2, మార్చి 2012, శుక్రవారం

ఇండియా, చైనాల్లో కార్ల కొనుగోలు వల్లనే ఆయిల్ రేట్లు పెరగడం -ఒబామా


అమెరికాలో జనం లాగానే ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాల్లోని జనం కూడా కార్లు కొనడం ఎక్కువయిందనీ అందువల్లనే ఆయిల్ ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయనీ ఒబామా కొత్త సంగతి కనిపెట్టాడు. అక్కడికి కార్లు కొని సుఖపడే యోగం అమెరికా ప్రజల సొంతమైనట్లు. వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, అవినీతి, దోపిడి లవల్ల తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులను పరిష్కరించలేక మూడో ప్రపంచ దేశాలపై పడి ఏడ్వడం అమెరికా, యూరప్ లకు మామూలైపోయింది. తమ కంపెనీల దుర్మార్గాన్ని కట్టడి చేయడం చేతకాని దద్దమ్మలు ఇండియా, చైనాలను ఆడిపోసుకోవడాన్ని ఆ దేశాల ప్రభుత్వాలు సీరియస్ గా పట్టించుకోవలసిన అవసరం బాగా కనిపిస్తోంది.
ఇండియా, చైనా, బ్రెజిల్ జనాన్ని చూసి కుళ్లుకోవడం, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకి అమెరికా తప్ప ప్రపంచం అంతా కారణమే నని చెప్పడం ఒబామాకీ అక్కడి ప్రభుత్వానికీ ఇదే కొత్తది కాదు. గతంలో ఈ దేశాల జనం ఎక్కువ తినడం వల్లనే బియ్యం, గోధుమ ల ధరలు పెరుగుతున్నాయని ఒబామాతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఇప్పుడేమో పెట్రోల్, డీజెల్ రేట్లు పెరగడానికి కూడా ఇండియా, చైనాల జనమే కారణమనీ నడక, సైకిళ్ళు వదిలి పెట్టి కార్లలో తిరగడం వల్లనే వాటి ధరలు కొండెక్కుతున్నాయనీ వదరుతున్నారు.
ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ఎన్నికల ప్రచార యుద్ధం నడుస్తోంది. ఒబామా రెండోసారి అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నాడు. ఒబామాకి సరైన ‘ఎనర్జీ పాలసీ’ లేకపోవడం వల్ల అమెరికా ప్రజలు అధిక ధరలు పెట్టి పెట్రోల్, డీజిల్ కోనుగోలు చేయవలసి వస్తోందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తన వద్ద సరుకులేని ఒబామా తాజాగా ఇండియా, చైనా ,బ్రెజిల్ దేశాల జనం పైకి ఆయిల్ ధరల పెరుగుదలకి కారణంగా చూపడానికి సిద్ధపడ్డాడు. మియామి యూనివర్సిటీలో గురువారం విద్యార్ధుల సమావేశంలో మాట్లాడిన ఒబామా ఈ కొత్త సంగతి చెప్పి తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
“దీర్ఘ కాలంలో ఆయిల్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతాయి. దానికి అతి పెద్ద కారణం ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఆయిల్ డిమాండ్ పెరగడమే. ఒక్క 2010 లోనే చైనాలో పది మిలియన్ల (కోటి) కార్లు అమ్ముడుపోయాయి. ఒకే ఒక్క దేశంలో ఒకే సంవత్సరంలో పది మిలియన్ కార్లు అమ్ముడుపోయాయి. అన్ని కార్లకి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అమెరికా జనం కోరుకున్నట్లే ఇండియా, చైనా, బ్రెజిల్ జనం కూడా కార్లలో తిరగడానికి ఉపలాటపడుతున్నపుడు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే గాని తగ్గదు. అంటే దీనర్ధం అమెరికా ప్రజలకి ఏమన్నట్లు? ఆయిల్ ఇంకా ఇంకా తవ్వుకోవడం వల్ల ఈ సమస్య నుండి బైటికి రాలేమని అర్ధం. కాబట్టి రిపబ్లికన్ల ప్రచారంతో ఫూల్స్ కావద్దు” అని ఒబామా విద్యార్ధుల సమావేశంలో అన్నాడు.
అదండీ సంగతి! భారతీయులు, చైనీయులు ఎక్కువ తినడం వల్లనే బియ్యం, గోధుమల ధరలు పెరుగుతున్నాయని హిల్లరీ క్లింటన్ కూసినపుడే మన ప్రధానో లేదా ఇతర ప్రభుత్వ నాయకులో వారికి సరైన సమాధానం చెప్పి ఉంటే ఒబామా మళ్లీ ఈ కూత కూసి ఉండేవాడా? హిల్లరీ క్లింటన్ ఆ మాట అన్నపుడు చైనా ఘాటుగానే స్పందించింది. అమెరికా ఆర్ధిక సమస్యలకి చైనా కరెన్సీ విలువని చైనా ప్రభుత్వం మేనేజ్ చేస్తోందని అమెరికా, యూరప్ లు ఆరోపించినపుదు కూడా చైనా గట్టిగా సమాధానం చెప్పింది. ఆ సమయంలో చైనా ప్రధాని వివిధ గణాంకాలతో సహా అమెరికా ఆర్ధిక సమస్యలకి ఆమెరికాయే ఎలా కారణమో వివరించి చూపాక మళ్లీ వాళ్లు నోరు తెరవలేదు. చైనా ప్రధాని వాదనలని ఎదుర్కొవడానికి కూడా వారు సాహసించలేదు. అటువంటి సమాధానం భారత పాలకుల నుండి కరువైపోవడమే భారత ప్రజల దౌర్భాగ్యం.
చైనా తో పాటు బ్రెజిల్ కూడా అమెరికాకి ఎప్పటికప్పుడు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెబుతూ వచ్చింది. భారత రాయబారులని, మాజి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సహా అనేక మంది భారత రాజకీయ నాయకుల్ని అమెరికా విమానాశ్రయాల్లో పట్టుకుని వళ్లంతా తడిమి, సిక్కు రాయబారుల తలపాగాలు విప్పి పరీక్షించి అవమాన పరిచారు. ఒక సారి మహిళా రాయబారిని క్యూలో నుండి పక్కకు తీసుకెళ్ళి మరీ చీరంతా తడిపి పరీక్షించి అవమాన పరిచినా ప్రతిచర్య తీసుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధపడలేదు. మన విదేశాంగ మంత్రో, ప్రధానో ప్రకటనల్లో చూపించే హుంకరింపులు చేతల్లో చూపరు.
ఇదే పద్ధతి బ్రెజిల్ రాయబారుల పైన కూడా అమెరికా అమలు చేసినపుదు బ్రెజిల్ ఊరుకోలేదు. విమానాశ్రయాల వద్ద అందరికీ ఒక లైను ఉంటే అమెరికన్ల కోసం ప్రత్యేకంగా లైను పెట్టి మరీ వళ్లంతా వెతికించింది అక్కడి ప్రభుత్వం. అమెరికన్ ప్రయాణీకుల పైన అనుమానం వస్టే బట్టలన్నీ ఊడదీసి చెక్ చేసి మరీ విమానాల లోపలికి అనుమతించారు. అమెరికన్లు, యూరోపియన్ల హిపోక్రసీ పట్లా, అహంకారం పట్లా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా అనేక సార్లు అవహేళన చేస్తూ ప్రకటనలు జారీ చేశారు. తమకు అందే గౌరవం ప్రతి భారతీయుడికీ అందాలన్న జ్ఞానం భారత ప్రభుత్వ అధికారులకూ, మంత్రులకూ ఉంటుందా అన్నది ఎప్పటికీ అనుమానమే. బ్రెజిల్ తీసుకున్న చర్యలను భారత ప్రభుత్వం తీసుకోలేకపోయింది. అందుకే హిల్లరీ క్లింటన్ ఎన్నిసార్లు సారీ చెప్పినా మళ్లీ మళ్ళీ భారత అధికారులు, ప్రముఖలకూ అమెరికా విమానాల్లో అవమానాలు జరుగుతూ వచ్చాయి. అవమానం జరిగినపుడు ఆ ఘటనల సమాచారం బైటికి పొక్కకుండా చూడడంలో భారత ప్రభుత్వాలకు ఆసక్తి ఉంటుంది తప్ప అవి జరగకుండా చర్యలు తీసుకోవడంలో ఆ ఆసక్తి కొద్దిగయినా ఉండదు.
ఇదంతా ఒక ఎత్తైతే భారత్, చైనా, బ్రెజిల్ దేశాల ప్రజలు తమ సుఖాలకు తగిన ఏర్పాట్లు చేసుకోవడమే ఒక పాపం అన్నట్లుగా అమెరికా ప్రముఖుల ప్రకటనలు ఉండడం ఒక ఎత్తు. సామాన్య జనం కనీసం కడుపునిండి తినడాన్ని కూడా తమకు సమస్యలను తీసుకువస్తున్నదన్న పాశ్చాత్యుల ప్రకటనలు ఎంత దుర్మార్గమో వారికి తట్టడం లేదు. “ఒబామా ప్రకటనలో తప్పేముంది? హిల్లరీ వ్యాఖ్యలో తప్పేముంది?” అని ప్రశ్నించే భారతీయ సేవక జనానికీ తక్కువేం లేదు. “కార్లు ఎక్కువ కొంటె ఆయిల్ ఎక్కువ అవసరం ఉంటుంది. అందువల్ల ఆయిల్ డిమాండ్ అధికం కావడం సహజమే కదా? ఆ విషయమే ఒబామా చెప్పాడు. అందులో తప్పేముంది?” అని ఒబామా తరపున వకాల్తా పుచ్చుకునే అమెరికన్ ఎన్నారైలు లేకపోలేదు.
ఆయిల్ ధరలు ఎప్పటినుండి పెరుగుతున్నాయి? అవి పెరగడం ఇప్పుడే జరుగుతున్న కొత్త పరిణామమా? అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఆయిల్ ధర 108 డాలర్లుగా ఉంది. ఈ ధర మూడేళ్ల క్రితం ఆర్ధిక సంక్షోభం తలెత్తక మునుపు 2008 లో 150 డాలర్లను తాకింది. అప్పటితో పోలిస్తె వాస్తవానికి ఆయిల్ ధర తగ్గిపోయినట్లు స్పష్టం అవుతోంది. ఇదొక సంగతి కాగా భారత దేశంలో గానీ, చైనాలో గానీ కార్ల కొనుగోలు పెరిగింది గత ఐదారేళ్లుగానే తప్ప అంతకు ముందు లేదు. ఆయిల్ ధరలు పెరగడం అన్నది మాత్రం కొన్ని దశాబ్దాల నాటి సంగతి. కొన్ని దశాబ్దాల నాటి పరిణామం అయిన ఆయిల్ ధరల పెంపుదలతో ఇండియా, చైనా, బ్రెజిల్ జనాల కార్ల కొనుగోలు తో ముడి పెట్టడం ఆర్ధిక పరిణామాలపైన కనీస జ్ఞానం ఉన్నవారెవరైనా చెయ్యలేని పని. ఇటువంటి తలతిక్క వాదనలు అమెరికా, యూరప్ దేశాల రాజకీయ నాయకులూ, అధికారులకే సాధ్యం.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం అనేక పరిణామాలు ప్రపంచమంతటా చోటు చేసుకున్నాయి. అమెరికా, యూరప్ ల ప్రభుత్వాలు పొదుపు విధానాల పేరుతో ఆ దేశ కార్మికులు, ఉద్యోగుల కు ఇస్తున్న అనేక మానిటరీ సౌకర్యాలను కత్తిరించివేశాయి. బోనస్ లు, నిరుద్యోగ భృతి, ప్రసూతి భృతి లాంటి అనేక సంక్షేమ చర్యలను రద్దు చేసుకోవడంతో పాటు అక్కడి కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనా, ఇండియా లాంటి దేశాలకు తరలిస్తున్నాయి. చైనా, ఇండియా, బ్రెజిల్ దేశాల్లో అత్యంత తక్కువ ధరలకు దొరుకుతున్న లేబర్ ద్వారా లాభాలు పెంచుకోవడానికి తరలి వెళ్తున్నాయి. అక్కడ ఉన్న బలహీన పర్యావరణ చట్టాలు, చీప్ లేబర్, ఉండీ లేని కార్మిక హక్కులు తదితరాల ద్వారా లాభాలను అనేక రెట్లు పెంచుకోవడానికి వారికి వీలుగా ఉన్నాయి. ఈ పరిణామాలతో ఉత్పత్తి కార్యక్రమాలు గణనీయంగా ఆసియాకు షిఫ్ట్ అయ్యాయి. అమెరికా, యూరప్ లలో కంపెనీలు ఇస్తూ వచ్చిన సౌకర్యాలు మాత్రం షిఫ్ట్ కాకపోవడాన్ని ఇక్కడ గుర్తించాల్సిన ప్రధాన విషయం.
ఈ పరిణామాలతో అమెరికా, యూరప్ లలో కార్మికులు, సాధారణ ప్రజానీకం బాగా నష్టపోతున్నారు. అందుకే వారు ఔట్ సోర్సింగ్ కి వ్యతిరేకంగా మారిపోయారు. ఈ సంగతిని గుర్తించడంవల్లనే ఔట్ సోర్సింగ్ రద్దు చేస్తామంటూ ఒబామా అనేక సార్లు వాగ్దానం చేస్తుంటాడు. ఆ వాగ్దానాలు అమలులోకి రావన్నది వేరే సంగతి. కంపెనీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఓట్ సోర్సింగ్ ని రద్దు చేసే సాహసం అమెరికా, యూరప్ పాలకుకు చెయ్యలేరు. కాని ఆ పేరుతో శుష్క వాగ్దానాలు చేస్తూ ప్రజలని ఆకట్టుకోవడం మాత్రం వారు మానరు. అమెరికా, యూరప్ లలోని పెట్టుబడిదారీ వర్గం ప్రయోజనాల కోసం తాము అనుసరిస్తున్న విధానాల వల్లనే అక్కడి ప్రజలకు సమస్యలు వస్తున్న సంగతిని కప్పి పెట్టడానికే అందులో ఇండియా, చైనా, బ్రెజిల్ ప్రజానీకం పాత్ర ని చొప్పించాలని ఒబామా లాంటి వారు దుర్మార్గ పూరితంగా ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తిగా వారి సమస్య. అమెరికా, యూరప్ ల ప్రజలు తేల్చుకోవలసిన సమస్య. వారలా తేల్చుకుంటారన్న భయంతోనే అక్కడి పాలకులు నెపాన్ని మూడో ప్రపంచ దేశాలపైకి ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్ ల పైకి నెట్టేస్తున్నారు.
ఒబామా, హిల్లరీలు లాంటివారి ప్రకటనల్లో చైనా, ఇండియా, బ్రెజిల్ లు అభివృద్ధి సాధిస్తున్నట్లుగా అర్ధం గొచరిస్తుంది. అది వాస్తవ విరుద్ధం. ధనికులు మరింత ధనికులుగానూ, పేదలు మరింత పేదలుగానూ మారుతున్నదే వాస్తవ సంగతి. ఇటీవలి కాలంలో చైనా, ఇండియాల్లో ఎగువ మధ్య తరగతి ప్రజల ఆర్ధిక శక్తి పెరిగినప్పటికీ కార్లు విలాస వస్తువుగా చూస్తున్న పరిస్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా కార్లు లాంటి విలాస వస్తువుల దిగుమతులపై పన్నులు ఎత్తేయడమే కాకుండా, ఏకంగా కార్ల కంపెనీలనే దేశంలోకి అనుమతించారు. దానివల్ల అనివార్యంగానే కార్ల ధరలు మరి కొద్దిమందికి అందుబాటులోకి వచ్చాయి. భారత దేశంలో తొంభైల వరకూ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలలోని ఉద్యోగ వర్గం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలు కూడా ఒక మాదిరి ధనికులుగా భారత దేశంలో ఉన్నారు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలోనూ, మున్సిపాలిటీలు, కార్పొరెషన్లలోనూ ఉన్న కోట్లాది ఉద్యోగులు కూడా వీరికి జత కూడారు. వీరందరికీ ఏదోమేరకు కార్లు అందుబాటులోకి వచ్చిన పరిస్ధితిని చూడగలం. అయితే ఈ పరిస్ధితినే భారత దేశ అభివృద్ధిగానో, కార్లలో తిరుగుతున్న భారత దేశంగానో ప్రకటించడం, ఆడిపోసుకోవడం దుర్మార్గమైన సంగతి.
చైనాలోనూ ఇదే పరిస్ధితి. సోషలిస్టు వ్యవస్ధ కొనసాగినన్నాళ్లూ అక్కడి ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఆర్ధిక శక్తినీ, సౌకర్యాలనూ అందుబాటులోకి తెచ్చింది. ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ అన్ని విద్యా సౌకర్యాలనూ దేశంలోని అత్యధిక ప్రజానీకం చేరువకు తేవడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు తదితర ఉత్పత్తి రంగాల్లో పని చేస్తున్న శ్రామిక జనం ఆర్ధిక శక్తి పెరిగేలా చర్యలు తీసుకుంది. అటువంటి సోషలిస్తు పునాదులపైనే ఈనాడు చైనా కంపెనీలు సాధిస్తున్న మార్కెట్ సౌకర్యాలు ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, కమ్యూనిస్టు పార్టీలోనూ ఉన్నత స్ధానాల్లో ఉన్న వారు పెత్తందారీ వర్గంగా ముందుకు వచ్చి నూతనంగా చైనాను నింపేసిన వ్యాపార వాతావరణంలో విపరీతంగా లాభపడ్డారు. వారే చైనాలో కొత్త ధనికవర్గంగా తయారైనారు. వారు సాధించిన అభివృద్దే చైనా అభివృద్ధిగా ప్రపంచం ముందు కనపడుతోంది.
అయితే భారత్, చైనాల్లో ఆకలి, దరిద్రాలతో వేగుతున్న విశాలమైన ప్రజానీకం యధావిధిగా కొనసాగుతున్న సంగతిని ఇటువంటి ప్రకటనలు మరుగున పరుస్తున్నాయి. భారత్, చైనా ల ప్రజలు అక్కడి దోపిడీ ప్రభుత్వాల వల్ల ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇటువంటి ప్రకటనలు మరుగుపరచడం ఒక సంగతి కాగా, అసలా ప్రకటనల్లోనే పూర్తి అవాస్తవాలు ఉండడం మరొక సంగతి. ఈ ప్రకటనలను తిరస్కరించి వాస్తవ సంగతిని వెల్లడించాలసిన బాధ్యత భారత పాలకులపైన కూడా ఉంది. వారా బాధ్యతను నిర్వహించకపోవడం మరొక చేదు వాస్తవం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి