27, మార్చి 2012, మంగళవారం

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు 2.4 లక్షలు

అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏడవ స్ధానంలో ఉందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2.4 లక్షల మంది భారతీయులు ఎటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని, 2000, 2011 సంవత్సరాల మధ్య వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అమెరికా తెలిపింది. ఇదే కాలంలో  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 84.6 లక్షల నుండి 1.151 కోట్లకు పెరిగిందని కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
మెక్సికోకి  చెందిన వారు అత్యధికంగా 68 లక్షల మంది చట్ట విరుద్ధంగా అమెరికాలో నివశిస్తుండగా సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ దేశస్ధులు 6.6 (60.7 లక్షల జనాభా) లక్షలతో రెండవ స్ధానంలో ఉన్నారు. సెంట్రల్ అమెరికా దేశాలే అయిన గ్వాటెమాలా (1.43 కోట్ల జనాభా) దేశస్ధులు 5.2 లక్షలతో మూడవ స్ధానంలోనూ, హోండురాస్ దేశస్ధులు (76 లక్షల జనాభా) 3.8 లక్షలతో నాల్గవ స్ధానంలోనూ ఉన్నారు. 
2.8 లక్షలతో చైనీయులు ఐదవ స్ధానంలో ఉండగా, ఆ తర్వాత స్ధానం 2.7 లక్షలతో ఫిలిప్పైన్స్ దేశానిది. ఇండియా తర్వాత కొరియా 2.3 లక్షలతో ఎనిమిదవ స్ధానంలో ఉండగా, దక్షిణ అమెరికా దేశం ఈక్వడార్ దేశస్ధులు 2.1 లక్షలతో తొమ్మిదవ స్ధానంలోనూ, 1.7 లక్షలతో వియత్నాం దేశీయులు పదవ స్ధానంలో ఉన్నారు. ఆసియా దేశాలలో చైనాది ఆగ్ర స్ధానం కావడం గమనార్హం.
అనధికారికంగా నివసిస్తున్న 1.15 కోట్లమందిలో 16 లక్షలు (14 శాతం) జనవరి 1, 2005 తర్వాత వచ్చినవారే. 2000-2004 మధ్య అత్యధిక సంఖ్యంలో 33 లక్షల మంది (29 శాతం) చట్ట విరుద్ధంగా అమెరికాలో ప్రవేశించగా, 1995-99 మధ్య 30 లక్షల మంది (26 శాతం) ప్రవేషించారని అమెరికా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా జనాభా 31.32 కోట్లలో 3.67 శాతం మంది చట్ట విరుద్ధంగా నివసిస్తున్నవారేనన్నమాట.
అమెరికాలో ప్రధాన జనాభాగా ఉన్న తెల్లవారు కూడా యూరప్ దేశాల నుండి ప్రధానంగా బ్రిటన్, స్పెయిన్ దేశాల నుండి వలస వచ్చినవారే. వాస్తవ అమెరికన్లు రెడ్ ఇండియన్లు మాత్రమే. ఇతరులంతా విదేశాలనుండి అక్కడికి వెళ్ళినవారే. అందువల్లనే భారత దేశం లాంటి దేశాలతో పోలిస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సరళతరంగా ఉంటాయి. యూరప్ దేశాల నుండి వలస వచ్చిన వారు నేటివ్ అమెరికాంలయిన రెడ్ ఇండియన్లను పశ్చిమ ప్రాంతానికి నెట్టుకుంటూ పోయి చివరికి అలాస్కా ప్రాంతానికి పరిమితం చేశారని చరిత్ర చెబుతోంది. అమెరికాలో అక్కడక్కడా రెడ్ ఇండియన్లు కనిపించినప్పటికీ ఆ దేశ భూములు, పరిశ్రమలు, ఇతర కంపెనీలు ప్రధానంగా తెల్లవారి చేతిలోనే ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి