27, మార్చి 2012, మంగళవారం

రు. 10.67 లక్షల కోట్ల ‘బొగ్గు కుంభకోణం’ బట్టబయలు చేసిన సి.ఏ.జి

వేలం వేయకుండా ప్రవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి ఏకంగా 10.67 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని రాజ్యాంగ బద్ధ సంస్ధ ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి) గురువారం వెల్లడించింది. విలువ రీత్యా 1.76 లక్షల కోట్ల 2 జి కుంభ కోణం కంటే ఇది ఆరు రెట్లు పెద్దది. 2004-2009 మధ్య కాలంలో 155 ఏకరేజ్ ల బొగ్గు గనులను వేల వేయకుండా 155 కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పిందని సి.ఏ.జి ఆరోపించింది. వీటిలో వందకు పైగా ప్రవేటు కంపెనీలే ఉన్నాయి. మిగిలినవి పేరుకి ప్రభుత్వ కంపెనీలే అయినప్పటికీ సగం షేర్లు ప్రవేటు కంపెనీల చేతుల్లో ఉండడం, ప్రభుత్వ కంపెనీలన్నీ ప్రవేటు కంపెనీలకే బొగ్గు కాంట్రాక్టులను అప్పజెప్పడం వలన ప్రభుత్వ కంపెనీలకు కేటాయించిన బొగ్గు గనుల్లో సైతం ప్రవేటు కంపెనీలే ప్రధాన లబ్దిదారులుగా ఉంటారు. విద్యుత్ కంపెనీలు, ఇనుము ఉక్కు కంపెనీలు, సిమెంటు కంపెనీలు ఈ కుంభ కోణంలో లబ్దిదారులుగా ఉన్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధీనంలో ఉన్న బొగ్గు శాఖలోనే ఈ కుంభ కోణం చోటు చేసుకోవడం గమనార్హం. 2 జి కుంభ కోణం తనకు తెలియదని తప్పించుకున్న ప్రధాని మన్మోహన్ తన ఆధీనంలో ఉన్న బొగ్గు శాఖలోనే చోటు కేసుకున్న భారీ కుంభకోణానికి ఏమని సమాధానం చెబుతాడో చూడవలసిందే. సంస్కరణల రధ సారధిగా అమెరికా, యూరప్ ల బడా కంపెనీల నుండి మన్ననలు అందుకుంటున్న మన్మోహన్, దేశ ఆర్ధిక వ్యవస్ధని పూర్తిగా భారతీయుల ప్రయోజనాలకి వ్యతిరేకంగా మలుస్తున్నాడనడానికి బొగ్గు కుంభ కోణం తాజా ఉదాహరణ. భారత దేశంలో విస్తారంగా ఉన్న ప్రకృతి వనరులకు అసలు సొంతదారులు భారతీయులు కాగా, ప్రభుత్వాలను అదుపులో పెట్టుకున్న స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలు మాత్రమే ఈ వనరులను కొల్లగొడుతున్నాయి. ఇటువంటి కంపెనీలనుండి భారత దేశ సంపదలను కాపాడవలసిన ప్రభుత్వాలు సంస్కరణల మాటున కంపెనీలతో కుమ్మక్కవుతున్నాయని తాజా కుంభ కోణం మరొకసారి వెళ్లడయింది.
“పెర్ఫార్మెన్స్ ఆడిట్ ఆఫ్ కోల్ బ్లాక్ ఎలోకేషన్” టైటిల్ తో సి.ఏ.జి బొగ్గు గనుల కేటాయింపుపై 110 పేజీల నివేదికను వెలువరించింది. బొగ్గు గానులని ఇష్టానుసారంగా కేటాయించడం వలన మార్చి 31, 2011 నాటి ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఖజానాకి రు. 10.67 లక్షల కోట్లు నష్ట వాటిల్లిందని సి.ఏ.జి నివేదిక తేల్చింది. ఇది కూడా అత్యంత తక్కువ ధరల ప్రకారం తేల్చిన లెక్క అని నివేదిక తెలిపింది. మీడియన్ గ్రేడ్ బొగ్గు ధరలను పరిగణించవలసి ఉన్నప్పటికీ, అతి తక్కువ గ్రేడ్ బొగ్గు కి ఉన్న ధరలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లెక్కించామని తెలిపింది. బొగ్గు గనుల కేటాయించినప్పటి ధరలను దృష్టిలో పెట్టుకుని చూసినా ఖజానాకి రు. 6.31 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని సి.ఏ.జి తెలిపింది.
ఎలా లెక్కించింది?
ఒక్కో బ్లాక్ కి సంబంధించిన లెక్క వేసేటపుడు అదే రకమైన బొగ్గు గనిలో ప్రభుత్వ రంగ కంపెనీ కోల్ ఇండియా కు వాస్తవంగా ఉత్పత్తి ఖర్చులు అదే సంవత్సరంలో ఎంత పడుతున్నదీ సి.ఏ.జి లెక్కించింది. కోల్ ఇండియా అమ్మకం ధరకూ, ఉత్పత్తి ఖర్చుకూ మధ్య తలెత్తిన తేడాను 90 శాతం తో సి.ఏ.జి హెచ్చించింది. అంటే అసలు నష్టంలో 90 శాతం వరకే సి.ఏ.జి పరిగణనలోకి తీసుకుంది. ఆ విధంగా వచ్చిన తేడా ఆ నిర్ధిష్ట బ్లాక్ ను కొనుగోలు చేసిన కంపెనీకి చేకూరిన విండ్ ఫాల్ గెయిన్ (అనుకోకుండా వచ్చిన లాభం) గా సి.ఏ.జి లెక్క తేల్చింది. అంచనా వేసిన నిల్వల కంటే పది శాతం తక్కువగా బొగ్గు లభ్యం అవుతుందన్న అంచనాతో సి.ఏ.జి తొంభై శాతం మాత్రమే పరిగణలోకి తీసుకుంది. సి.ఏ.జి అంచనా వేసిన తేడా, బొగ్గు కంపెనీలకు మామూలుగా వచ్చే లాభాల కంటే అదనమని గుర్తించాలి. “మైనింగ్ ప్లాన్, బొగ్గు వెలికి తీయడానికి అయ్యే ఖర్చులు, అమ్మకం సమయంలో బొగ్గుకి ఉన్న వాస్తవ ధర, బొగ్గు క్వాలిటీ.. వీటన్నింటిపైనా ఆధారపడి వాస్తవ విండ్ ఫాల్ గెయిన్ ఉండవచ్చని సి.ఏ.జి పేర్కొంది. అంటే తాను లెక్కించిన దాని కంటే అధిక విండ్ ఫాల్ గెయిన్ కంపెనీలు పొందవచ్చని సి.ఏ.జి సూచించింది.
సి.ఏ.జి నివేదిక ప్రధాన మంత్రి ఆధీనంలో ఉన్న బొగ్గు మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ నష్టాన్ని లెక్కించింది. అంటే సి.ఏ.జి నివేదిక దాదాపు ‘అంతిమ నివేదిక’ తో సమానం. సి.ఏ.జి నివేదిక అంశాలని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) బహిర్గతం చేసింది. సాధారణ బడ్జెట్ ఆమోదం పొందాక నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చునని టి.ఓ.ఐ తెలిపింది.
కంపెనీలకు కేటాయించిన ప్రతి ఒక్క బ్లాకుకు చెందిన ‘జియోలాజికల్ రిపోర్టు’ ను పరిశీలించిన సి.ఏ.జి ఇలా కేటాయించిన బొగ్గు నిల్వల మొత్తం 33,169 మిలియన్ టన్నులు ఉందని వెల్లడించింది. ఈ బొగ్గుతో 150,000 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని పరిశ్రమల వర్గాల ఉటంకిస్తూ టి.ఓ.ఐ తెలిపింది. భారత దేశం మొత్తం మీద ఇపుడు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను మరో 50 సంవత్సరాలపాటు ఈ బొగ్గు నిల్వల ఉత్పత్తి చేస్తాయని టి.ఓ.ఐ తెలిపింది. ప్రవేటు సంస్ధలకు ఈ కేటాయింపులవలన రు. 4.79 లక్షల కోట్లు, ప్రభుత్వ కంపెనీలకు రు. 5.88 లక్షల కోట్లు లబ్ది చేకూరిందని సి.ఏ.జి తెలిపింది. అయితే ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ప్రవేటు కంపెనీలకే బొగ్గు తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేస్తాయి. కనుక ప్రభుత్వ కంపెనీలకు విండ్ ఫాల్ గెయిన్స్ వల్ల అదనంగా చేకూరే లబ్ది పెద్దగా లెక్కలోనిది కాదని టి.ఓ.ఐ తెలిపింది.
బొగ్గు కుంభ కోణంలో లబ్ది పొందిన బడా ప్రవేటు కంపెనీలు ఇలా ఉన్నాయి. టాటా గ్రూపు కంపెనీలు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, అనీల్ అగర్వాల్ గ్రూప్, ఢిల్లీకి చెందిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నేకో, నాగపూర్ కి చెందిన అభిజీత్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్. ఇవి కాక మధ్య స్ధాయి కంపెనీలు ఆదానీ గ్రూప్, ఎస్సార్ విద్యుత్ కంపెనీలు, ఆర్సీలర్ మిట్టల్ ఇండియా, లగడపాటి రాజగోపాల్ కి చెందిన  లాంకో గ్రూప్ లు లబ్ది పొందాయి. ఇలా లబ్ది పొందిన ప్రవేటు కంపెనీలు మొత్తం వందకు పైగా ఉన్నాయని సి.ఏ.జి తెలిపింది. ఈ లిస్టులో రిలయన్స్ లేకపోవడానికి కారణం దాని కోసం సి.ఏ.జి ప్రత్యేక విభాగాన్ని కేటాయించడమే. రిలయన్స్ పవర్ కి కేటాయించబడిన 12 బొగ్గు గనుల బ్లాకుల ద్వారా ఆ కంపెనీకి 25 యేళ్లలో 15,849 కోట్ల రూపాయలు అదనపు లబ్ది చేకూరుతుందని సి.ఏ.జి మరొక నివేదిక వెలువరించింది.
సమర్ధనలు, బుకాయింపులు
టి.ఓ.ఐ పత్రిక సి.ఏ.జి నివేదికపై లబ్దిదారు కంపెనీలను స్పందన కోసం సంప్రదించగా చాలా కంపెనీలు స్పందించలేదని తెలిపింది. టాటా, ఆదానీ, ఏ.వి.బ్ర్లా గ్రూప్, ఎస్సార్, భూషణ్ పవర్, అభిజిత్ గ్రూప్  కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. జిందాల్ కంపెనీ ప్రతినిధి స్పందించాడు. “ప్రభుత్వ కంపెనీలు పనులు మొదలు పెట్టలేకపోతున్నాయి. మేము రెండు బ్లాకుల్లో పని మొదలు పెట్టామని చెప్పడానికి గర్విస్తున్నాం. దేశానికి సంపదను సమకూర్చడంలో మేము ఆ విధంగా ముందున్నాం. కోల్ ఇండియాకి మైనింగ్ ప్లాన్స్ ఏవీ లేవు. ఈ బొగ్గు బ్లాకులు ఆకర్షణీయంగా లేవని కోల్ ఇండియా (ప్రభుత్వ కంపెనీ) వదిలేసింది. సి.ఏ.జి కి దాని అభిప్రాయాలు ఎలా ఉన్నా జిందాల్ కానీ ఈ యితర ప్రవేటు కంపెనీ గానీ అన్నీ భారత దేశ కంపెనీలే. అవి భారత దేశంలో సంప్దలు నిర్మిస్తున్నాయి.” అని జిందాల్ ప్రతినిధి వాకృచ్చాడు.
అయితే 2 జి స్పెక్ట్రమ్ ని ప్రారంభంలో కొనుగోలు చేసినవారు కూడా భారత కంపెనీలే ప్రభుత్వం నుండి లైసెన్సు లు పొందిన కొద్ది కాలానికే అవి విదేశీ కంపెనీలకి స్పెక్ట్రమ్ ని అధిక ధరలకు అమ్ముకుని పెద్ద ఎత్తున లాభాలు పొందాయి. స్పెక్ట్రమ్ లైసెన్సులు పొందిన కంపెనీల్లో అధిక కంపెనీలకు టెలీ కమ్యూనికేషన్ల రంగంలో ఏ మాత్రం అనుభవం లేనివి. దానికి కారణం అవి ఏవో ఒక బడా కంపెనీకి బినామీ కంపెనీలు కావడమే. ఊరూ పేరు లేని కొత్త కంపెనీలకు స్పెక్ట్రమ్ లైసెన్సులు సంపాదించిన బడా కంపెనీలు అనంతరం ఆ కంపెనీలను తామే కొనుగోలు చేసినట్లు నాటకం ఆడాయి. అదీ కాక బొగ్గు, విద్యుత్, స్టీల్ కంపెనీల విషయానికి వస్తే ప్రవేటు కంపెనీలేవీ ఒకే ఒక వ్యాపార కుటుంబం ఆధీనంలో లేవు. లేదా మొత్తంగా భారతీయ కంపెనీల ఆధీనంలోనే ఉన్న సంస్ధలు కావు. ప్రతి భారతీయ ప్రవేటు కంపెనీలోనూ విదేశీ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. విదేశాలకు ముఖ్యంగా అమెరికా, యూరప్ లకు చెందిన ప్రవేటు మానుఫాక్చరింగ్ కంపెనీలే కాక వాల్ స్ట్రీట్ కి చెందిన బడా బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు వీటిలో ద్రవ్య పెట్టుబడులను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను వాల్ స్ట్రీట్, యూరప్ ల ద్రవ్య కంపెనీలే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న విషయం దృష్టిలో పెట్టుకున్నట్లయితే బొగ్గు గానుల్ని ఆయాచితంగా పొందిన కంపెనీల ద్వారా లబ్ది పొందేదేవరో ఇట్టే అర్ధం అవుతుంది. భారత దేశంలో మారు మూల పల్లెలకు వ్యాపించిన మైక్రో ఫైనాన్స్ కంపెనీల లో సైతం వాల్ స్ట్ఱీట్ కంపెనీల ద్రవ్య పెట్టుబడులు ఉన్న నేపధ్యంలో వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడీ హస్తాలు ఆంద్ర ప్రదేశ్ లోని మారు మూల వీధుల్లోకి కూడా చొచ్చుకు వచ్చాయని అర్ధం కాగలదు.
బొగ్గు గనులను పొందిన ప్రభుత్వ కంపెనీలలో ఎన్.టి.పి.సి ముఖ్యమైనది. బొగ్గు వ్యాపార కంపెనీ ఎం.ఎం.టి.సి అనేక పశ్చిమ బెంగాల్ కంపెనీలు, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్ లకు చెందిన ఖనిజాలు, గనుల అభివృద్ధి సంస్ధలు బొగ్గు గనులు పొందినవాటిలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్ధ తన గనులను గాలి జనార్ధన రెడ్డి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అల్లుడు లాంటి ప్రవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పిన సంగతి మన ముందు ఉంది. కనుక ప్రభుత్వ సంస్ధలకు గనులు అప్పజెప్పినందువలన లాభపడేది ప్రజలో, దేశమో కాదని అర్ధం చేసుకోవచ్చు.
తమకు కేటాయించిన బొగ్గు గనులను ఇంకా తమ చేతికి రాలేదని కొన్ని ప్రవేటు కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు చెప్పారని టి.ఓ.ఐ తెలిపింది. క్లియరెన్సు లు ఇంకా రానందున గనుల తవ్వకం ఇంకా మొదలు కాలేదని మరి కొన్ని కంపెనీలు తెలిపాయి. కేటాయింపులు జరిపిన దగ్గర్నుండి బొగ్గు రేట్లు బాగా పెరిగినందున అనుకోకుండా లబ్ది చేకూరడం నిజమేనని కొన్ని కంపెనీల అధికారులు అంగీకరించారని టి.ఓ.ఐ తెలిపింది. చాలా బ్లాకులు విద్యుత్, స్టీల్ కంపెనీలకు కేటాయించినందున ఆ బొగ్గుని బహిరంగ మార్కెట్లో వ్యాపారం చేసుకోవడం కుదరదని బొగ్గు మంత్రిత్వ శాఖ చెపుతోంది. విద్యుత్ రేట్లను నియంత్రించే వ్యవస్ధలు ఉన్నందున సి.ఏ.జి లెక్కించిన విండ్ ఫాల్ గెయిన్స్ అంత ఉండకపోవచ్చని బొగ్గు శాఖ చెబుతోంది. స్టీల్, సిమెంటు విషయానికి వస్తే మార్కెట్లలో పోటీ పడవలసి ఉన్నందున ఆ మేరకు కంపెనీలు తమ లాభాలను వినియోగదారులకు అందిస్తాయని ఆ శాఖ చెబుతోంది.
బొగ్గు శాఖ చెప్పేవేవీ వాస్తవం లో జరుగుతున్నవి కావు. మార్కేట్ పోటీవల్ల ధరలు తగ్గడం, జనం లబ్ది పొందడం ఇంతవరకూ జరగలేదని నానాటికీ పేరుగున్న ఇళ్ల నిర్మాణ ఖర్చులే చెబుతున్నాయి. స్టీలు, సిమెంటు ధరలు ప్రతి సంవత్సరం అంతకంతకూ పెరగడమే తప్ప కనీసం నిలకడగా ఉన్న దాఖలాలే లేవు. ఒకే సంవత్సరం చూసుకున్నా ప్రతి సీజన్ కీ ధరలు పెరుగుతూ పోతాయి. కంపెనీలకు వచ్చే ఆయాచిత లాభాలు వినియోగదారుల వరకూ రావడం అన్నది ఒట్టిమాట. పెట్రోల్, డీజెల్ ధరలు అంతర్జాతీయ మార్కేట్లో తగ్గినపుడు సదరు తగ్గుదలను ప్రజలకు చేర్చే పనిని ప్రభుత్వాలే చేయడం లేదు. అలాంటిది ప్రవేటు కంపెనీలు ప్రభుత్వ తప్పిదం ద్వారా తమకు చేకూరే ఆయాచిత లాభాలను ప్రజలకు చేరుస్తాయా? అదీ కాక ప్రభుత్వ ఖజానాకి వస్తున్న నష్టాన్ని రాబట్టుకోవడం, చేసిన తప్పులను సరిదిద్దుకోవడం మాని ప్రవేటు కంపెనీలకు అదనపు లాభాలు చేకూరడాన్ని సమర్ధించుకోవడం తగని పని. అది ప్రజా స్వామ్య ప్రభుత్వాలు చేయదగిన పని కాదు. గాలి జనార్ధన రెడ్డికి కేటాయించిన ఓబులా పురం బొగ్గు గనులు వాస్తవానికి విదేశాలకు తరలించి అమ్ముకోవడానికి కాదు. కడప జిల్లాలో తలపెట్టిన ‘బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ’ కోసం అవి కేటాయించారు. వాస్తవంలో జరిగినదేమిటి? గాలి గారు బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ అసలు కట్టనే లేదు. ఫ్యాక్టరీ కట్టకుండానే ఇనుప గానుల్ని తవ్వుకుని చైనాకి అమ్మేశాడు. లబ్ది పొందింది గాలి కుటుంబం మాత్రమే. విలువైన ఇనుప గనులు భారతీయులు కట్టుకున్న ఇళ్లకేవీ ఉపయోగపడకపోగా చైనాకి తరలివెళ్ళాయి.
బొగ్గు శాఖ వాదనలు సి.ఏ.జి కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. “బొగ్గు సహజ వనరు. ప్రవేటు వారికి అప్పజెప్పవలసి వస్తే వారి మధ్య పోటీ నిర్వహించి ఎవరు ఎక్కుక్వ ధర ఇస్తే వారికి అమ్మాలి. (అంటే వేలం వెయ్యాలి). వేలం వెయ్యడం ద్వారా వ్యవస్ధలో పారదర్శకత, లక్ష్య శుద్ధి ఏర్పడతాయి. నిజానికి 2 జి స్పెక్ట్రమ్ విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు చేసిన పరిశీలన సి.ఏ.జి అభిప్రాయం తో ఏకీభవిస్తోంది కూడా. సహజ వనరులపై ప్రభుత్వానికే యాజమాన్యం ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. సహజ వనరులకు ప్రభుత్వం ఒక ట్రస్టీగా, కాపలాదారుగా వ్యవహరించాలని కోర్టు పేర్కొన్నది” అని సి.ఏ.జి బొగ్గు శాఖ వాదనను తిప్పి కొట్టింది. “ప్రవేటు కంపెనీలు వనరులను పెంపొందించవచ్చు (augment). కానీ దాని లక్ష్యం ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేదిగానే ఉండాలి. నిజాయితీ, బాధ్యత లతో ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వంగానీ, దాని ఏజన్సీలు లేదా ఉపకరణాలుగా వ్యవరించే సంస్ధలు గానీ ప్రవేటు సంస్ధలకు లబ్ది చేకూర్చితే ఆ చర్యలకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. పారదర్శకత, విచక్షణ పాటించాలి. అటువంటి విధానాలకు లక్ష్య శుద్ధి ఉండాలి. దేశ పౌరుల తరపున ప్రభుత్వం వనరులపై చట్టబద్ధమైన యాజమాన్యం కలిగి ఉంటుంది. సహజ వనరులను తక్కువ ధరలకు ప్రవేటు వారికి అప్పజెపితే అది నేరుగా వినియోగదారులకు చేరేదిగా ఉండాలి” అని సి.ఏ.జి బొగ్గు శాఖ వాదనలు తిరస్కరించింది. విద్యుత్ ధరలను రెగ్యులేటరీ కమిషన్ నియంత్రిస్తుందన్న బొగ్గు శాఖ వాదనను కూడా సి.ఏ.జి తిరస్కరించింది. ఆ నియంత్రణలు వ్యాపార కంపెనీలకు వర్తించవన్న సంగతిని గుర్తు చేసింది. బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ ఆధీనంలో ఉన్న సంగతి ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
జూన్ 2004 లో బొగ్గు మంత్రిత్వ శాఖ తనతో పంచుకున్న అభిప్రాయాలను కూడా సి.ఏ.జి గుర్తు చేసింది. “కోల్ ఇండియా సంస్ధ తన బొగ్గు గనులను తవ్వి తీసిన బొగ్గును సరఫరా చేసే ధరకూ, క్యాప్టివ్ బొగ్గుగనులు పొందిన కంపెనీలకు బొగ్గు ఉత్పత్తి కోసం అవుతున్న ఖర్చుకూ భారీ తేడా ఉంది. ఆ విధంగా కంపెనీలకు ‘విండ్ ఫాల్ గెయిన్స్’ భారీగా సమకూరుతుంది. ఈ గెయిన్స్ లో కొంత భాగాన్ని ప్రభుత్వం వాస్తవంగా వేలం వేయడం దారా పొందవలసి ఉంది” అని బొగ్గు శాఖ తనతో అభిప్రాయాలూ పంచుకుంటూ వ్యాఖ్యానించిందని సి.ఏ.జి గుర్తు చేసింది. ఈ విధంగా వేలం వేయడంద్వారా విండ్ ఫాల్ గెయిన్స్ ని ప్రభుత్వమే సొంతం చేసుకునేందుకు తగిన విధాన పరమైన ప్రక్రియ జూన్ 28, 2004 తేదీన ప్రారంభం అయినప్పటికీ ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని సి.ఏ.జి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించిన వార్తతో పార్లమెంటులో ప్రతిపక్షాలు గొడవ ప్రారంభించాయి. రాజ్య సభలో గొడవ జరుగుతున్నపుడు ప్రధాని మన్మోహన్ సభలోనే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. ప్రతిపక్షాల గొడవ ఎలా ఉన్నా అవి పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్ధితి నెలకొని ఉంది. తమ వనరులు ప్రవేటు దొంగల బారిన పడకుండా కాపాడుకోవలసింది ప్రజలే. దోపిడీ కి వంత పాడుతున్నవారికి శక్తివంతమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలే రూపొందించుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి