్తుందట. అంటే, కొత్త ఆర్ధిక సంవత్సరంలో రు. 36,200 కోట్ల మేరకు ప్రయాణికుల జేబుకి చిల్లు పెడుతున్నట్లే. ఇది తక్కువ పెంపుదలా? చార్జీల పెంపుదల వల్ల కొత్త ఆర్ధిక సంవత్సరంలో రైల్వేల ప్రయాణీకుల ట్రాఫిక్ ఆదాయం మొత్తం 1,32,522 కోట్లు అవుతుంది. సరుకు రవాణా ఆదాయం రు. 89,399 కోట్లు గా ఉంటుందని బడ్జెట్ లెక్కలు తెలుపుతున్నాయి.
2012-13 లో రైల్వేలు మోసుకెళ్ళే సరుకులు మరో 55 మిలియన్లు టన్నులు పెరిగి 1025 మిలియన్ టన్నులకి చేరుకుంటుందట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి