20, మార్చి 2012, మంగళవారం

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ


ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు.
ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ శ్రీలంక ప్రభుత్వం బ్రిటన్ కి నిరసన తెలిపింది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా పేర్కొంది. వాస్తవాలతో సంబంధం లేనిదిగా ఆరోపించింది. చానెల్ 4 మాత్రం వీడియో విశ్వసనీయమైనదిగా పేర్కొంది. ప్రముఖ ఫోరెన్సిక్ పాధాలజిస్టు ప్రొఫెసర్ దేర్రిక్ పౌండర్ వీడియో ‘ఒరిజినల్’ గా ధ్రువపరిచినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కల్లం మెక్ క్రే ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకుడు. మొదటి భాగాన్ని కూడా ఇతనే నిర్మించాడు.
ఎల్.టి.టి.ఈ సారధి ప్రభాకరన్ 12 సంవత్సరాల కుమారుడు బుల్లెట్ గాయంతో చనిపోయి ఉన్న దృశ్యం, అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. 12 సంవత్సరాల బాలచంద్రన్ ని శ్రీలంక సైన్యం అమానుషంగా ఇంటరాగేట్ చేసి కాల్చి చంపిందని డాక్యుమెంటరీ పేర్కొంది. బాలుడి శవం చుట్టూ అతని బాడీ గార్డులు ఐదుగురు సవాలు కూడా పడి ఉన్నాయి. నడుము వరకు చొక్కా లేకుండా, గుండెల్లో బులెట్ గాయాలతో ఉన్న బాలచంద్రన్ శవాన్ని తమ విజయానికి గుర్తుగా ట్రోఫీగా దాచుకోవడానికి వీడియో తీశారని డాక్యుమెంటరీ వెల్లడించింది. అయితే, ప్రభాకరన్ కుమారుడిని పట్టుకుని, విచారించి చంపారన్న ఆరోపణలను శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించింది.
శ్రీలంకలో తమిళులపై అనేక శతాబ్దాలుగా జాతి వివక్ష అమలు జరుగుతోంది. తమిళులకు సమానావకాశాలు ఇవ్వడానికి శ్రీలంక ప్రభుత్వాలు ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. టైగర్ల పై జరిగిన యుద్ధంలో, చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం సామూహిక హత్యాకాండ జరిపాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం విచారణకి వచ్చినా శ్రీలంక ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పటికే కొన్ని లక్షల మంది తమిళులు శరణార్ధి శిబిరాల్లో బతుకుతున్నారని సమితి తెలిపింది. వారిని తిరిగి తమ స్వస్ధాలకు తరలించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. కనీస సౌకర్యాలు లేని శిబిరాల్లో తమిళులు అనేక రోగాలతో చనిపోతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని సమితి నివేదికలు తెలిపాయి.
“ఈగలు ముసురుతున్న పసిపిల్లల శవాలు, తీవ్రంగా గాయపడిన తన పిల్లాడి శవం పక్కన సహాయం కోసం అరుస్తున్న తండ్రి, చావుకు దగ్గరలో ఉన్న తన పిల్లల పక్కన పెద్దగా రోదిస్తున్న తల్లి, గాయపడిన పౌరులతో నిండిపోయిన తాత్కాలిక ఆసుపత్రులు, ఆహారము మందుల లేమితో క్షీణిస్తున్న ఆరోగ్యాలతో దీన ముఖాలతో ఉన్న జనం, పట్టుకున్న తిరుగుబాటుదారుల వీడియోలను ట్రోఫీలుగా ఉంకుకున్న దృశ్యాలు…” డాక్యుమెంటరీ నిండా ఉన్నాయని ‘ది హిందూ’ పత్రిక అభివర్ణించింది.  బాలచంద్రన్ శవంగా ఉన్న వీడియో మే 18, 2009 న తీసినట్లుగా వీడియో ఫుటేజ్ పైన ఉన్న తేదీ ద్వారా తెలుస్తోందని ఆ పత్రిక తెలిపింది. “ఇది హత్య. అందులో అనుమానం లేదు” అని ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ పౌండర్ తెలిపినట్లుగా పత్రిక తెలిపింది.
బాలచంద్రన్ ను కాల్చి చంపేముందు ఇంటరాగేట్ చేసామని ఒక సీనియర్ శ్రీలంక అధికారి అఫిడవిట్ లో తెలిపినట్లుగా డాక్యుమెంటరీ తెలిపింది. సదరు డాక్యుమెంటుని తాము పరిశీలించామనీ, తమ పరిశీలనలో అది అధికారికమైనదేనని తేలిందనీ చానెల్ 4 తెలిపింది. శ్రీలంక సైనికులు, ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై కొత్త సాక్ష్యాలు లభ్యమైనాయని డాక్యుమెంటరీ తెలిపింది. ‘సమకాలీన డాక్యుమెంట్లు, ప్రత్యక్ష సాక్ష్యుల కధనాలు, మే 2009 లో ముగిసిన యుద్ధం లో సంఘటనల కు సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. అధ్యక్షుడు రాజ పక్ష, అతని సోదరుడు డిఫెన్స్ సెక్రటరీ గొట్టబాయ రాజపక్సే లు తమిళులపై జరిగిన హత్యాకాండకు నేరుగా బాధ్యులని డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నాయని తెలిపింది.
శ్రీలంక సైనికుల హత్యాకాండ బాధితులను మర్చిపోవద్దని అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్య సమితిని డాక్యుమెంటరీ కోరింది. “ఈ దారుణాలను జరగడానికి ప్రపంచం ఎలా అనుమతించింది?” అని డాక్యుమెంటరీ చివర్లో ప్రశ్నించింది.
అవును. ఎలా అనుమతించిచింది? ఇదే చానెల్ ఇరాక్ పై పది సంవత్సరాలు అమలయిన అమానుష ఆంక్షల పట్ల ఎందుకు మౌనంగా ఉంది? పసి పిల్లలకు పాల డబ్బాలు కూడా అందకుండా చేసిన అమెరికా, యూరప్ ల ఆంక్షలను ఎందుకు ప్రశ్నించదు? తన దేశ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలో అనేకమంది బ్రిటిష్ ముస్లింలను ఈజిప్టు, లిబియా, పాకిస్ధాన్ దేశాల్లో గల ప్రత్యేక జైళ్లకు పంపి చిత్ర హింసలు పెట్టి చంపినా వాటిపై డాక్యుమెంటరీలు తీయాలని ఎందుకు తోచలేదు. ఇరాక్ లో బ్రిటిష్ సైనికులు సాగించిన యుద్ధ నేరాలపై కధనాలు ఎందుకు ప్రసారం చేయదు? ఆఫ్ఘనిస్ధాన్ లో ఇప్పటికీ కొనసాగుతున్న నాటో దళాల పౌరుల హత్యాకాండలపై డాక్యుమెంటరీలు ఎందుకు తీయదు? సిరియా పౌరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు పోషిస్తున్న సిరియా కిరాయి మూకలు సాగిస్తున్న సామూహిక హత్యాకాండలపై ఎందుకు నోరు మెదపదు? సిరియా కిరాయి తిరుగుబాటు పై పచ్చి అబద్ధాలను తానూ ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు?
ఈ  చానెళ్ల ప్రధాన కర్తవ్యం పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల పరిరక్షణే. వీరికి మానవహక్కులపై ఈ మాత్రం గౌరవం లేదు. తమ బాసుల ప్రయోజనాల కోసం ఒక హత్యాకాండపై గుండెలు బాదుకుంటాయి. అనేకానేక హత్యాకాండలను ప్రజాస్వామ్య సంస్ధాపనగా వేనోళ్ళా కీర్తిస్తాయి. స్వతంత్ర దేశాల పాలకులను హత్యలు చేయడాన్ని గొప్ప మానవహక్కుల పరిరక్షణగా ప్రచారం చేయడానికి సిగ్గు లేకుండా సిద్ధపడతాయి. మానవ హక్కులతో పాటు సకల అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే హక్కు పశ్చిమ దేశాల పాలకులకే ఉన్నాయని వీరి ప్రగాఢ నమ్మకం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి